Vaishnav Tej: చిరు మామ అప్పుడు సీరియస్‌ అయ్యారు: వైష్ణవ్‌ తేజ్‌

‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’తో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘ఉప్పెన’తో నటుడిగా తెరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే మెప్పించేశారు వైష్ణవ్‌ తేజ్‌....

Updated : 24 Aug 2022 11:30 IST

హైదరాబాద్‌: ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’తో బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘ఉప్పెన’తో నటుడిగా తెరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే మెప్పించేశారు వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej). చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వైష్ణవ్‌ వరుస ప్రేమ కథలతో అలరిస్తున్నారు. ‘ఉప్పెన’, ‘కొండపొలం’ తర్వాత ఆయన హీరోగా నటిస్తోన్న మూడో ప్రేమకథా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). గిరీశయ్యా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్‌ తేజ్‌, దర్శకుడు గిరీశయ్యా తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

‘‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’తో బాలనటుడిగా పరిచయమయ్యాను. ఆ సినిమాలో నా పాత్రకు ఎలాంటి హావభావాలు ఉండవు. కేవలం కుర్చీలో కూర్చొని ఉండటమే. అయితే ఓ సీన్‌లో నేను నవ్వేశాను. అప్పుడు పెదమామయ్య (చిరంజీవి) సీరియస్‌ అయ్యారు. మా కుటుంబం మొత్తం ఒకే చోట కలిసినప్పుడు చిరు మామ ఓరేయ్‌ అని పిలిస్తే చాలు.. మేమంతా పలుకుతాం. ఇక, నేను హీరోగా తెరంగేట్రం చేసిన ‘ఉప్పెన’ స్క్రిప్ట్‌ని మొదట నేనూ, నా స్నేహితులం విన్నాం. సుకుమార్‌, మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు మామయ్యని ప్రత్యేకంగా కలిసి స్టోరీ చెప్పారు. ఆయన వెంటనే.. ‘ఐడియా బాగుంది. సినిమా చేయండి’ అని అన్నారు’’

అనంతరం ‘ఉప్పెన’ షూట్‌లో తాను కన్నీళ్లు పెట్టుకున్నానంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారాయన. ‘‘ఉప్పెన’ చేస్తున్నప్పుడు ఓ సీన్‌లో కృతిశెట్టితో.. ‘నీకో మాట చెప్పాలి బేబమ్మ’ అని నేను కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాలి. ఎందుకో తెలియదు ఆ క్షణం నాకు మాటలు రాలేదు. ఎమోషన్స్‌ పండించలేకపోయా. దాదాపు 20 టేక్స్‌ పైనే తీసుకున్నాను. ఆ సీన్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అందరి సమయాన్నీ.. డబ్బునీ వృథా చేస్తున్నా అనిపించింది. ఒక్కసారిగా బాధతో కన్నీళ్లు వచ్చేశాయి. ఇక, ఈసినిమాలో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ ఉంటుంది. అది చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతమంది ముందు ఎలా చేయాలా? అనిపించింది’’ అని వైష్ణవ్‌ తెలిపారు. ఇక, పవన్‌కల్యాణ్‌ నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ చిత్రాలను తాను దాదాపు 120 సార్లు చూసినట్లు చెప్పారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని