PV Sindhu: 70 ఏళ్ల వ్యక్తి నన్ను కిడ్నాప్‌ చేస్తానన్నాడు: పీవీ సింధు

ఇప్పటివరకూ తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) అన్నారు.....

Published : 20 Aug 2022 14:16 IST

హైదరాబాద్‌: ఇప్పటి వరకూ తాను ఎన్నో ప్రేమలేఖలు అందుకున్నానని, ఆ లేఖలన్నీ నేరుగా ఇంటికే వస్తుంటాయని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) అన్నారు. ఇంట్లో వాళ్లందరూ ఆ ప్రేమ లేఖలు చదువుతారని చెప్పారు. గతంలో ఓ 70 ఏళ్ల వ్యక్తి  ఇలాగే లేఖ రాశాడని, తనకిచ్చి పెళ్లి చేయకపోతే నన్ను కిడ్నాప్‌ చేస్తానని ఆ లేఖలో బెదిరించాడని సింధు చెప్పుకొచ్చారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న సింధు.. తన కెరీర్‌, పర్సనల్‌ లైఫ్‌పై ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌ ప్రోమో విడుదలైంది.

‘‘ఏదైనా పోటీల్లో గెలుపొంది పతకం తీసుకున్న సమయంలో అక్కడ మన జాతీయ గీతాన్ని వినిపిస్తుంటారు. ఆ క్షణం నాకెప్పుడూ కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. మన దేశ పతాకం, జాతీయ గీతం విదేశాల్లోనూ వినిపించినప్పుడు గర్వంగా అనిపిస్తుంది’’ అని సింధు చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ఎంతోమంది నటీనటుల్ని తాను అభిమానిస్తుంటానని, ముఖ్యంగా ప్రభాస్‌ అంటే తనకెంతో ఇష్టమని ఆమె అన్నారు. ప్రభాస్‌ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ.. ‘సింధు సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందా?’ అని ప్రశ్నించగా.. ‘‘ఏమో.. నా బయోపిక్కే ఉండొచ్చేమో ఎవరికి తెలుసు?’’ అని నవ్వులు పూయించారు.

అనంతరం తన ఆట తీరుపై వచ్చిన విమర్శలపై ఆమె స్పందించారు. ‘‘నేను ఏదైనా పోటీలో విఫలమైనప్పుడు.. ‘ఎందుకలా ఆడుతున్నావ్‌? అంతకుముందు గేమ్‌లో ఆడినట్లు ఇక్కడ కూడా ఆడొచ్చు కదా’ అని చెబుతుంటారు. వాళ్ల మాటలు విన్నప్పుడు.. ‘నువ్వు వచ్చి ఆడు.. నీక్కూడా తెలుస్తుంది’ అని చెప్పాలనిపిస్తుంది’’ అని సింధు అన్నారు. చివరగా ఓ ప్రముఖ అకాడమీ నుంచి బయటకు వెళ్లిపోవడంపై ఆమె మాట్లాడుతూ.. ‘‘అక్కడ నాకు కొన్ని విషయాలు నచ్చలేదు’’ అంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని