పూరి నాకు గర్ల్‌ఫ్రెండ్ లాంటోడు!

ఈ నటీమణుల ప్రతిభకు వెండితెర, బుల్లితెర అనే తేడా లేదు. రెండు దశాబ్దాలుగా మనల్ని అలరిస్తూ ప్రతి తెలుగింటితో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ప్రతిభావంతులుగా గుర్తుండిపోయారు. అభిమానుల హృదయాల్లో.......

Updated : 23 Jun 2021 10:30 IST

ఈ నటీమణుల ప్రతిభకు వెండితెర, బుల్లితెర అనే తేడా లేదు. రెండు దశాబ్దాలుగా మనల్ని అలరిస్తూ ప్రతి తెలుగింటితో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ప్రతిభావంతులుగా గుర్తుండిపోయారు. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సహజ నటీమణులు శ్రుతి, ప్రీతి నిగమ్‌. వారిద్దరూ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పంచుకున్న విశేషాలు మీకోసం..

ప్రీతి, శ్రుతి ఎలా కలుసుకున్నారు?
శ్రుతి: ముప్పై ఏళ్ల కింద నారాయణగూడలో ఒకరికొకరం పరిచయమయ్యాం. అప్పటినుంచి మా అనుబంధం కొనసాగుతూ వస్తోంది.

ఇన్నేళ్లలో మీ మధ్య ఎవరూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయలేదా?

శ్రుతి: నేను తన ప్రైవసీకి గౌరవమిస్తాను. తను కూడా అంతే. అందుకే మా మధ్య ఎలాంటి గొడవలు రాలేదు. మా గురించి ఎవరేం మాట్లాడినా, ఏం చేయాలనుకున్నా మమ్మల్ని విడగొట్టడం సాధ్యపడలేదు.


తెర వెనుక కూడా మీలో నెగటివ్‌ షేడ్‌ ఉంటుందంట కదా? పెళ్లైన కొత్తలో మీ ఆయన మీద చూపించారంట? 

ప్రీతి నిగమ్‌: అది అనుభవించాల్సిన వాళ్లు చెప్పాలి. పెళ్లైన కొత్తలో మాత్రం మా ఆయన ఏదో అన్నారని బెడ్‌ మీద నుంచి కిందపడేశాను. 
మధు ఎలా కలిశారు? 
శ్రుతి: ‘రుతురాగాలు’ సీరియల్‌లో నాతో కలిసి పనిచేశారు. మా మధ్య ఎలాంటి భావన లేదప్పుడు. కొన్నాళ్లకు ఆయనే అమ్మతో మాట్లాడారు. పెళ్లి ప్రపోజల్‌ పెట్టారు.  వారం రోజుల సమయం తీసుకొని చేసుకుంటానని చెప్పేశాను. నేనేదైనా చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటాను. 
మిమ్మల్ని చూడాలంటే పిల్లలు కారు వెనక దాక్కుని చూసేవారంట కదా?

శ్రుతి: సీరియల్‌ షూటింగ్‌ చేస్తున్న సమయంలో కారు వెనక, వాళ్ల అమ్మ కొంగు వెనక దాక్కొని కొందరు పిల్లలు భయపడుతూ చూసేవారు. సీరియళ్ల ప్రభావం అంతలా ఉండేది.

సాధారణంగా ప్రీతిని చూస్తే అలా భయపడాలి కదా?
ప్రీతి నిగమ్‌: నాకూ ఉన్నాయి అలాంటి అనుభవాలు. ఓ రోజు షూటింగ్‌ లొకేషన్‌లో ఫోన్‌ మాట్లాడుతుంటే నన్ను చూసి ‘యశోదర రా..!’అని అరుస్తూ పారిపోయారు పిల్లలు. 
శ్రుతి: తెరమీద భయపెట్టే వారు నిజజీవితంలో సున్నితంగా ఉంటారండీ..!
మీ ప్రేమకథలో శ్రుతి పాత్ర ఏంటి?
ప్రీతి నిగమ్‌: మేమిద్దరం సన్నిహితంగా ఉండేవాళ్లం. నగేశ్‌, నేను కలవడంలో శ్రుతిదే కీలకపాత్ర. నా స్నేహితురాలై ఉండి తనవైపు నుంచి పైరవీలు చేసింది.
శ్రుతి:  నగేశ్‌ ఒకసారి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ చెబుతూ మా సహాయం కోరారు. అలా కొన్ని రోజులు అయ్యాక నన్ను పక్కకు పిలిచి.. తను ప్రేమించేది ప్రీతినే అని బాంబు పేల్చాడు. ఆ తర్వాత ప్రీతిని ఒప్పించాల్సి వచ్చింది. మధు, నగేశ్‌ ఇద్దరూ ‘రుతురాగాలు’లో నటించినవారే.

గొడవ పడితే భార్యభర్తలిద్దరూ సైలెంట్‌గా ఉంటారంట? అదెలా సద్దుమణుగుతుంది మరి? 
శ్రుతి: ఏదైనా గొడవ జరిగితే  ఆయన నేరుగా కిచెన్‌లోకి వెళ్లిపోతారు. మొత్తం గిన్నెలన్నీ కడిగేస్తారు.
ఇల్లంతా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత కిచెన్‌లో కనిపించే ప్రతీదాన్నీ తీసుకొని రకరకాల వంటలు చేస్తారు. నేను మాత్రం ఫోన్‌ చూస్తూ నిశ్శబ్దంగా ఉంటాను. 
ఆ రోజుల్లో సావిత్రి ఏడిస్తే ఒక కన్ను నుంచి కన్నీటి బొట్లు కారుతాయని చూశాం. శ్రుతి ఒక కంటి నుంచే నీళ్లు తెప్పిస్తుందని ఒక ప్రముఖ హీరో నాతో చెప్పాడు.. నిజమేనా?
శ్రుతి: నిజమే సర్‌. 
ఆ మాట అన్నది మరెవరో కాదు సాయికుమార్‌
శ్రుతి: ఇంత పెద్ద ప్రశంస సాయికుమార్‌ లాంటి అద్భుత నటుడి నుంచి రావడం నిజంగా అదృష్టం. 
తెలుగు రాక, డైలాగ్‌ డైలాగ్‌కి మధ్య ప్రీతి గ్యాప్‌ ఇచ్చేవారంట? 
శ్రుతి: ప్రాప్టింగ్‌ తీసుకుంటూ ఒక్కోసారి అలా మధ్యలో ఆగిపోయేది. కానీ తను డైలాగ్‌ వింటున్నట్టు, గ్యాప్‌ ఇస్తున్నట్లు అనుమానం రాకుండా హావభావాలతో కట్టిపడేస్తుంది ప్రీతి.  
ఈ విషయంలోనే మీకు 30 అడుగుల ఫొటో పెట్టారంట?
ప్రీతి నిగమ్‌: మీరు ఇది చెబుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. లండన్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో అంత పెద్ద ఫొటో పెట్టారు.  ఆ ఫొటో చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. 

ఇంత పెద్ద స్టార్‌ అయి ఉండి, ఇంత ఫేమ్‌ వచ్చిన తర్వాత కూడా కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెత్తారంట?
ప్రీతి నిగమ్‌: ఓ సారి పరిగెత్తాను. మా పాప అదితి 8 నెలల వయసులో ఉన్నప్పుడు జరిగింది. ఉదయం 4 గంటల సమయం.. పాప ఒళ్లు
కాలిపోతోంది. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఆయన కారు తీసినా కూడా చెప్పులు లేకుండా ఆసుపత్రికి పరిగెత్తాను. ఊహించలేని టెన్షన్‌ అది.  ఈ ఘటన జరిగి ఇరవై ఏళ్లవుతుంది. ఎప్పుడు గుర్తొచ్చినా భావోద్వేగానికి గురవుతాను. ఎంత పేరు, డబ్బు ఉంటే ఏంటి? ఆ క్షణంలో బిడ్డ ఆరోగ్యం తప్ప ఇంకేది ముఖ్యమనిపించలేదు. చికిత్స పూర్తయ్యే వరకు చెప్పులు లేకుండానే ఉన్నాను. 
‘అందరూ నాకు ఫ్యాన్స్‌ అయితే, నేను శ్రుతి ఫ్యాన్‌’ అని ప్రశంసించిన నటుడు ఎవరు?  
శ్రుతి: బ్రహ్మానందం గారు. ‘కెమెరామెన్‌ గంగ’తో రాంబాబు షూటింగ్‌లో ఈ మాట అన్నారు. ‘మొగలిరేకులు’ రోజూ చూస్తానని, బాగా నటిస్తావని ప్రశంసించారు. అలాగే ‘అందరూ నా ఫ్యాన్స్ అయితే‌.. నేను శ్రుతి ఫ్యాన్‌’ అని అందరి ముందు చెప్పారు. 


శ్రుతి హీరోయిన్‌గా చేసిన ఓ డైరెక్టర్‌ ఇప్పుడు టాప్‌ డైరెక్టర్‌ తెలుసా?
శ్రుతి: పూరి జగన్నాథ్‌. చిన్నప్పుడు నేను హీరోయిన్‌గా చేస్తే పూరి డైరెక్ట్‌ చేసేవాడు. ముప్పై ఏళ్లుగా మా స్నేహం అలాగే ఉంది. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలాగే ఉంటాడు. డబ్బు, ఫేమ్‌ వచ్చినా ఏమీ మారలేదు. తనతో  ఏ విషయాన్నైనా పంచుకోగలను. పూరి నాకు గర్ల్‌ఫ్రెండ్‌లాంటోడు. తనని బాబు మొషాయ్‌ అని పిలుస్తుంటాను. 
మీరు అద్భుతమైన నటులు కదా? సినిమాల్లో చేయకపోడానికి కారణమేంటి? 
శ్రుతి: బుల్లితెరలో మనం క్వీన్‌లాగా వెలుగుతున్నప్పుడు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేయడం ఎందుకనిపిస్తుంది. సీరియల్స్‌లో మన కోసం ప్రత్యేకంగా పాత్రలు రాసుకుంటారు. సినిమాలు చేయకూడదని కాదు.. కానీ మనకంటూ ఒక రెండు సీన్‌లైనా దమ్మున్నవి ఉంటే చేయాలనిపిస్తుంది. చేసే పాత్రలకు ఇంపార్టెన్స్‌ ఉండాలి కదా!


డబ్బింగ్‌ కూడా చెప్పారు కదా?
శ్రుతి: అవును. ప్రీతికి కూడా డబ్బింగ్‌ చెప్పాను. 

మీరు డబ్బింగ్‌ చెప్పాలంటే లైట్స్‌ అన్ని ఆపేయాలని అడిగేవారంట కదా?
శ్రుతి:  సిల్క్ స్మిత గారికి డబ్బింగ్‌ చెప్పినప్పుడు జరిగిందది. నేను కూడా ఒక నటినే కాబట్టి. సిల్క్ స్మితకు డబ్బింగ్ చెప్పాల్సినప్పుడు హావభావాలు కూడా మొహంలో పలికేవి. అక్కడే చిత్రబృందం ఉండటంతో డబ్బింగ్‌ చేయడం ఇబ్బందిగా అనిపించేది. అందుకే లైట్లు అన్ని ఆపేయమని అడిగేదాన్ని.

పెద్దవంశీ నల్లచీర ఫొటో కథేంటీ?
ప్రీతి నిగమ్‌: ‘లేడీ డిటెక్టివ్‌’ అనే సీరియల్‌ చేస్తున్నాం. దానికి ఆయనే దర్శకుడు. వంశీ గారికి నల్లచీరంటే ఇష్టం. సూర్యాస్తమయం అవుతుంటే  పాత బంగ్లా మీదకి తీసుకెళ్లి మంచి ఫొటో తీశారు. మూడు రోజుల తర్వాత ఆ ఫొటోనే కానుకగా ఇచ్చారాయన. 

హోలీ పండగ సమయంలో వెనక్కి నడిచారంట? ఏంటా కథ?
ప్రీతి నిగమ్‌: పెళ్లికి ముందు జరిగిన ఘటన ఇది. ఆ రోజు వేరొకరి మీద ప్రయోగం చేయబోయే ఇలా తేడా కొట్టింది. ఆ పానీయం తీసుకున్నాక శ్రుతి వెనక్కి నడవడంతో అక్కడ ఫన్‌ జెనరేట్‌ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని