స్టూడియో నుంచి బయటకు పొమ్మన్నారు

టైమింగ్‌తోపాటు రైమింగ్‌ కూడా ఉన్న కామెడీ ఖిలాడీలు అభినయ కృష్ణ, రామ్‌ ప్రసాద్‌.  జబర్దస్త్‌లో నవ్వులు పూయించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆ ఇద్దరూ  ‘ఆలీతో సరదాగా’లో పంచుకున్న విశేషాలు మీకోసం.

Updated : 16 Jun 2021 18:00 IST

ఒకరిదేమో ఆటోపంచ్‌లతో జలక్కులిచ్చే కామెడీ.. మరొకరిది కొత్త కాన్సెప్ట్‌లతో ఒత్తిడిని తగ్గించే కామెడీ. టైమింగ్‌తోపాటు రైమింగ్‌ కూడా ఉన్న కామెడీ ఖిలాడీలు అభినయ కృష్ణ, రామ్‌ ప్రసాద్‌. ‘జబర్దస్త్‌’లో నవ్వులు పూయించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆ ఇద్దరూ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పంచుకున్న విశేషాలు మీకోసం..

ఆటో రామ్‌ ప్రసాద్‌ పేరెలా వచ్చింది?
రామ్‌ ప్రసాద్‌: ఏదైనా గ్యాప్‌ దొరికితే పంచ్‌లు వేయడం అలవాటు. కాసేపు ఆలోచిస్తే కానీ నేను పంచ్‌ వేశానన్న విషయం అర్థం కాదు చాలా సార్లు. అందుకే ఆటో రాంప్రసాద్‌ అనే పేరొచ్చింది. జబర్దస్త్‌ జడ్జి రోజా ఈ పేరు పెట్టారు.
ఏ ఊరు మీది? నాన్న ఏం చేస్తారు?
రామ్‌ ప్రసాద్‌: పుట్టి పెరిగింది వైజాగ్‌. నాన్న కుక్‌గా పనిచేసేవారు. నేను జబర్దస్త్‌లోకి వచ్చాక ఆ పని మానిపించి క్యాటరింగ్‌ పెట్టించాను. ఇప్పుడు అది కూడా వద్దని హైదరాబాద్‌ తీసుకొచ్చాను.

ఏమవుదామని ఇండస్ర్టీకి వచ్చావు?
రామ్‌ ప్రసాద్‌: మనం ఏదో అవుదామని రావొద్దు. ఇండస్ర్టీనే మనం ఏమవ్వాలో నిర్ణయిస్తుంది. నటుడిని అవుదామని వచ్చాను. కొన్నాళ్లు ఎడిటింగ్‌ పని కూడా చేశాను.

అంతకుముందు ఏం చేసేవాడివి?
రామ్‌ ప్రసాద్‌: మెడికల్‌ షాప్‌లో పనిచేశాను. కాలేజీ అయిపోగానే అందులో చేరిపోయాను. అక్కడ బాయ్‌గా అయిదేళ్లు పనిచేశాను.
రచయితగా ఎప్పుడు మారావు?
రామ్‌ ప్రసాద్‌: రామస్వామి అనే రచయితతో మాట్లాడేటప్పుడు నేను వేసే పంచులు ఆయనకు నచ్చాయి. దాంతో పంచులు బాగా వేస్తున్నానని కొన్ని సీన్లు రాసుకు రమ్మన్నాడు. బాగా ఉన్నాయనే సరికి ఎడిటింగ్‌ నుంచి రైటింగ్‌లోకి దిగాను. ఆ తర్వాత నటన మీద ఇంట్రెస్ట్‌ పుట్టింది. ఫొటోలు పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టు తిరిగాను. అలా తిరుగుతుంటే నాగచైతన్య ‘జోష్‌’ సినిమాలో నటించే అవకాశం దొరికింది.

ఓ పెద్ద హీరో.. మీ గృహ ప్రవేశానికి కొత్త బట్టలు పంపించారంట?ఎవరు?
రామ్‌ ప్రసాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి గారు పంపించారు. గృహప్రవేశానికి కార్డు ఇచ్చి ఆహ్వానించాలని చిరంజీవి గారి పీఏకి ఫోన్‌ చేశాను. మరుసటి ఉదయమే ఆయన ఇంటికి రమ్మన్నారు. కార్డు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. రావడం కుదరట్లేదని చెప్పారు. ఆశీర్వదిస్తే చాలు అనుకున్నాను. గృహప్రవేశం రోజు పూజలో ఉండగా గంగాధర్‌ అనే వ్యక్తితో కొత్త వస్త్రాలు పంపించారు మెగాస్టార్‌. వాటిని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. 
ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిందా?
రామ్‌ ప్రసాద్‌: లవ్‌ కమ్‌ అరేంజ్డ్ మ్యారేజ్‌. మూడో తరగతి నుంచి మేమిద్దరం కలిసి చదువుకున్నాం. అప్పుడు బెంచ్‌ మీద కలిసి పెరిగాం. ఆ తర్వాత పెళ్లి పీటల మీద తాళి కట్టాల్సి వచ్చింది. అలా తెలియకుండానే అంతా అయిపోయింది. మాకు ఇద్దరు పిల్లలు.
అభి అసలు పేరు హరికృష్ణ అని తెలుసా?
రామ్‌ ప్రసాద్‌: తెలియదు. 8 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం. కానీ జబర్దస్త్‌ టీంలో అందరికీ తలకాయలాంటివాడు. ఎవరికేదైనా చేయాలన్నా అభికే చెబుతాం. ఆయన ముందుండి అన్ని చూసుకుంటాడు. ఈ మధ్య జబర్దస్త్‌ జీవన్‌ ఆసుపత్రిలో ఉంటే అందరం కలిసి ఏదైనా చేయాలనుకున్నాం. అప్పుడు డాక్టర్లను సంప్రదించడం.. వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడటం.. ఖర్చులు చూసుకోవడం అంతా అభినే చూసుకున్నాడు. 
అభి మీది ఏ ఊరు? నాన్న ఏం చేస్తారు?
అభినయ కృష్ణ: మెదక్‌ దగ్గర రామాయంపేట. చిన్నప్పుడు మీరు(ఆలీ) మా ఇంటికొచ్చారు. అప్పుడే యాక్టింగ్‌ చేయాలన్న కోరిక పుట్టింది. మిమ్మల్ని చూసి సినిమాల్లోకి రావాలని స్ఫూర్తి పొందాను. నాన్న బీఎడ్‌ కాలేజ్‌లో కరస్పాండెంట్‌గా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. తమ్ముడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చెల్లి షార్జాలో ఉద్యోగం చేసొచ్చింది.

బాహుబలికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎందుకు చేయాల్సి వచ్చింది?
అభినయ కృష్ణ: నాకు దర్శకత్వంపై ఆసక్తి ఎక్కువ. రాజమౌళి దర్శకత్వంలో నేర్చుకోడానికి చాలా అవకాశం ఉంటుంది. గ్రాఫిక్స్‌ వర్క్‌పై అవగాహన పెరుగుతుంది. అందుకే  శ్రీవల్లి గారిని అడిగి చేరిపోయాను. ‘బాహుబలి2’ యుద్ధ సన్నివేశాల షూటింగ్‌లో పనిచేశాను. రెండు పడవల మీద ప్రయాణం చేయొద్దని ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. సినిమా వాడిగానే చనిపోవాలని కోరిక.
దర్శకత్వం అవకాశం ఇస్తానని చెప్పి ముంచేశారని తెలిసింది. నిజమేనా?
అభినయ కృష్ణ: మంచి కథ చెబితే ఓ వ్యక్తి బాగుందని మెచ్చుకొని, తానే నిర్మిస్తానని మాటిచ్చాడు. హీరోహీరోయిన్లను మాట్లాడుకొమ్మన్నాడు. నేను హర్షవర్ధన్‌ రాణేను కలిసి హీరోగా ఒప్పించాను. హీరోయిన్‌గా అర్జున్‌ కూతురికి కూడా కథ చెప్పి ఓకే చేయించుకున్నాను. అయితే ఓ  రోజు అత్యవసరంగా రూ.5 లక్షలు పంపమన్నాడు. సినిమాకు అన్ని కోట్లు పెట్టే వ్యక్తికి రూ.5 లక్షలు ఇవ్వడంలో ఏముందని పంపించాను. ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగి తీసుకునేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది.

నీకేమైనా ఇలాంటి ఇబ్బందులున్నాయా?
రామ్‌ ప్రసాద్‌ : లేదు. నేనే చాలా మందికి ఇవ్వాలి (నవ్వులు)

ఏ సంవత్సరంలో ఇండస్ర్టీకి వచ్చావు?
రామ్‌ ప్రసాద్‌: 2008లో వచ్చాను. ఆ తర్వాత మళ్లీ ఇంటికెళ్లి రెండేళ్లు గడిపాను. ప్రసన్నకుమార్‌ అనే రైటర్‌ నా ఫ్రెండ్‌.  ‘కొత్తగా జబర్దస్త్‌ అనే కొత్త కామెడీ షో మొదలవుతోంది. ఏమైనా రాసి పంపరా’ అని అడిగితే కొన్ని రాసి పంపేవాడిని. వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత ధన్‌రాజ్‌ టీంలోకి తీసుకోవడంతో హైదరాబాద్‌కు వచ్చాను. నేను రాసిన మొదటి రెండు స్కిట్లు గెలిచాం. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

సినిమాకు రచయితగా ఏమైనా చేస్తున్నావా? 
రామ్‌ ప్రసాద్‌: ‘సిల్లీ ఫెలోస్‌’కు స్ర్కిప్ట్‌ రాశాను. ‘సారంగదరియా’ అనే సినిమాతో పాటు నాగశౌర్య హీరోగా చేస్తున్న మరో సినిమాకు కూడా పనిచేస్తున్నాను.
రాఘవేంద్రరావు గారు పిలిచి అవకాశమిచ్చారట? ఏంటా కథ?
రామ్‌ ప్రసాద్‌: ఆయనకి మా కామెడీ బాగా ఇష్టం. మా స్కిట్లను చూస్తారు. ఓ రోజు మా ముగ్గురిని పిలిచారు. మనం కలిసి పనిచేద్దాం అన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ రాలేదు. అవకాశం వస్తే కచ్చితంగా కలిసి పనిచేస్తాం.

చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారంట?
రామ్‌ ప్రసాద్‌: స్కూల్‌లో అల్లరి బాగా చేసేవాడిని. టీచర్‌ రాగానే అందరు గుడ్‌ మార్నింగ్‌ అని విష్‌ చేస్తే నేను వేరే విధంగా చెప్పేవాడిని. ఓ రోజు మా మాష్టారు రాగానే భూతద్దాలు అని గట్టిగా అరిచాను. అది పొరపాటున ఆయనకు వినిపించింది. క్లాస్‌లోనే చితకబాదాడు. అలాగే బాత్రూం పైపులను పీకేసి ఆటలాడుకునేవాడిని.

అభినయ కృష్ణ: కాలేజీలో నన్నొక కోతిలా చూసేవారు. ప్రతి లెక్చరర్‌ దగ్గర తిట్లు పడేవి. అందరూ చదువుకుంటుంటే వారికి సినిమా కథలు చెప్పేవాడిని. వాళ్లంతా పడుకున్నాక నేను చదువుకునేవాడిని. ఇలాంటి అల్లరి పనులెన్నో చేశాను. చదువులో మంచి మార్కులే వచ్చేవి. నేను ఇంటెలిజెంట్‌నే కానీ కోతి పనులు తగ్గిస్తే బాగుంటదని మా బాబాయి చెప్పిన రోజు నుంచి కొంచెం పద్ధతిగా ఉండటం మొదలుపెట్టాను.

ఈ మధ్య ఓ స్టూడియో దగ్గర అవమానం జరిగిందట? ఏమైంది?
అభినయ కృష్ణ: షూటింగ్ కోసం గ్రీన్‌ మ్యాట్‌ స్టూడియోకు రమ్మని లోకేషన్‌ పంపించారు. ఆర్బీ చౌదరి ఇంటి దగ్గరే ఆ లోకేషన్‌ చూపించింది. అక్కడొక వ్యక్తిని గ్రీన్‌మ్యాట్‌ స్టూడియో గురించి అడిగాను. ఆయన చిరాకుగా ‘ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు’ అంటూ ఇంకా కొంత అవమానకరంగా మాట్లాడారు. బయటకు పొమ్మన్నారు. నేను వాళ్లకు తెలిసినా.. కావాలనే కొందరు ఇలా ప్రవర్తిస్తుంటారు.

ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిందా? 
అభినయ కృష్ణ: ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి చేసుకున్నాం. తను ఓ ఫ్రెండ్‌ ద్వారా పరిచయం అయ్యింది. ఆమెది రాజస్థాన్‌. మాకు ఇద్దరు పిల్లలు.

ఇండస్ర్టీకి ఎప్పుడొచ్చావు?
అభినయ కృష్ణ:  దాదాపు 20 ఏళ్లవుతుంది. ప్రభాస్‌ నేను ఒకేసారి ఇండస్ర్టీకొచ్చాం. ఆయనతో ఈశ్వర్‌లో ఫ్రెండ్‌గా చేశాను. 
హరికృష్ణ నుంచి అభినయ కృష్ణగా ఎప్పుడు మారావు?
అభినయ కృష్ణ:  గేయ రచయిత సినారె గారే హరికృష్ణగా ఉన్న నా పేరును అభినయ కృష్ణగా మార్చారు. ఓ కార్యక్రమంలో నా నటనకు మెచ్చి ఆ పేరు పెట్టారు.

మిమిక్రీ కూడా చేస్తావు కదా? ఎక్కడ నేర్చుకున్నావు?
అభినయ కృష్ణ: సొంతంగానే నేర్చుకున్నాను. నేను డ్యాన్స్‌ ఇమిటేషన్‌ ఎక్కువగా చేస్తాను. అందులో ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డు’ కూడా ఉంది. ‘ఈశ్వర్‌’ షూటింగ్‌ సమయంలో కృష్ణంరాజుని అనుకరించమని ప్రభాస్‌ అడుగుతుండేవారు. అలా షూటింగ్‌ అయిపోయేదాకా ప్రాక్టీస్‌ చేశాను. దీంతో ఆయనది బాగా చేయగలుగుతాను. 

నేను కొన్ని సినిమా టైటిల్స్‌ చెబుతాను. అవి ఎవరికి సరిపోతాయో చెప్పాలి?

రామ్‌ప్రసాద్‌: క్రాక్‌: కిరాక్‌ ఆర్పీ. ప్రస్తుతం దర్శకత్వం చేద్దామని బయటకెళ్లాడు. వాడి సినిమా గురించి వెయిట్‌ చేస్తున్నాం. 
దేశముదురు: గెటప్‌ శ్రీను. అన్నిట్లో నాలెడ్జ్‌ ఉంది. 
రోబో: సన్నీ. రోబోలానే చెప్పింది చేస్తాడు.
బాబు బాగా బిజీ: సుడిగాలి సుధీర్‌. 
కంత్రి: నాకు నేనే ఇచ్చుకుంటాను (రామ్‌ ప్రసాద్‌).
గ్యాంగ్‌ లీడర్‌: అభినయ కృష్ణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని