Yamuna: సెంట్రల్‌ లాక్‌ వేయకపోవడంతో.. కారు మండుతుండగానే దూకేశా..

అమాయకత్వం..బేలతరం..చూడగానే మనమ్మాయిగా కనిపించే యమున మొదటి సినిమా నుంచే స్టార్‌ హిరోయిన్‌గా మారిపోయింది.

Published : 31 Mar 2022 01:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమాయకత్వం.. బేలతనం.. చూడగానే మనమ్మాయిగా కనిపించే యమున మొదటి సినిమా నుంచే స్టార్‌ హిరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత అన్ని రకాల పాత్రలను పోషించడమే కాదు.. చిన్న తెరపై సత్తా చాటుకుంది. తొలి సినిమా మౌనపోరాటం వచ్చి మూడు దశాబ్దాలు దాటినా.. ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అదే పేరుతో బుల్లితెరలో సీరియల్‌ వస్తోంది.. అందులోనూ యమున నటిస్తోంది. ఆమె ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తన అభిప్రాయాలను పంచుకున్నారిలా..

ఆలీ: ఫైర్‌బ్రాండ్‌ పేరెలా వచ్చింది..?

యమున: ముక్కుసూటిగా మాట్లాడుతా. ఏదీ అనిపిస్తే అది మాట్లాడుతాను. మనసులో ఏదీ పెట్టుకోను. ఇది ఎప్పటి నుంచో ఉంది.

మీది చిత్తూరు కదా..? మీవారేం చేస్తారు..? పిల్లలెంతమంది..?

యమున: మాది అసలు బెంగళూరు. కానీ మా పెద్దవాళ్లది చిత్తూరు. పెళ్లి చేసుకొని మళ్లీ  చిత్తూరు వెళ్లా. మా ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. పెద్దమ్మాయి ఎంబీఏ చేస్తోంది. చిన్నమ్మాయి ఇంటర్‌ చదువుతోంది. 

సినిమాల్లో చేసిన మీరు టీవీకి ఎందుకు పరిమితం అయ్యారు..?

యమున: నిజంగా టీవీలో నటించడం సౌకర్యంగా ఉంది. సినిమాలో చేయకూడదని కాదు.. అక్కడ పని చేయాలంటే ఎనర్జీ కావాలి. టీవీలో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేస్తే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయిపోతోంది. చాలా బాగుంది. ఈ వయస్సులో నాకు అనుకూలంగా ఉంది.

యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టినట్టున్నారు..?

యమున: అవునండీ. పెట్టాం. దాంట్లో మోటివేషన్‌ మొదలెట్టాం.. ఆ తర్వాత సరదా కార్యక్రమాలను కూడా ఇస్తున్నాం. పర్సనల్‌ విషయాలు అడుగుతున్నారు. అవి కూడా పంచుకుంటున్నా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా.

ఉషాకిరణ్‌ మూవీస్‌, ఈటీవీతో అనుబంధం ఎక్కువ కదా..? అదే లేకపోతే ఎక్కడుండేవారు..?

యమున: అసలు నేను ఇండస్ట్రీకి రావాలనుకోలేదు. పదిమంది ఉంటే మాట్లాడాలంటే భయంగా ఉండేది. మా అమ్మతో.. షూటింగ్‌ చేయను, నాకు రాదు అని చెప్పా.  అయితే.. బాలచందర్‌ను చూడగానే చెప్పలేకపోయా. అలా ఫోర్స్‌తోనే నటించా. ఆ తర్వాత సినిమాలు చేయాలనే అభిరుచి పెరిగింది. ఏదైనా సాధించి తీరాలని అనుకున్నా. ఇది నాకు పట్టిన అదృష్టం.. మౌనపోరాటం లేకపోతే యమున లేదు. మోహన్‌గాంధీ దగ్గర చాలా పని నేర్చుకున్నా. ఇపుడు ఆ సినిమా చూస్తే నేనేనా చేసిందనిపిస్తుంది.

దాసరి గారితో చేశారు..? ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు...?

యమున: ఆయన దగ్గర స్పాంటేనిటీ నేర్చుకున్నా. టేక్‌లోనే డైలాగ్‌ చెప్పేస్తారు.. వెంటనే చేయాలి. అదే ఆయన దగ్గర తెలుసుకున్నా.

వినోద్‌కుమార్‌, మీరు ఎన్ని సినిమాలు చేశారు..?

యమున: ఐదు సినిమాలు చేశాం. జడ్జిమెంటులో నటించాం..కానీ జంటగా కాదు. అయినా పెద్దగా మాట్లాడుకునే వాళ్లం కాదు..హాయ్‌..బాయ్‌తోనే సరిపెట్టా.

ఎన్నాళ్ల తర్వాత మళ్లీ మౌనపోరాటం సీరియల్‌గా రాబోతోంది..?

యమున: దాదాపు 33 ఏళ్ల తర్వాత వస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కూడా అన్నేళ్లు అయ్యింది.

ఏం చదివారు..?

యమున: టెన్త్‌. తర్వాత పరిశ్రమలోకి వచ్చా.

ఎన్ని సినిమాల్లో నటించారు..? ఎన్ని భాషల్లో చేశారు..?

యమున: 70 సినిమాలు చేశా. తమిళం తక్కువ. ఒరియా, బెంగాలీలో నాగమ్మ సినిమాలో నటించా. మరాఠీలో అడిగితే భాష సమస్య ఉందని చేయలేదు. ఎక్కువగా తెలుగు, కన్నడలోనే చేశాను.

అమ్మానాన్న చేతిలో దెబ్బలు ఎవరు ఎక్కువ తిన్నారు..?

యమున: మా ఇంట్లో ముగ్గురం అక్కాచెల్లెళ్లం. అందులో చివరిదాన్ని నేను. అల్లరి నేనే ఎక్కువగా చేసే దాన్ని. అమాయకంగా మొహం పెట్టేసరికి అక్కకు తన్నులు పడేవి.

శారద గారితో సినిమా అవకాశం వచ్చిందా..? ఎందుకు వద్దనుకున్నారు..?

యమున: మొదటి సినిమాలో సుమన్‌-నిశాంతి, హరీష్‌ నేను జంటగా అనుకున్నారు. ఆ తర్వాత పూజ రోజు క్యారెక్టర్‌ తేడా ఉన్నట్టు తెలియడంతో శారద గారిని అడిగా..నెగెటివ్‌ అయితే చేయనని చెప్పా. సరే అన్నారు. అక్కడ సితార రిపోర్టర్‌ ఒక ఫొటో ఇవ్వమన్నారు. లేదుపో..ఇంటి దగ్గర ఉందన్నా.. మర్నాడు వచ్చి ఫొటో అడిగితే మేకప్‌లో లేని ఫొటో ఇచ్చా. అది నచ్చింది. అదే మౌనపోరాటం సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది.  ఈ సినిమాలో జైల్లో సీన్‌ నాకిష్టమైంది. రాత్రి ఒంటిగంటకు షూటింగ్‌ ఉండటంతో కోపంతోనే నటించా. అన్నం తెచ్చి ఇచ్చారు. కర్రీస్‌ లేవా..అని అడిగితే డైరెక్టర్‌ తిట్టారు. కష్టాల్లో ఉన్నావు అనడంతో కోపంతో నటించా. చాలా బాగుందని ఎస్పీ బాలు కూడా మెచ్చుకున్నారు.

మౌనపోరాటం విజయం తర్వాత బాగా గుర్తింపు వచ్చిందా..?

యమున: రెండో సినిమా జడ్జిమెంట్‌ షూటింగ్‌ చేస్తున్నపుడు తణుకులో అభిమానులతో వీధి అంతా బ్లాక్‌ అయిపోయింది. పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని హోటల్‌లో కాకుండా ఎవరింట్లోనైనా ఉంచాలని కోరారు.

చెన్నైలో ఓ అవార్డు పంక్షన్‌లో మీరు పరిచయం చేసుకునే లోపే ఆయనే మీ పేరు చెప్పారట..? ఎవరా స్టార్‌..?

యమున: ఆయనే కమలహాసన్‌గారు. మౌనపోరాటం చాలా బాగా చేశావన్నారు. ఎంతో సంతోష పడ్డా. ఆయన చేతుల మీదుగా కళాసాగర్‌ అవార్డు తీసుకున్నా. రామోజీరావు గారు కూడా అక్కడే ఉన్నారు.

ఏదో షూటింగ్‌ నుంచి వెళ్తున్నపుడు కార్‌ యాక్సిడెంట్‌ అయ్యింది కాదా..?

యమున: తమిళంలో రాధిక వాళ్ల సీరియల్‌లో అమ్మవారి పాత్ర నాది. కుట్రాలంలో షూటింగ్‌ చేసుకొని టాటా సఫారిలో బెంగళూరు వెళ్తున్నాం. ఆ దారి సరిగా లేదు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయట. ఎదురుగా బస్సు వస్తోంది.. వెనక నుంచి లారీ మమ్మల్ని ఓవర్‌టేక్‌ చేసి గుద్దేసింది. చాలా దూరం లాక్కొనివెళ్లింది. బానెట్‌, పెట్రోల్‌ ట్యాంకు ఓపెన్‌ అయ్యాయి. మంటలు వ్యాపించాయి. సెంట్రల్‌ లాక్‌ పడకపోవడంతో మండుతున్న కారులో నుంచి వెంటనే దూకేశా.  లేకపోతే అంతే సంగతులు. కారు సినిమాలోలాగా మంటల్లో మాడిపోయింది. ఏడాదిపాటు భయం పోలేదు. ఇది 2009 జూన్‌ 23న జరిగింది.

ఇద్దరమ్మాయిలున్నారు.. అయినా పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్నారు. ఎందుకు..?

యమున: రెండో అమ్మాయి పుట్టినపుడే పిల్లలను దత్తత తీసుకోవాలని ఉండేది. అనాథ పిల్లలను చూసినప్పుడు బాధ అనిపించేది. వాళ్లకు అమ్మా నాన్న లేరు కదా.. వాళ్లకు అమ్మనైతే ఎలా ఉంటుందని అనిపించింది. మా అమ్మ వారించింది.. నీ అమ్మాయిలతో సమానంగా చూడకపోతే చూసేవాళ్లు ఏమనుకుంటారు. ఆ అమ్మాయి బాధ పడితే నువ్వు బాధ పడుతావు అంది. అందుకే దత్తత తీసుకోలేదు.

బిర్యానీ, చేపలు, కూరలు అరగంటలో చేస్తాం..మీరు రెండున్నర గంటల్లో ఉప్మా చేశారట..?

యమున: మీకివన్నీ ఎవరూ చెప్పారండి(నవ్వులు). పెళ్లైన కొత్తలో వంట రాదు. ఇంట్లో ఐదుగురున్నారు. టిఫిన్‌ చేయాలన్నారు. ఆరోగ్యం ముఖ్యమని కూరగాయలను వేయాలనుకున్నా.. వాటిని కట్‌ చేయడానికి చాలా సమయం పట్టింది. ఉప్పుందా లేదోనని తినడం.. మళ్లీ ఉప్పు వేయడం, కారం తగ్గిందని మళ్లీ వేయడం.. ఇలా ఎక్కువ సమయం అయ్యింది. ఇప్పుడు మాత్రం వంటల్లో నిపుణురాలినయ్యా.

ఈ మౌనపోరాటం ఎలా ఉండబోతోంది..?

యమున: అప్పట్లో కొండలు ఎక్కించారు.. ఇప్పుడూ కొండలు ఎక్కిస్తున్నారు. డైరెక్టర్‌ ఏదీ చేయమంటే అది చేస్తాను. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నా. సినిమాలాగానే సీరియల్‌ ఉండాలని చెప్పడంతో కష్టపడుతున్నాం. మౌనపోరాటం సీరియల్‌గా చేద్దామని అనుకున్నపుడు ముందుగా వద్దన్నా.. ఆ మౌనపోరాటం రామోజీరావు గారు ఇష్టపడి నిర్మించారు. ఇప్పటికీ గుర్తింపు ఉంది. అయితే బాపినీడుగారు.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. దుర్గ పాత్రకు ఎక్కడా అన్యాయం జరగదు.. సూపర్‌హిట్‌ అయిన సినిమాను సీరియల్‌ చేద్దామనుకుంటున్నామని చెప్పారు. ఇపుడైతే  చాలా బాగుంది.

బంగారు కుటుంబం చూసి ఆ డైరెక్టర్‌ మీకు సినిమా అవకాశం ఇచ్చారట..?

యమున: రామ్‌గోపాల్‌వర్మగారు అవకాశం ఇచ్చారు. కూర్చొని ఉన్నా.. నన్ను అలా చూసుకుంటూ వెళ్లారు. నేను అలాగే చూస్తున్నా. కట్‌ చేస్తే గోవిందా గోవిందా సినిమాలో లక్ష్మీదేవి పాత్ర ఇచ్చారు.

పుట్టింటి పట్టుచీర సినిమా చేస్తున్నపుడు సురేశ్‌ నీ కంటికి బఫూన్‌లా కనిపిస్తున్నానా..? అన్నారట ఎందుకు..?

యమున: సరదాగానే అన్నారు. నిజంగా నాకు షూటింగ్‌ లొకేషన్‌లో సీరియస్‌గా ఉంటే నచ్చదు. సరదాగా ఉంటే ఇష్టం. సురేశ్‌గారు ఎన్ని ఇబ్బందులున్నా ఫన్నీగా మాట్లాడుతారు. జోక్‌ చెప్పరా.. అంటూ వెంటపడేదాన్ని. నిన్ను నవ్వించడానికి నేను బఫూన్‌లా కనిపిస్తున్నానా.. అనే వారు. 

ఎన్నో కష్టాలను చూసిన మీరు.. ఈ రోజు సంతోషంగా ఉండటం ఎలా సాధ్యమయ్యింది..?

యమున: మన మనస్సేనండి.  కొన్ని సంఘటనలతో ఆర్థికంగా, స్థాయిపరంగా తగ్గిపోయా. ఇలాంటి సమయంలో ఇద్దరమ్మాయిలను పెంచడం సాధ్యమయ్యే పని కాదు. లౌక్యం తెలియక చెప్పిన మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకున్నా. పరిగెత్తడం కన్నా.. ఉన్నదాంట్లో జాగ్రత్తగా ఉందామనుకున్నాం. మనసు గట్టిగా ఉంటే నాలుగు ఇళ్లలోనైనా పని చేసుకొని పిల్లలను పెంచుకోగలమనే నమ్మాను. భయపడితే ముందుకు వెళ్లలేం. భయపడినంతకాలం సమాజం భయపెట్టింది.. ధైర్యంగా ఎదురు తిరిగి నవ్వడం మొదలెట్టా.. ఇపుడు చక్కగా ముందుకు వెళ్లగలుగుతున్నా. సంతోషం.. కారు, బంగ్లా, డబ్బులతో కాదు.. మనసుతోనే ఉంటుంది.

లెజండరీ యాక్టర్‌ ఎన్టీఆర్‌గారు బాలకృష్ణ పక్కన నటించమని అడిగారా..? చిరంజీవి, మోహన్‌బాబులతో నటించే అవకాశం వచ్చిందా..?

యమున: నాకు ఈ విషయం తెలియదు.. అట్లూరి రామారావుగారు చెప్పారు. ఏ సినిమానో తెలియదు. అప్పట్లో కొత్త.. నాకేం తెలిసేది కాదు. అప్పుడు జడ్జిమెంటు సినిమా చేస్తున్నాం. బాలకృష్ణ సినిమా అలా మిస్‌ అయ్యింది. చిరంజీవి గారితో కొదమసింహం కూడా అలాగే పోయింది. మంజునాథ సినిమాలో ఒక బిట్‌ అయినా ఆయనతో చేశా. ఆ సంతోషం చాలు. ఆ షూటింగ్‌లో గిల్లుకున్నా.. ఇది నిజమా సార్‌ అని పదేపదే చిరంజీవి గారిని అడిగేదాన్ని. అల్లుడుగారు సినిమాను.. నాకే బ్రెయిన్‌ సరిగా పని చేయక చేయలేదు.  ఆ సినిమా రమ్యకృష్ణను స్టార్‌ హీరోయిన్‌గా చేసింది.

మీ చివరి తెలుగు సినిమా ఏదీ..?

యమున: ట్యాక్సీవాలా. ఈ మధ్యలో సినిమా ఛాన్సు వచ్చినా కుదరలేదు.

మౌనపోరాటం సీరియల్‌లో ఏం చూపించబోతున్నారు..? ఆ పాత్రల్లో ఎవరూ నటిస్తున్నారు..?

యమున: సీరియల్‌ చూడండి. నేనేమీ చెప్పను. ఆ సినిమాలో దుర్గ పోరాటం తర్వాత మళ్లీ సీరియల్‌ మొదలవుతుంది. పిల్లలేమయ్యారు..? రాజశేఖర్‌ మారాడా..?అనే కనిపిస్తుంది. ఒక కొడుకు ఉంటే ఇంకో కొడుకు ఎప్పుడు వచ్చాడు..? ఇవన్నీ తెలియాలంటే సీరియల్‌ చూడాల్సిందే.(మౌనపోరాటం సీరియల్‌లో నటించే ముగ్గురు నటీనటులతో కొద్దిసేపు చిట్‌చాట్‌ కొనసాగింది)

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు