venkat: ‘దేనికీ పనికి రాడు.. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు’ అని తిట్టారు!

స్టార్‌ హీరోలతో కలిసి పని చేసిన వెంకట్‌కు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అంటే అమితాభిమానం.

Updated : 09 Mar 2022 16:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు ఇండస్ట్రీలో షారుఖ్‌ఖాన్‌గా పేరు.. అందమైన నటుడు..  హీరోగా, సపోర్టింగ్‌ నటుడిగా చేసిన కుర్రాడు ఎవరనుకుంటున్నారా.. స్టార్‌ హీరోలతో కలిసి పని చేసిన వెంకట్‌కు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అంటే అమితాభిమానం. తన అనుభవాలను, అనుభూతులను ఆలీతో సరదాగా కార్యక్రమంలో పంచుకున్నారు.

ఎక్కడుంటున్నారు.. ముంబయిలోనా.? హైదరాబాద్‌లోనా..?

వెంకట్‌: గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నా. అంతకు ముందు ముంబయిలో ఉండేవాళ్లం. ఆ తర్వాత ఇక్కడకు వచ్చేశాం. నాన్నకు ప్రకటనల సంస్థ ఉండేది. నేను పుట్టింది విజయవాడలోనే అయినా, ముంబయిలో పెరిగా. అక్కడే నా చదువు సాగింది. నాకు ఒక సోదరి. ఆమె ఐర్లాండ్‌లో ఉంటారు. మీ(ఆలీ) షోలు, మీరు పోషించే పాత్రలంటే ఆమెకు ఎంతో ఇష్టం.

ఇప్పటికీ చాలా మంది జెమ్స్‌ అని పిలుస్తారట..?

వెంకట్‌: అది ‘అన్నయ్య’తోనే! నా మొదటి సినిమా ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’ హిట్‌. కానీ, ‘అన్నయ్య’తో గుర్తింపు వచ్చింది. చిరంజీవి గారి ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఉంటారో తెలిసిందే కదా! చిరంజీవి గారి తమ్ముళ్లుగా నటించిన మమ్మల్ని జెమ్స్‌ అంటారు. అందుకే అలా అందరికి అలవాటు అయిపోయింది.

మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి మీరే వచ్చారా..? ఎవరైనా బలవంతంగా తోశారా..?

వెంకట్‌: చదువు మీద ధ్యాస లేదు. అమ్మానాన్నల కోసం చదివానే తప్పా.. పెద్దగా ఏమీ లేదు. బీ.కాం వరకూ చదివా. మా కంపెనీకి మోడల్‌గా చేసినప్పుడు ఆ స్టిల్స్‌ చూసి సినిమాలోకి తీసుకున్నారు.

మిమ్మల్ని చాలా మంది అక్కినేని వెంకట్‌ అనుకుంటారట..? 

వెంకట్‌: నాగార్జున గారు నన్ను సినిమా ఇండస్ట్రీకి ‘సీతారాముల కల్యాణం చూతము రారండి’తో పరిచయం చేశారు. అందుకే జనాలు కాస్త కన్ఫ్‌ఫ్యూజ్‌ అవుతారు.

సినిమాల్లో అవకాశం  ఎలా వచ్చింది?

వెంకట్‌: మాకు స్టెర్లింగ్‌ రెడీమేడ్‌ గార్మెంట్స్‌ ఉండేది. ఆ బ్రాండ్‌కు మోడలింగ్‌ చేశా. ఆ ఫొటోలు చోటా కె. నాయుడు చూశారు. సీరియల్‌ కోసం మా వాళ్లను కలిశారు. సీరియల్‌ ఇష్టం లేదని చెప్పడం.. ఆయనే వైవీఎస్‌ చౌదరికి నా గురించి చెప్పారు. అప్పుడే నాగార్జునగారు, వైవీఎస్‌ చౌదరి కొత్తవాళ్లతో సినిమా చేయాలనుకుంటున్నారు. ‘నిన్నేపెళ్లాడతా’ ఇంటిలోనే స్క్రీన్‌ టెస్ట్‌ జరిగింది. అక్కడికి ముగ్గురం వచ్చాం. అందులో ఒకమ్మాయి కూడా ఉంది. ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాలో నాగార్జున వేసుకున్న డ్రెస్‌ వేసుకోమన్నారు. తెలుగులో స్టైలిష్‌ హీరో అంటే నాగార్జున. ఆయనంటే ఎంతో అభిమానం. ఆయన దుస్తులను వేసుకున్నా. వైవీఎస్ ప్రశ్నలు అడగడం.. నేను జవాబులు చెప్పడం.. ఇది స్క్రీన్‌ టెస్ట్‌. పక్కనున్నోడు బాడీబిల్డర్‌. డ్యాన్సులు చేస్తున్నాడు. అతనుండగా నన్నేం ఎంపిక చేస్తారని అనుకున్నా. నాగార్జున గారు నన్నే హీరోగా ఎంపిక చేశారు. అలా పెద్ద బ్యానర్‌లో పని చేసే అవకాశం వచ్చింది. అప్పటికి నాకు యాక్టింగ్‌ అంటే ఏంటో తెలియదు. తర్వాత శిక్షణ ఇచ్చారు. వైవీఎస్‌ గారే నాకు గురువు. నా మొదటి షాట్‌ బాత్‌రూంలో తీశారు. ఒక సీనులో నాగేశ్వరరావుగారు నిజంగానే కొట్టారు. రామచంద్రపురం కోటలో షూటింగ్‌ జరుగుతుండగా ఆయన నా చెంపపై కొడుతుండగా పక్కకు జరగాలి. నేను జరగలేదు. ఆయన నిజంగానే కొట్టారు. షూటింగ్‌ అయిన తర్వాత చూస్తే చెంపపై అచ్చు పడింది.

దిగ్గజ నటుడు అక్కినేని దగ్గర ఏం నేర్చుకున్నారు..?

వెంకట్‌: సీనియర్‌ నటుల కెమెరా సెన్సు అద్భుతం. వాళ్ల ధ్యాస పని మీదే ఉంటుంది. వాళ్ల నుంచి చాలా గమనించా.

నటి విజయశాంతితో మీకు బంధుత్వం ఉందా..?

వెంకట్‌: విజయశాంతి గారు సూపర్‌స్టార్‌. 30-35 ఏళ్ల నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్‌. మా గాంధీ టెక్స్‌ అనే బ్రాండ్‌కు మోడల్‌ ఆమె. మాకు మాత్రమే చేశారు. బయట వాళ్లెవరికీ చేయలేదు. ‘నిప్పురవ్వ’ షూటింగ్‌ ముంబయిలో జరిగింది. అప్పుడు చిన్న పిల్లాడిని. అప్పటి నుంచి మా కుటుంబంతో పరిచయం ఉంది.

హీరో బాలకృష్ణతో ఎలాంటి అనుబంధం..?

వెంకట్‌: చిన్నప్పటి నుంచే పరిచయం. ‘భలేవాడివి బాసూ’ సినిమా చేశాం. ఆయన ఎనర్జీ లెవల్స్‌ వేరే. మంచి వేసవి. తలకోన అడవుల్లో షూటింగ్‌. అక్కడ 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. చనిపోయినట్టు నటిస్తున్న నన్ను ఎత్తుకొని పరిగెత్తాలి. చెమటలు పడుతున్నా..67 కిలోలున్న నన్ను ఎత్తుకొని వెళ్లేవారు. మధ్యాహ్నం కూడా షూటింగ్‌ చేసేవారు. 

కాలేజీకి వెళ్లకపోయినా మీకు కప్పు ఇస్తారట ఎందుకు.?

వెంకట్‌: నీకు కొన్ని సీక్రెట్స్‌ చెబుతానన్న కదా! మీ షో ద్వారా మా పేరెంట్స్‌ కూడా కొన్ని తెలుసుకోవాలి. ముంబయిలో జూనియర్‌, సీనియర్‌ కాలేజీలు రెండూ ఉంటాయి. పాఠశాల చదువు అయిపోయిందని బ్యాగు ఇంట్లో పడేసి, జేబులో దువ్వెన, చేతిలో ఒక బుక్కు పట్టుకొని కాలేజీకి వెళ్లా.

కాలేజీకి ఒక్క బుక్‌ తీసుకెళ్లి ఏం చేశారు..?

వెంకట్‌: కాలేజీకి వెళ్లగానే పాత స్నేహితులు 20 మంది ఉన్నారు. అంతా ఓ చెట్టు దగ్గర చేరాం. నా పుస్తకం తీసి చెట్టు మీద పెట్టా. దాదాపుగా ఐదేళ్లపాటు అది అలాగే ఉంది. ఒక్కసారి కూడా క్లాస్‌కు వెళ్లలేదు. కాలేజీ ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకూ అయితే నేను 10.30 తర్వాతే వెళ్లేవాడిని. ఇంటర్‌ కాలేజ్‌ కాంపిటీషన్లు జరిగేవి. వాటిల్లో ట్రోఫీలు వచ్చేవి. అవి తీసుకెళ్లి ప్రిన్సిపాల్‌కు ఇచ్చేవాడిని. వీడితో కాలేజీకి పేరొస్తుందని అనుకునేవారు. అలా ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకున్నా. పరీక్షలప్పుడు అధ్యాపకులు ‘నీవు ఈ కాలేజీవాడివేనా, ఐడీ కార్డు చూపించు’అని ఆడిగేవారు. ఎందుకంటే నన్నెప్పుడూ వాళ్లు క్లాస్‌లో చూడలేదు.

అప్పటికి శివ సినిమా చూశావా..?

వెంకట్‌: ఇది సినిమా ఇండస్ట్రీకి రాకముందు దిగిన ఫొటో ఇది. నా మొదటి ఫోర్ట్‌పోలియో. ఈ ఫొటోచూసి వైవీఎస్‌గారు సినిమాకు ఎంపిక చేశారు. ఇప్పటి ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ హకీం అలీమ్‌ నాకు చాలా క్లోజ్‌ఫ్రెండ్‌. ఫొటోగ్రాఫర్‌, నేను, అలీమ్‌ కలిసి ఫొటోలు దిగాం. అలీమ్‌ ఇప్పుడు మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, ప్రభాస్‌, బిగ్‌స్టార్స్‌కు పనిచేస్తున్నారు. అలాగే క్రికెటర్లు సచిన్‌, కోహ్లీ యాడ్స్‌ చేయాలంటే ఆయన్నే పిలుస్తారు.

ఏ సినిమా షూటింగ్‌లో యాక్సిడెంట్‌ జరిగింది..?

వెంకట్‌: 2014లో ‘ఆ ఐదుగురు’ చేస్తుండగా జరిగింది. ఐదుగురు కుర్రాళ్లకు పోలీసు శిక్షణ అధికారిగా అప్పాలో షూటింగ్‌ చేస్తున్నాం. రియల్‌ పోలీసు అధికారుల శరీర స్థితిని తెలుసుకోవడానికి ఓ మిషన్‌ ఉంటుంది. దాని ముందు నిలబడితే ఫిట్‌నెస్‌ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. వాళ్లే నా ఫిట్‌నెస్‌ చూసి షాక్‌ అయ్యారు. ఉదయం 11 గంటలకు అన్నీ పూర్తి చేసుకున్నాం. తర్వాత షాట్‌లో నిలబడాలి. కానీ కొంతమంది కొత్త డైరెక్టర్లు ఏదో చూపించాలని జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కుర్రాళ్లు దూకుతున్నారు.  డైరెక్టర్‌ నన్ను కూడా వెళ్లమన్నారు. అక్కడ బెడ్లు కూడా లేవు. వెళ్లి దూకా.. ముందుకు పడుతున్నాననుకున్నా..కానీ వెనక్కి పడిపోయా. ఒక నిమిషం పాటు ఏమీ అర్థం కాలేదు. ఆస్పత్రికి వెళితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. చాలా సినిమాలు కోల్పోయాను.

ఓ డ్యాన్సు మాస్టారు వీడు దేనికీ పనికి రాడు..ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని అన్నారట..?

వెంకట్‌: పేరు వద్దులే గానీ.. మొదటి సినిమాలో జరిగింది. అప్పటి వరకు నటనంటే నాకు ఏమీ తెలియదు. ఆయనేమో సీనియర్‌ మాస్టర్‌. దుబాయిలో షూటింగ్‌ జరుగుతోంది. శివాజీ, కమల్‌ నా పక్కన ఫ్రెండ్స్‌. వాళ్లు కూడా ‘వీడికేం రాదు.. మమ్మల్ని హీరోగా పెట్టుకోవచ్చు కదా’ అనే ఫీలింగ్‌ ఉంది. ఎడారిలో పాట చేస్తున్నపుడు సెకండ్‌ హీరో అందులో ఉంటాడు. ఇసుకలో హడావుడి చేయడంతో డ్యాన్సు మాస్టారు హీరోకు ఏం రాదు.. రెండో హీరో బాగా చేస్తున్నాడని తమిళంలో తిట్టారు.

ఎన్ని సినిమాలు చేశారు..?

వెంకట్‌: ఎక్కువగా చేయలేదు. అది లక్కీగా ఫీల్‌ అవుతున్నా. 15-20 సినిమాలు చేసి ఉంటా. వాటిలో నాలుగు బ్లాక్‌బ్లస్టర్‌ మూవీస్‌ ఉన్నాయి. సీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ఆనందం, శివరామరాజు సినిమాలతో ప్రజలకు గుర్తిండిపోయా. 

అన్నయ్య మెగాస్టార్‌తో చేయడం ఎలా ఉంది..?

వెంకట్‌: ‘యమకింకరుడు’తో అన్నయ్యకు ఫ్యాను అయ్యా. విజయవాడకు వేసవి సెలవులకు వచ్చా. ఊర్వశి థియేటర్‌ వద్ద పునుగులు తినడం, పోస్టర్లను చూడటం హాబీ. ఇంట్లో రూ.20 ఇస్తే అన్నయ్య సినిమాలు రెండు చూసేవాడిని. ఆయనకు వీరాభిమానిని. ‘ఆజ్‌కా గుండారాజ్‌’ విడుదలయ్యింది. ముంబయిలో అందరికి చెప్పే వాడిని సౌత్‌ కా హీరో అంటూ..  ఓ సారి హోటల్‌ లిఫ్టులో చిరంజీవి దిగి వస్తుండగా చూశా..ఎవరూ మమ్మల్ని పరిచయం చేయలేదు. వెళ్లి వాటేసుకున్నా. త్వరలో మనం ఓ సినిమా చేయబోతున్నామని అప్పుడే చెప్పారు. అదే ‘అన్నయ్య’. అందుకే నిజమైన అన్నదమ్ముల్లా ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నయ్యను చూస్తూ ఉండిపోయేవాడిని. ఆయన కళ్లలో ఉన్న పవర్‌ చాలా గొప్పది. ఆయనతో ఎన్నో అనుభూతులున్నాయి. ముంబయిలో మా ఇంటికి కూడా వచ్చారు. నేను వేసుకున్న దుస్తులంటే కూడా అన్నయ్యకు చాలా ఇష్టం.

హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే సపోర్టింగ్‌ క్యారెక్టర్లకు ఎందుకు మారిపోయినట్టు..?

వెంకట్‌: అన్నయ్య, శివరామరాజు లాంటి సినిమాలు మల్టీస్టారర్‌ మూవీలే. హిందీలో ఇద్దరు, ముగ్గురు కలిసి చేస్తారు. ఇక్కడా అలాగే అనుకున్నా. సపోర్టింగ్‌ పాత్రలు కాదు. మహేష్‌బాబు, విష్ణుతో చేశా. నా మొదటి సినిమా హిట్‌ అయినప్పుడు కొత్త డైరెక్టర్లుగా కథలు వినిపించిన వారిలో వీవీ వినాయక్‌, వీఎన్‌ ఆదిత్య ఉన్నారు. డేట్స్‌ ఇచ్చినా నిర్మాతలను తెచ్చుకోలేకపోయారు.  సింగిల్‌ స్క్రీను నుంచి మల్టీఫెక్స్‌లోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. హిట్‌ లేకపోవడంతో కష్టమయ్యింది.

సొంతంగా ఒక సినిమా కూడా తీసినట్టు ఉన్నారు?

వెంకట్‌: అవును, అందులో ఆలీ దొంగగా నటించారు. సినిమా పేరు ‘కొంచెం కొత్తగా’. రాజు డైరెక్టర్‌. తెలుగులో మీరు.. హిందీలో జానీలివర్‌ చేశారు. కానీ హిందీలో ఇంకా విడుదల చేయలేదు. సినిమా నిర్మించడం తేలిక.. కానీ విడుదల చేయడం చాలా కష్టమని అర్థమయ్యింది. చాలా మంచి సినిమా. అప్పట్లో తీయడంతో పెద్దగా లాభాలు రాలేదు. ఇపుడు తీస్తే చాలా మందికి నచ్చేదనిపిస్తుంది.

పెళ్లి అయ్యిందా..?

వెంకట్‌: ఐయామ్‌ సింగిల్‌ నౌ. చిన్నప్పటి నుంచి అనుకున్నది సాధించాను. ఇక్కడే సక్సెస్‌ ఇలా అందుకొని అలా స్లిప్‌ అయిపోయింది. మళ్లీ విజయాన్ని అందుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచన చేస్తా.

ఏ హీరోయిన్‌ అంటే తెలుగు ఇండస్ట్రీలో బాగా ఇష్టం..?

వెంకట్‌: మొదటి సినిమా హీరోయిన్‌ చాందిని బాగుందన్నారు. కానీ అమ్మాయికి నాకూ పడేది కాదు. ఇతర హీరోయిన్లు కూడా ఇష్టమే. చాందినిని స్క్రీన్‌ టెస్టు సమయంతో వద్దన్నాననుకుంటా. వాళ్లకు తెలిసిపోయింది. నా తొలి సినిమా అప్పటి నుంచే నాతో గొడవపడేది. అన్నయ్య సినిమాలో నా పక్కన అనుకుంటే, అన్నయ్యతో చెప్పి వద్దన్నాను.

మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారా?

వెంకట్‌: ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో రెండు వెబ్‌ సిరీస్‌లు చేశా. సక్సెస్‌ అయ్యాయి. రెండు సినిమాలు చేస్తున్నా. మరో సినిమా పెద్ద బ్యానర్‌లో చేయబోతున్నా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు