Adavi Seshu: సినిమా విడుదలయ్యాక అర్థమైంది మోసపోయానని: అడవి శేష్‌

అతను అచ్చ తెలుగు కుర్రాడే కానీ చూడడానికి హాలీవుడ్‌ హీరోలా ఉంటాడు. బలమైన కథలకు తన మెస్మరైజింగ్‌ యాక్టింగ్‌తో పాటు ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేని జోడించి సూపర్‌ హిట్‌ కొడతాడు ఈ హీరో.

Published : 19 May 2022 09:53 IST

అతను అచ్చ తెలుగు కుర్రాడే కానీ, చూడటానికి హాలీవుడ్‌ హీరోలా ఉంటాడు. బలమైన కథలకు తన మెస్మరైజింగ్‌ యాక్టింగ్‌తో పాటు ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేని జోడించి సూపర్‌ హిట్‌ కొడతాడు ఈ హీరో. మంచి నటుడు మాత్రమే కాదు చక్కటి రచయిత, దర్శకుడైన అడవిశేష్‌ కంటెంట్‌ ఉన్న చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. మరి ఈ హ్యాండ్‌సమ్‌ హీరో ఆలీతో కలిసి సరదాగా చెప్పిన కబుర్లు చూద్దాం.

అడవి సన్ని చంద్ర నుంచి అడవి శేష్‌గా ఎలా మారాడు?

అడవి శేష్‌: నేను అమెరికాలో చదువుకున్నా. ఆ టైమ్‌లో సన్నిలియోన్‌కి బాగా క్రేజ్‌ వచ్చింది. దీంతో అందరూ నన్ను వెక్కిరించారు. మా నాన్నని అడిగితే నీ పూర్తి పేరు శేష సన్ని చంద్ర అని చెప్పారు. అప్పుడు సన్ని తీసేసి శేష్‌ అని పెట్టుకున్నాను. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది.

మీ కుటుంబ నేపథ్యం ఏంటి?

అడవి శేష్‌: మా ఇంట్లో నేను, అమ్మానాన్న, చెల్లి ఉంటాం. నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. మా కుటుంబంలో సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఎవరూ లేరు. నాన్నకు చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని కోరిక. విశ్వనాథ్‌గారి ‘సూత్రధారులు’లో హీరోగా చేయాల్సి ఉంది. కానీ అదే సమయంలో ఆయనకు యాక్సిడెంట్‌ అయింది. అలా ఆ అవకాశం పోయింది. ఆయన అప్పటికే డాక్టర్‌గా చేస్తున్నారు. ఇంకా పూర్తిగా అటు వైపునకు వెళ్లిపోయారు. అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఆయనకు సినిమాలపై ఉన్న ఇష్టంతో నాకు చిన్నప్పటి నుంచి రకరకాల డ్రెస్‌లు వేసి ఫొటోలు తీయించే వాళ్లు. అలా నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది.

మేజర్‌’ సినిమా కథ ఊహించి రాసిందా? నిజంగా జరిగిందా?

అడవి శేష్‌: ఊహ ఉంది కానీ, ఇది నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ 26/11 ఎటాక్స్‌లో చనిపోయారు. కొన్ని వందల మందిని కాపాడి ప్రాణ త్యాగం చేశారు. అందరికీ ఆయన ఎలా చనిపోయారో తెలుసు కానీ ఆయన ఎలా బతికారో తెలియదు. దాన్ని మేము ఈ చిత్రంలో చూపించాం.

ఇండస్ట్రీలో మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించింది ఎవరు?

అడవి శేష్‌: చాలా మంది ఉన్నారు. అందరి కంటే ముందు మా తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు. ఇండస్ట్రీకి వచ్చాక ఏదైనా మంచి సినిమా తీస్తే చాలా మంది పెద్దలు నన్ను ప్రోత్సహించారు. ‘క్షణం’ సినిమా చూసి బన్ని ట్వీట్‌ చేశారు. ‘పంజా’ షూటింగ్‌ టైమ్‌లో పవన్‌కల్యాణ్‌ సపోర్ట్‌ చేశారు. ‘బాహుబలి’ సినిమా అప్పుడు ప్రభాస్‌ దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు ‘మేజర్‌’ సినిమాకి మహేశ్‌ బాబు నిర్మాత. ఆయనే అంతా చూసుకుంటున్నారు. 

సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

అడవి శేష్‌: నాకు సినిమా తప్ప ఏం తెలీదు. కానీ సినిమాల్లో ఎవరూ తెలీదు. 13 ఏళ్ల వయస్సులోనే కెమెరా ఎదురుగా పెట్టుకొని నాకు నేను నటించే వాడిని. ఇప్పుడు అనిపిస్తుంది కాలేజ్‌ డేస్‌ని ఎంజాయ్‌ చేసి ఉంటే ఎంత బాగుండేదో అని. ఒక వేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే రచయితని అయ్యే వాడిని.

అమెరికాలో ఎందుకు హీరోగా ప్రయత్నించలేదు?

అడవి శేష్‌: అక్కడ భారతీయులకు మంచి పాత్రలు ఇచ్చే వాళ్లు కాదు. టెర్రరిస్ట్‌, పెట్రోల్‌ బంకులో పనిచేసే బాయ్‌, సాప్ట్‌వేర్‌.. అలాంటి పాత్రలు ఇస్తారు. ఇప్పటికీ అక్కడ ఇండియన్స్‌ కమెడియన్స్‌ గానే ఉండిపోయారు గానీ ఎవ్వరూ హీరోలు కాలేకపోయారు. అందుకే నేను ఇండియా వచ్చేశా. నాకు మా అమ్మ మొట్టికాయలు వేసి మరీ తెలుగు నేర్పించారు.

భవిష్యత్తులో అడవి శేష్‌ ఏం అవుతాడు. దర్శకుడా, రచయిత, హీరోనా?

అడవి శేష్‌: హీరోగా నేను విజయం సాధించాను. ప్రస్తుతం మేజర్‌ లాంటి సినిమాని జాతీయ స్థాయిలో తీయాలన్న తపన ఎక్కువైంది. అది నిదానంగా నిజమవుతోంది. నేను ఏమవుతాను అంటే మాత్రం ‘తల రాతలో ఏది రాసుందో అదే జరుగుతుంది’ అని చెబుతాను.

మొదటిసారి తెరపై కనిపించిన సినిమా ఏది?

అడవి శేష్‌: ‘సొంతం’. అప్పుడు నాకు 15 ఏళ్లు. మొదట ‘చందమామ’ సినిమాలో నవదీప్‌ పాత్రలో నేను నటించాల్సింది. 2 రోజులు షూటింగ్‌ జరిగాక కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.  అప్పుడు ‘సొంతం’లో కీలకపాత్ర ఉందని ఎవరో చెబితే, వెళ్లి నటించా. చెప్పడం చాలా కీలకపాత్ర అని చెప్పారు. కానీ 3రోజుల్లో షూటింగ్‌ అయిపోయింది. సినిమాలో కేవలం 5 సెకన్లు మాత్రమే ఉన్నా. సినిమా విడుదలైన తర్వాత అర్థమైంది నేను మోసపోయానని. మళ్లీ అమెరికా వెళ్లిపోయా.

‘బాహుబలి’లో అవకాశం ఎలా వచ్చింది?

అడవి శేష్‌: ఓ పార్టీలో రాజమౌళి నా దగ్గరకి వచ్చి ‘పంజాలో బాగా చేశావ్‌’ అన్నారు. అప్పుడు నేను ‘మీ సినిమాలో అవకాశం ఉంటే చెప్పండి చేస్తా’ను అని అడిగాను. 2 సంవత్సరాల తర్వాత ఆయన నుంచి ఫోన్‌ వచ్చింది.

హీరోగా కనిపించిన మొదటి సినిమా ఏది?

అడవి శేష్‌: హీరోగా మొదటి సినిమా ‘కర్మ’. కానీ హీరోగా మంచి పేరు తెచ్చింది మాత్రం ‘క్షణం’. రూ.కోటితో తీద్దామనుకున్న సినిమా కాస్త రూ.10కోట్లు అయ్యింది. అన్ని భాషల్లో వాళ్లు ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ కొన్నారు. నేను షాక్‌ అయ్యాను. ఇంక ఆ తర్వాత ‘గూఢచారి’, ‘ఎవరు’ సినిమాలు చేశాను. అవి కూడా మంచి పేరు తెచ్చాయి. మేజర్‌ విడుదలయ్యాక ‘గూఢచారి-2’ చేయాలి.

ఇండస్ట్రీకి నటన మీద ఉన్న తపనతో వచ్చారా? ఫేమస్‌ అవ్వడం కోసం వచ్చారా?

అడవి శేష్‌: ఫేమ్‌ అంటే నాకు పెద్ద ఆసక్తి లేదు. మన పని మనం చేసుకుంటూ వెళితే అన్ని అవే వస్తాయి. కష్టపడి పనిచేస్తే ఫేమ్‌ కూడా వస్తుంది. నేను గొప్ప వాడిని అని నేను చెప్పుకోవడం కన్నా జనాలు నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం నాకు ఇష్టం.

ఇప్పటి వరకు ఎంత మంది ప్రపోజ్‌ చేశారు?పెళ్లి ఎప్పుడు?

అడవి శేష్‌: చాలా మంది చేశారు. సినిమాల్లోకి వచ్చి యాక్టర్‌ అయ్యాక ఇంకా ఎక్కువ ప్రపోజల్స్‌ వచ్చాయి. కొన్నిసార్లు అయితే పెళ్లి అయిన వాళ్లు ప్రపోజ్‌ చేసేవాళ్లు. ఎలా రియాక్ట్‌ అవ్వాలో తెలిసేది కాదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని అంటున్నారు. ఇండస్ట్రీలో పెళ్లి కావలసిన వాళ్లు చాలా మంది ఉన్నారు కదా.. వాళ్ల పెళ్లిళ్లు అయ్యాక చేసుకుంటా అని చెప్పి తప్పించుకుంటున్నా.

ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉండి కారు కొన్నావని విన్నాను నిజమేనా?

అడవి శేష్‌: నాకు బైక్‌ నడపడం రాదు. అందుకే కారు కొన్నా. అన్నింటికంటే తక్కువ ధరలో ఏది వస్తుందా? అని వెతికి ఐ10 కారు కొన్నాను. దానికి డబ్బులు మా ఇంట్లో వాళ్లే ఇచ్చారు. 

బాహుబలిలో నీకు అమ్మ ఎవరో తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు?

అడవి శేష్‌(నవ్వుతూ) : అది మీరు రాజమౌళిని అడగాల్సింది. నేను ఒకసారి అడిగాను. అది అనవసరం అన్నారు. ఈ సినిమాలో భళ్లాలదేవలాంటి దుర్మార్గుడికి నువ్వు పుట్టావు అంతే అన్నారు.

‘కిస్‌’ సినిమా దర్శకత్వం చేశాక పోలీసులు ఫోన్‌ చేశారట?

అడవి శేష్‌: ‘కిస్‌’ సినిమా అనుకున్న విధంగా రాలేదు. మనకు రాని పని మనం చేయకూడదని నేను తెలుసుకున్నాను. నేను అనుకున్న కథ నన్ను తీయనివ్వలేదు. క్లైమాక్స్‌ మొత్తం మార్చేశాం. ఒక సినిమా ఎలా తీయకూడదో ఆ సినిమా తర్వాత అర్థమైంది.

‘మేజర్‌’ కోసం ఎలాంటి సాధన చేశారు?

అడవి శేష్‌: మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ ఒక సోల్జర్‌. ఆయన లాగా చేయడం కోసం నన్ను నేను మార్చుకున్నా. బాడీ లాంగ్వేజీ దగ్గరి నుంచి నిలబడే విధానం వరకూ అన్ని మార్చుకున్నాను. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఆయన ఎప్పుడూ సీరియస్‌గా ఉండే వారు కాదు. ఎంత సమస్య ఉన్నా నవ్వుతూ ఉండేవారు.

మేజర్‌ సినిమా మహేశ్‌బాబు పూర్తిస్థాయి నిర్మాతనా?అసలు ఎలా కుదిరింది ఇది?

అడవి శేష్‌: అనురాగ్‌, శరత్‌ అని నాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్లు ఛాయ్‌బిస్కెట్‌ అని వెబ్‌సైట్‌ నిర్వహిస్తుంటారు. వాళ్లు ఒకరోజు నన్ను నమ్రత దగ్గరికి తీసుకెళ్లారు. కథ వినగానే నమ్రత,మహేశ్‌లు వెంటనే ఓకే చెప్పేశారు.

‘నాకు యాక్టింగ్‌ అంటేనే ఇష్టం కానీ గతి లేక నా సినిమాలకు నేను రచయితగా చేస్తున్నాను’ అని ఒక సందర్భంలో అన్నారు. ఆ మాట ఎందుకు అన్నావు?

అడవి శేష్‌: నిజంగానే అన్నాను. ఎందుకంటే.. అయిదు మంచి కథలు ఉంటే అందులో 3 కథలు అగ్రహీరోలకే వెళ్లిపోతాయి. ఇంక మిగిలేది 2 కథలు. వాటికోసం నేను ఎదురు చూస్తు కూర్చోకుండా నాకు నేను కథలు ఎందుకు రాసుకోకూడదు అనిపించింది.

యాక్టింగ్‌లో ఉత్తారాది సినిమాలకు, దక్షిణాది సినిమాలకూ ఏమైనా తేడా ఉంటుందా?

అడవి శేష్‌: సినిమా సినిమాకీ ఉంటుంది. మనం అక్కడ కూడా పాన్‌ ఇండియా సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నాం. నిన్న ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘అతి పెద్ద సినీ ప్రపంచం ఉన్న నగరానికి స్వాగతం’ అని చెప్పాను. మనం ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూసుకుంటాం. ఇతర ప్రాంతాల్లో ఆ సంప్రదాయం లేదు. 

మేజర్‌లో హీరోయిన్స్‌ ఎవరు?

అడవి శేష్‌: ఇద్దరు హీరోయిన్స్‌ ఉన్నారు. శోభిత అని తెలుగు అమ్మాయి. సయీ మంజ్రేకర్‌.( ఇంతలో షోలోకి సయీ మంజ్రేకర్‌ వచ్చారు)

ఇప్పటికీ వరకూ ఎన్ని సినిమాలు చేశారు?

సయీ మంజ్రేకర్‌: మూడు సినిమాలు చేశాను.

మహేశ్‌ బాబును కలిశావా?ఏం చెప్పావు?

సయీ మంజ్రేకర్‌: ఆయన చాలా అందంగా ఉన్నారు. తన బ్యూటీ సీక్రెట్‌ అడిగాను. ఎప్పటికైనా తెలుసుకుంటా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు