Published : 06 May 2022 02:13 IST

Suma: ఇప్పటివరకు మాకు విడాకుల ఆలోచన రాలేదు. ఇకపై రాదు కూడా!

యాంకరింగ్‌ గురించి ఓ పుస్తకం రాస్తే అందులో సగానికి పైగా ఆమె గురించే ఉంటుంది. టీవీల్లోనూ, ఈవెంట్స్‌లోనూ స్టార్‌ యాంకర్‌గా వెలుగొందుతోంది. ఇప్పుడు నటిగా ‘జయమ్మ పంచాయతీ’ లాంటి వినూత్న కథాంశంతో అలరించనుంది. ఆమె ఎవరంటే మల్టీ టాలెంట్‌డ్‌ స్టార్‌ యాంకర్‌, నటి ‘సుమ’. ఇటీవల ఈటీవీ ‘ఆలీతో సరదాగా’లో చెప్పిన ముచ్చట్లు చూద్దాం.

జయమ్మ పంచాయతీ ఎందుకు పెట్టారు.. సుమమ్మ పంచాయతీ అని పెట్టుకోవచ్చు కదా?
సుమ: సుమమ్మ పంచాయతీ రోజూ సెట్‌లో డైరెక్టర్‌లతో జరుగుతూనే ఉంటుంది వాళ్లకి తెలుసు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ‘జయమ్మ పంచాయతీ’ అని పెట్టాం.

సినిమా చేయక ముందు కథ విన్నావా.. ఎలా అనిపించింది?
సుమ: కథ చాలా బాగా అనిపించింది. డిఫరెంట్‌గా ఉంది. ఒక ఉమెన్‌ క్యారెక్టర్‌ని తీసుకొని దాంతోపాటే స్టోరీని లీడ్‌ చేసే కథలు చాలా తక్కువ వస్తాయి. అలాంటి కథలు నా దగ్గరికి మరీ తక్కువ వస్తాయి.

మధ్యలో చాలా ఆఫర్లు వచ్చాయి.. ఎందుకు చెయ్యలేదు?
సుమ: టీవీ పరిశ్రమలో మనం వచ్చామా, మన పని చేసుకున్నామా, టైమ్‌, వేరే వాళ్ల కోసం వెయిటింగ్‌ లాంటివి లేకుండా 6 గంటలకు ప్యాకప్‌ చెప్పామా, వెళ్లిపోయామా అన్నట్లు హాయిగా ఉంది జీవితం. ఒక అమ్మగా నాకు చాలా వెసులుబాటు ఉంది. ఇప్పుడు మా అమ్మాయి పదో తరగతికి వచ్చింది. తన పని తను చేసుకోగలుగుతుంది కాబట్టి నేను కొంచెం బయటకు రాగలుగుతున్నాను.

నా షోలో నువ్వు పంచాయతీ చెయ్యడానికి వచ్చావా (నవ్వుతూ)
సుమ: ఆల్రెడీ మన పంచాయతీ ఇంతకు ముందు అయిందిగా. నేను మిమ్మల్ని అన్నానని, మీరు హర్ట్‌ అయ్యారని, ఇదంతా చూసి వాళ్లంతా హర్ట్‌ అయ్యారు. కానీ నేను ఇప్పటివరకు వర్క్‌ చేసిన కో- హోస్ట్స్‌లో ఎవరు బెస్ట్‌ అంటే నేను మీ పేరే చెబుతాను.  

నీ పూర్తి పేరు ఏంటి?
సుమ: పల్లెశెన పాచివిటల్‌ సుమ. ఫామ్‌ నింపేటప్పుడు కూడా నా పేరు చాలా సార్లు నేనే తప్పు రాశా. పెళ్లి చేసుకుంది ఇక్కడి కుర్రాడిని కాబట్టి ఈ పేరు నాకు బాగా కలిసివచ్చింది. ఈజీ నేమ్‌ రావాలి అనుకునే సరికి కనకాల వచ్చేసింది.

ఇంత బిజీగా ఉండే సుమ డైరెక్టర్‌లో ఏం చూసి ‘జయమ్మ పంచాయతీ’ కోసం 40 రోజులు కాల్‌షీట్స్‌ ఇచ్చింది!
సుమ: సినిమా అంతా పాలకొండలో షూటింగ్‌ జరిగింది. వైజాగ్‌ నుంచి 3 గంటలు జర్నీ చేయాలి. అక్కడే స్టే చేశాం. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో  ఏ తెలుగు సినిమా షూట్‌ చేయలేదు. మేమే ఫస్ట్‌ చేశాం. ఆ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌కే సొంతం. ఆ ఊరులో ఉండే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాకి డబ్బింగ్‌ చెప్పలేదు. అంతా సింక్‌ సౌండ్‌లోనే చేసేశాం. షూటింగ్ జరిగేటప్పుడే డబ్బింగ్‌ అయిపోయింది. అందుకే అంతా న్యాచురల్‌గా వచ్చింది. నేను ఇంతకు ముందు చాలా నాటకాలు చేశాను. హిందీలో ‘పుత్రకామేష్ఠి’ అనే నాటకానికి నాకు రెండుసార్లు నేషనల్‌ ఆవార్డు వచ్చింది. 

టీవీ షోస్‌లో, ఈవెంట్‌లలో కానీ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతుంటావు. అసలు నీ ట్రాక్‌ రికార్డు ఏంటి?
సుమ: అంటే ఇప్పటివరకు ఎన్ని ప్రి-రిలీజ్‌లు చేశాననా మీ ప్రశ్న. రెండు సంవత్సరాల క్రితం లెక్కవేసుకుంటే 250 వరకు ప్రీ రిలీజ్‌లు చేసినట్లు లెక్క వచ్చింది. 300 ఆడియో ఫంక్షన్లు , 50కి పైగా అవార్డు ఫంక్షన్లు చేసి ఉంటాను. నన్ను ఈ రంగంలోకి మొదటిసారి రమ్మని అడిగినప్పుడు మా అమ్మనాన్న, రాజీవ్‌  నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇదంతా నేను అదృష్టమనను. మనం ఏమి చేస్తామన్నది మనమే నిర్ణయించుకుంటాం. దానికి తగ్గట్టు కష్టపడాలి. ఈ రోజుకీ  ప్రేక్షకులను అలరించడానికే కష్టపడుతుంటాను. 

ఒక సంవత్సరం క్రితం వరకు నువ్వు, రాజీవ్‌ విడిపోయారని వార్తలు వచ్చాయి.. మరి ఆ పంచాయతీ ఈ జయమ్మపంచాయతీలో ఉందంటావా?
సుమ: అసలు పెళ్లి అనేదే ఒక పంచాయతీ. మా ఇద్దరి పంచాయతీ మొదలై 23 సంవత్సరాలు అయింది. ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలో. మొగుడుపెళ్లాం అన్న తరువాత కచ్చితంగా చిన్న చిన్న గొడవలు వస్తాయి. రోజులో కనీసం 2, 3 సార్లు అవుతాయి. అవన్నీ సహజం. కానీ, వెబ్‌సైట్స్‌ వాళ్లు మేము విడాకులు తీసుకున్నట్లు రాసేశారు. అలాంటిది ఏమీ లేదు. మేము కలిసే ఉన్నాం. మేము ఆనందంగా ఉన్నాం. అలాంటి వార్తలు చూసి బాధపడ్డాను. కానీ ఎక్కడా ఏమీ చెప్పలేదు. ఈ టాపిక్‌ గురించి మొదటిసారి ఇక్కడే స్పందిస్తున్నాను. భార్యభర్తలు విడాకులు తీసుకోవడం చాలా సులభం కానీ, అమ్మనాన్నలుగా ఉన్నప్పుడు అది చాలా కష్టం. పిల్లలు అన్నది ఒక బాధ్యత. అసలు ఇప్పటివరకు మాకు విడాకుల ఆలోచన రాలేదు. ఇకపై రాదు కూడా.

త్వరలోనే మీ అబ్బాయిని హీరో చేస్తున్నారట!
సుమ: మా అబ్బాయికి యాక్టర్‌ అవ్వాలని కోరిక ఉంది. త్వరలోనే దానికి సంబంధించి విషయాలు చెబుతాను. అమ్మాయికి కూడా నటి కావాలని ఉంది.

‘కల్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది ?
సుమ: పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదు అనుకున్నాను. దాసరి నారాయణరావు గారు వచ్చి అడిగినప్పుడు చాలా కండిషన్స్‌ పెట్టాను. ఆయన అన్నింటికి సరే అన్నారు. అలా ఆ సినిమా చేసేశా.

‘జయమ్మ పంచాయతీ’ నిర్మాత గురించి చెప్పండి?
సుమ: బలగ ప్రకాశ్‌ గారు ఆ సినిమాకు నిర్మాత. ఆయనది శ్రీకాకుళమే. అక్కడ బిజినెస్‌ చేస్తారు. సినిమాలంటే ఆసక్తితో ఈ సినిమా చేశారు. 

ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది కీరవాణి గారు. కథ నచ్చి చేశారా. సుమ కోసం చేశారా?
సుమ: మా డైరెక్టర్‌కు కీరవాణి గారంటే చాలా ఇష్టం. నేను కీరవాణి గారికి ఫోన్‌ చేసి అడగగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. మాకు ఈ సినిమాలో కీరవాణి గారు కొండంత అండ. 

ఈ సినిమా తర్వాత ఇంకా సినిమాలు చేస్తారా?
సుమ: తప్పకుండా. ఇలాంటి మంచి కథలు వస్తే చేస్తాను. 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని