Ashwini Dutt: చిరు-రజనీ-శ్రీదేవిలతో ‘రంగీలా’ చేయాలనుకున్నా.. కానీ!

ఆయనొక భారీ చిత్రాల నిర్మాత.. ఆ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ హీరోల కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్లు. 50ఏళ్ల సినీ ప్రస్థానంలో కాసుల వర్షం కురిపించిన చిత్రాలెన్నో. తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన

Updated : 16 Aug 2022 11:58 IST

ఆయనొక భారీ చిత్రాల నిర్మాత.. ఆ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ హీరోల కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్లు. 50ఏళ్ల సినీ ప్రస్థానంలో కాసుల వర్షం కురిపించిన చిత్రాలెన్నో. తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రాలను నిర్మించిన లెజండరీ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌(Ashwini Dutt).. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మీ సంస్థ లోగోలో లెజెండరీ నటుడు ఎన్టీఆర్‌ బొమ్మ ఉంటుంది. అది మీకు సెంటిమెంటా? లేక ఆయనపై గౌరవంతో పెట్టుకున్నారా?

అశ్వనీదత్‌: ఇప్పటికీ ఎప్పటికీ ఆయననే దైవంగా భావిస్తా. ఆయనతో సినిమా తీయాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టా. అంతకుముందు సావరీన్‌ సినీ ఎంటర్‌ప్రైజెస్‌ అనే బ్యానర్‌ ఉండేది. ఆ సమయంలో ఎన్టీఆర్‌ (NTR) దగ్గరకు వెళ్లి కాల్షీట్స్‌ కావాలని అడిగా. ‘నువ్వొక మంచి సినిమా తీశావు. నేను చూశాను. చాలా బాగుంది కదా. సినిమాలు వద్దు. వెళ్లిపో’ అన్నారు. ‘లేదండీ.. మీతో సినిమా తీయడానికే ఇండస్ట్రీకి వచ్చా. ఆ సినిమా ద్వారా మిమ్మల్ని కలిసి, మీతో చేయాలని అనుకుంటున్నా’ అని రెండు మూడు వారాలు వదిలి పెట్టకుండా తిరిగితే, అప్పుడు ఒప్పుకొన్నారు. కాల్షీట్స్‌ రాయడానికి వెళ్తే, ‘ఏంటి మన బ్యానర్‌ పేరు’ అని అన్నారు. ‘ఇంకా ఏమీ పెట్టలేదండీ. మీరు పెడితే బాగుంటుంది’ అని అన్నాను. ఒక్కసారి అటూ ఇటూ చూశారు. ఆయన కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఫొటో కనిపించింది. వెంటనే ‘కృష్ణుడి మెడలో ఉన్న దండ పేరు వైజయంతీ మాల. అది ఎప్పటికీ వాడిపోదు. ఎప్పుడూ విజయంతోనే ఉంటుంది. వైజయంతీ మూవీస్‌ అని పెడదాం’ అని పెట్టారు. అప్పటి నుంచి కొంతకాలం రాధాకృష్ణుల లోగో చేసి వాడాం. ఆయన సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఫొటోను లోగో కింద మార్చాం. మా పిల్లలు కూడా ఆ లోగోనే కొనసాగిస్తారు.

ఎన్టీఆర్‌ హీరోగా మీరు ఎన్ని సినిమాలు చేశారు?

అశ్వనీదత్‌: రెండు సినిమాలే తీశా. ‘ఎదురులేని మనిషి’. ‘యుగ పురుషుడు’. ఇందులో ఏదీ రీమేక్‌ కాదు. ‘నిప్పులాంటి మనిషి’ జంజీర్‌కు రీమేక్‌. మా సినిమాకు భమిడిపాటి రాధాకృష్ణ కథ అందించారు. ఒకట్రెండు చోట్ల ఆ ఛాయలు ఉన్నాయంతే. ‘యుగ పురుషుడు’ బ్లాక్‌బస్టర్‌ చిత్రం.

ఇంజినీరింగ్‌ చదువుదామని మద్రాసు వెళ్లారు. కానీ, బీఎస్సీ ఎందుకు చదవాల్సి వచ్చింది?

అశ్వనీదత్‌: ఇంజినీరింగ్‌ నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు. కానీ, మా నాన్నగారు నన్ను ఇంజినీర్‌ను చేయాలని పట్టుబట్టారు. దీంతో చదువుకోసం హోస్సూర్‌ వెళ్లా. ఫస్ట్‌ సెమిస్టర్‌ అయిన తర్వాత అనారోగ్యం బారినపడ్డా. దీంతో వెనక్కి వచ్చేసి, బీఎస్సీలో చేరా. నాకు ఒక అక్క.

మీకు ముగ్గురు పాపలు కదా!

అశ్వనీదత్‌: స్వప్న, శేషు ప్రియాంక, స్రవంతి. స్వప్న అమెరికాలో మాస్టర్స్‌ చేసింది. రెండో పాపకు ఆర్ట్‌ మీద ఆసక్తి ఎక్కువ. అందుకే స్టూడియో ఆర్ట్స్‌లో కోర్సు చేసింది. స్రవంతి హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేసింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్లు తీసుకున్న నిర్ణయాలు నేను ఊహించలేదు. స్వప్నను అమెరికాలోనే ఉండమన్నాను. కానీ, ఇండస్ట్రీవైపు వచ్చింది. తొలిసారి ఈటీవీ కోసం ‘ఝుమ్మంది నాదం’ చేసింది. అక్కడి నుంచి లోకల్‌ టీవీ పెట్టాం. ఆ తర్వాత సినిమాలు. ప్రియాంకకు మ్యూజిక్‌పై మంచి అభిరుచి ఉంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కథ వాళ్లిద్దరూ కలిసి విన్నారు. కానీ, అప్పటికే రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ‘నాగ్‌ అశ్విన్‌ చెప్పిన కథ బాగుంది. సినిమా చేద్దామా’ అని అడిగారు. ‘ఇప్పటికే నేను పోగొట్టిన దానికంటే ఎక్కువ పోగొట్టారు’ అనే సరికి, ఏమీ మాట్లాడకుండా దిగులుగా వెళ్లిపోయారు. వెంటనే రాఘవేంద్రరావుగారు ఫోన్‌ చేసి, ‘నేను ఆ కథ విన్నాను. కచ్చితంగా నువ్వు తీయాలి’ అన్నారు. అలా ఆ సినిమా పట్టాలెక్కింది. దర్శకుడు నాగ్‌ టేకింగ్‌ బాగా నచ్చింది. కొద్దిరోజులకు నాగ్‌ అశ్విన్‌ మా ఇంటి అల్లుడు అయ్యాడు. పెద్ద డాక్టర్స్‌ కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ల కుటుంబంలో 50మంది డాక్టర్లు ఉంటే, ఈయన ఒక్కడే ఇంజినీరింగ్‌ చదివి ఇండస్ట్రీకి వచ్చాడు. జేజే హాస్పటల్స్‌ జయంతి-జయరామిరెడ్డిల తనయుడు.

రాఘవేంద్రరావుతో మీకు ఎక్కడ పరిచయం?

అశ్వనీదత్‌కొవెలమూడి వాళ్లు మాకు బంధువులే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన ‘బాబు’ తీస్తుండగా, నేను ‘ఓ సీత కథ’ పూర్తి చేశా. ఒకరోజు అనుకోకుండా కలిశాం. తర్వాత మంచి స్నేహితులమయ్యాం. నేను తీసిన ‘ఎదురులేని మనిషి’ టైటిల్‌ ఆయనే పెట్టారు. ‘యుగపురుషుడు’ సమయంలో దర్శకుడు బాపయ్య హిందీలో బిజీ కావడంతో స్క్రీన్‌ప్లేలో ప్రకాశరావుగారు సాయం చేశారు. అలాగే బాపయ్యగారు లేనప్పుడు కొన్ని సీన్లు రాఘవేంద్రగారు తీశారు. మేమిద్దరం కలిసి ‘అడవి సింహాలు’, ‘అగ్నిపర్వతం’, ‘ఆఖరిపోరాటం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అశ్వమేథం’ తీశాం. ఆ తర్వాత రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్‌ బ్యానర్‌ పెట్టి, ‘పెళ్లి సందడి’, ‘పరదేశి’, ‘గంగోత్రి’ ఇలా చాలా సినిమాలు తీశాం.

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌తో పాటు మొత్తం ఎన్ని సినిమాలు చేశారు?

అశ్వనీదత్‌: అన్ని బ్యానర్లు కలిపి సుమారు 70 సినిమాలు చేశా. తమిళ్‌, కన్నడ, హిందీలో కూడా సినిమాలు తీశా. హిందీలో మొదటి సినిమా పెళ్లి సందడి రీమేక్‌.. ‘మేరీ స్వప్నోంకీ రాణి’. ఆ తర్వాత అనిల్‌కపూర్‌తో నేనూ-అల్లు అరవింద్‌ కలిసి ‘చూడాలని ఉంది’ రీమేక్‌ చేశాం. చెరొక ఆరు కోట్లు నష్టపోయాం.

మీ బ్యానర్‌నుంచి కొన్ని రోజుల పాటు ఏ సినిమా రాలేదు. ఎందుకంత గ్యాప్‌ తీసుకోవాల్సి వచ్చింది?

అశ్వనీదత్‌: నేను జాతకాలు బాగా నమ్ముతా. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తీసినప్పుడు మా నాన్నగారి స్నేహితుడు శాస్త్రి అని ఉండేవారు. ఆయన పిలిచి ‘సినిమా ఎప్పుడు విడుదల చేస్తావు’ అని అడిగారు. ‘మే 9న అనుకుంటున్నాం’ అని చెప్పా. ‘అదే రోజున విడుదల చెయ్‌. తుపాను వస్తుంది. తుపానుకు మించి ధనం వస్తుంది’ అని చెప్పారు. చాలా చోట్లకు రైలులో ప్రింట్లు వెళ్లకపోతే లారీలు పెట్టి పంపాం. అన్నట్లుగానే తుపానుకు మించి డబ్బులు, పేరు వచ్చాయి. ఆ సినిమా సుమారు రూ.కోటితో పూర్తి చేశాం. మొదటి సినిమా ‘ఎదురులేని మనిషి’ రూ.16లక్షల్లో పూర్తి చేశాం. ‘యుగపురుషుడు’ రూ.20లక్షల్లో తీశాం.

పారితోషికం విషయంలో రామారావుగారు చాలా కచ్చితంగా ఉంటారు. ఆయన సినిమాకు పారితోషికం ఏమీ చెప్పలేదు. నేనూ అడగలేదు. వాణిశ్రీగారు రూ.2లక్షలు పారితోషికం అడిగారు. అప్పుడు ఆమె చేసిన సినిమాలు వరుస హిట్స్‌. దాంతో మేము కూడా సరే అన్నాం. ఎన్టీఆర్‌కు అప్పటికే రూ.1.75లక్షలు ఇచ్చాం. మరో రూ.50వేలు అడుగుతారేమోనని పేపర్‌లో చుట్టి తీసుకెళ్లా. ‘ఏమి.. అంత పెద్దది తెచ్చారు? ఇటు ఇవ్వండి’ అని తీసుకుని, డబ్బులు లెక్క పెట్టారు. ‘ఏంటి రూ.50వేలు ఉంది. బ్యాలెన్స్‌ పాతికే కదా. మనం తీసుకునేది రూ.2లక్షలే’ అని మిగిలిన డబ్బులు ఇచ్చారు. కృష్ణ, కృష్ణంరాజుగారు కూడా అంతే. ఇక క్రమశిక్షణకు మారు పేరు చిరంజీవి. ఇండస్ట్రీని ఆయనే నడిపిస్తున్నారు. బాలకృష్ణ, నాగార్జునలు కూడా పెద్ద హీరోల కొడుకులమని ఎప్పుడూ ప్రవర్తించలేదు. చాలా క్రమశిక్షణతో ఉంటారు. షూటింగ్‌ టైమ్‌ చెబితే, కచ్చితంగా ఆ సమయానికి వచ్చేస్తారు. అలాగే వెంకటేశ్‌ కూడా పెద్ద నిర్మాత తనయుడినన్న గర్వం ఉండదు. ఆ సమయంలో ఇండస్ట్రీ దేదీప్యమానంగా వెలిగిందని నా అభిప్రాయం.

ఇటీవల ఇండస్ట్రీలో సమ్మె అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది?

అశ్వనీదత్‌: నిజం చెప్పాలంటే ఏం జరుగుతుందో మనలాంటి వాళ్లకు అర్థం కాదు. వాళ్లేదో పదిమంది కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్కడి నుంచి, ఇక్కడి నుంచి నటులను తీసుకొచ్చి, వాళ్లు అడిగినంత పారితోషికం ఇస్తున్నారు. సినిమా ఆడినంత కాలం బాగానే ఉంది. ఇప్పుడు వర్కవుట్‌ కావటం లేదని చెబుతున్నారు. ‘అడ్వాన్స్‌ రూ.50కోట్లు.. సినిమా పూర్తయిన తర్వాత రూ.50కోట్లు ఇస్తాం’ అన్నవాళ్లు కూడా స్ట్రైక్‌ చేస్తున్నారు. టికెట్ రేట్లు పెరిగాయని, రెమ్యునరేషన్స్‌ భారీగా ఉన్నాయన్న కారణంతో స్ట్రైక్‌ చేస్తే బాగానే ఉంటుంది. కానీ, ‘సినిమాలు తీస్తుంటే వర్కవుట్‌ కావడం లేదు’ అని కొంతమంది.. ‘మీరు సినిమాలను ఓటీటీలకు అమ్ముకుంటున్నారు’ అని ఎగ్జిబిటర్స్‌ గొడవ చేస్తున్నారు. ఎగ్జిబిటర్స్‌ థియేటర్‌లన్నీ ముగ్గురు, నలుగురికి అద్దెకు ఇచ్చారు. ఇన్ని సమస్యలు ఉంటే, మధ్యలో నిర్మాతలు స్ట్రైక్‌ చేయడమేంటో అర్థం కాలేదు.

‘ప్రాజెక్ట్‌-కె’ ఎంత వరకూ వచ్చింది?

అశ్వనీదత్‌55శాతం పూర్తయింది. మేజర్‌ షెడ్యూల్‌ ఇప్పుడే జరుగుతోంది. స్ట్రైక్‌ లేకపోతే ఈ షెడ్యూల్‌ పూర్తయ్యేది. సినిమా విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పటివరకూ ఇలాంటి సినిమా ఎవరూ తీయలేదన్న గర్వంతో చేస్తున్నా. దీనికి కారణం నాగ్‌ అశ్విన్‌ రచన, ప్రభాస్‌, దీపిక పదుకొణె, అమితాబ్‌ల నటన. సినిమాకు తగ్గట్టుగానే సెట్స్‌ ఉంటాయి.

భారీ చిత్రాలు తీసే అశ్వనీదత్‌ ఎందుకు కాస్త నిరాశచెందారు?

అశ్వనీదత్‌: ‘శక్తి’ విడుదలైన తర్వాత నాలో చాలా ‘శక్తివిహీనం’ వచ్చిందనిపించింది. కథ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. ‘ఈ సినిమా తీయొద్దు’ అని ప్రియమిత్రుడు రజనీకాంత్‌గారు హెచ్చరించారు. ‘అసలు శక్తి పీఠాల గురించి మీకేం తెలుసు’ అని మా ఆవిడ అడిగినా, కథ బాగుందని ధైర్యం చేసి తీశా. ఫలితం చూశారుగా. దీంతో కొద్ది రోజులు గ్యాప్‌ తీసుకోవాలనుకున్నా. ఆ సినిమా విడుదలైన నెల రోజులకే నాన్న కూడా చనిపోయారు. వీటన్నింటితో కాస్త వెనకడుగు వేశా. ఆ తర్వాత నాగార్జున-నానిలతో ‘దేవదాస్‌’ తీశా. మరోవైపు మా అమ్మాయిలు కూడా సినిమా చేస్తుండటంతో నేను కూడా తీయాలని ‘ప్రాజెక్ట్‌-కె’ కోసం వచ్చా.  అంతర్జాతీయ స్థాయికి సినిమాను తీసుకెళ్లగల నటుడు ప్రభాస్‌ మనకు ఉన్నాడు. ఇలాంటి సమయంలోనే నాగీ ఒక మాట అన్నాడు. ‘హను రాఘవపూడి మంచి టెక్నీషియన్‌. ఆయనకు కలిసి రాక కొన్నాళ్లు ఆగాడు. ఏదైనా కథ ఉంటే వెళ్లి వినండి’ అని చెప్పాడు. అప్పుడు స్వప్న వెళ్తే, ‘సీతారామం’ కథ చెప్పాడు. ఇదే విషయాన్ని తను నాకు చెప్పింది. ఇప్పటివరకూ మా బ్యానర్‌లో ప్రేమకథలు తీయలేదు. అందుకే హను కథకు ఏది అవసరమైతే అది ఇచ్చాం. హిమాలయాలు, రష్యా, గుజరాత్‌ ఇలా ఏ ప్రాంతంలో షూటింగ్‌ కావాలంటే అక్కడకు వెళ్లి తీశాం. ‘ఇంత చిన్న సినిమాకు భారీ బడ్జెట్‌ అయిందే’ అనుకున్నారు. నాకు అదే అనిపించింది. కానీ, కథను నమ్మి తీశాం. ‘శంకరాభరణం’లాంటి సినిమా తీయలేదే? అని ఉండేది. ‘సీతారామం’తో ఆ కోరిక తీరింది. హీరోయిన్‌ ఎవరో తెలుగువారికి తెలియదు, దుల్కర్‌ కూడా ‘మహానటి’లో కాస్త నెగెటివ్‌ రోల్. అయినా కూడా ఈ సినిమాతో ప్రేక్షకులు ఆదరించారు.

‘జాతిరత్నాలు’ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు కథ మీరు విన్నారా?

అశ్వనీదత్‌అసలు వాళ్ల దగ్గర కథేమీ లేదు. కామెడీ సీన్స్‌ అంతే (నవ్వులు).. ఆ క్రెడిట్‌ అంతా నాగీకే దక్కుతుంది. గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ సమయంలో నాగీ ‘ప్రాజెక్ట్‌-కె’ కథ రాసుకుంటున్నాడు. అప్పుడు నా దగ్గరకు వచ్చి, ‘అనుదీప్‌ అంటే నాకు ఫ్యాసినేషన్‌. అతడి దగ్గర చిన్న కామెడీ కథ ఉంది. ఇద్దరం కలిసి ఆ కథ సిద్ధం చేశాం’ అని చెబితే సరేనన్నా. సినిమా ఆలస్యమైపోతుండటంతో ‘ఏంటి నాగీ.. ప్రభాస్‌ సినిమా కూడా ఓకే అయిపోయింది. దీన్ని ఎందుకు సాగదీస్తున్నారు’ అని అన్నాను. ‘లేదు అయిపోయింది’ అని చెప్పాడు. అదే సమయంలో అమెజాన్‌ప్రైమ్‌ వీడియో వాళ్లు వచ్చి, ‘జాతిరత్నాలు మాకు ఇస్తారా?’ అంటూ రూ.22కోట్లు ఆఫర్‌ చేశారు. అప్పటికి ఆ సినిమాకు ఖర్చు ఆరేడు కోట్లే అయ్యాయి. ‘ఇప్పుడు సినిమాకు పబ్లిసిటీ, ప్రింట్లు అవసరమా. వదిలించేయండి’ అన్నాను. అప్పుడు నాగీ ‘అంకుల్‌ మీరు ఏమీ అనుకోవద్దు. ఆ సినిమా ఓటీటీకి ఇస్తే ఫ్లాప్‌ అవుతుంది. థియేటర్‌ కోసం, మాస్‌ ఆడియెన్స్‌ కోసం తీసిన సినిమా ఇది’ అని చెప్పాడు. విడుదలైన తర్వాత అతడి నిర్ణయం సరైనదేననిపించింది. నేను కూడా థియేటర్‌లోనే సినిమా చూశా. మొదటి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నా.

మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లు మీ బ్యానర్‌పైనే వెండితెరకు పరిచయమయ్యారు కదా!

అశ్వనీదత్‌: కృష్ణగారికి సొంత బ్యానర్‌ ఉన్నా, ‘నువ్వు-రాఘవేంద్రరావు కలిసి మహేశ్‌ను హీరోగా పరిచయం చేస్తే బాగుంటుంది’ అని అన్నారు. అలాగే చిరంజీవిగారు కూడా. ‘గంగోత్రి’ కథను చిన్నికృష్ణ సిద్ధం చేసిన తర్వాత బన్నితో తీద్దామనుకోలేదు. అప్పుడు తేజతో బన్ని సినిమా అనుకున్నారు. అది కుదరలేదు. దాంతో ఈ సినిమా తీశాం.

‘రామ్మా చిలకమ్మా’ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కెరీర్‌కు ‘కామా’ పెట్టిందనుకోవచ్చా?

అశ్వనీదత్‌: అనుకోవాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఆయన విజృంభణ మామూలుగా లేదు. ప్రతి సినిమాలో బాలుగారే ఉంటున్నారన్న ఉద్దేశంతో ఉదిత్‌ నారాయణను ప్రయత్నించాం. కానీ, పాటల విషయంలో ఇండస్ట్రీని తన భుజస్కందాలపై నడిపి మహానుభావుడు బాలుగారు. ఉదిత్‌ నారాయణను పెట్టాలన్నది నేను-మణిశర్మ కలిసి తీసుకున్న నిర్ణయం. చిరంజీవిగారు కూడా ‘బాలు ఉండగా, ఎందుకు ప్రయోగం చేశారు’ అని అన్నారు. కానీ, ఉదిత్‌ పాడటంతో అందరికీ వెరైటీగా అనిపించింది.

‘రంగీలా’ మూవీని తెలుగులో చిరంజీవి-రజనీకాంత్‌-శ్రీదేవిలతో తీయాలనుకున్నారా?

అశ్వనీదత్‌రాము నాకు రెండు కథలు చెప్పాడు. తన ఓటు ‘రంగీలా’కు వేశాడు. రెండోది ‘గోవింద గోవింద’ కథ. ‘శివ’లాంటి సినిమా తీశాడు కదా.. ‘వేంకటేశ్వరస్వామి ఆలయంలో దోపిడి’ కథ తీస్తే బాగుంటుందనిపించింది. దీనితో తోడు, చిరంజీవి, రజనీకాంత్‌ల దగ్గరకు వెళ్లి అతిథి పాత్రలు చేయమని అడిగాలి. అందుకే ఈ ముక్కోణపు ప్రేమకథ ఎందుకనిపించింది. అలా నాకు ‘గోవింద గోవింద’ వచ్చింది. ఆమిర్‌ఖాన్‌కు ‘రంగీలా’ వెళ్లింది(నవ్వులు) రాములో కామెడీ టైమింగ్‌ బాగుంటుంది.

‘మహానటి’ తీయాలన్న ఆలోచన ఎవరిది?

అశ్వనీదత్‌: దాసరిగారి ‘గోరింటాకు’ తీస్తుండగా సావిత్రిగారిని కలిసి నమస్కారం చేశానంతే. అంతకుముందు నేను విజయవాడలో ఉండగా, ఒకట్రెండు ఫంక్షన్స్‌లో రామారావుగారితో కలిసొస్తే దూరం నుంచి చూశానంతే. సావిత్రిగారి గొప్పతనం గురించి అందరికీ తెలుసు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ తర్వాత  మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో సినిమా తీయాలని ఉందని నాగీ చెప్పాడు. అతని మైండ్‌లో సావిత్రిగారు ఉన్నారని నాకు అర్థమైంది. ఒక రోజు మేము శాంతాబయోటిక్‌ వరప్రసాద్‌గారి ఇంటికి భోజనానికి వెళ్లాం. వాళ్ల ఇంటికి ఎవరు వచ్చినా ఒక పుస్తకం ఇవ్వటం అలవాటు. అలా నా భార్య అక్కడ ఉన్న లైబ్రరీలో ఒక పుస్తకం తీసుకోవడానికి ప్రయత్నించగా, అది కాకుండా సావిత్రిగారి బయోగ్రఫీ చేతిలో పడింది. ఆ తర్వాత వారం రోజులకు ఇంట్లో అందరం కూర్చొని మాట్లాడుతుండగా, ‘నాగీ.. సావిత్రిగారిపై రాసిన పుస్తకం చదివా. ఆమె బయోపిక్‌ నువ్వు తీస్తే బాగుంటుంది’ అని మా ఆవిడ చెప్పింది. ‘నేను అదే అనుకుంటున్నాను అత్తయ్య’ అని నాగీ చెప్పాడు. అలా ‘మహానటి’ పట్టాలెక్కింది.

మొదట ఒక మలయాళ నటిని అనుకున్నాం. ‘మనం సావిత్రి బయోపిక్‌ తీస్తున్నాం కదా. చివరిలో ఆ తాగుడు సీన్స్‌ ఉండవు కదా. అలాంటివి ఉంటే చేయను’ అని చెప్పిందని నాతో ఎవరో అన్నారు. ‘స్క్రిప్ట్‌పై కామెంట్‌ చేయడానికి ఆమె ఎవరు? ఆ అమ్మాయిని మాత్రం పెట్టడానికి వీల్లేదు’ అని చెప్పా. నాలుగైదురోజుల తర్వాత  ‘కీర్తిసురేశ్‌ హీరోయిన్’ అని చెప్పాడు. ఒకవేళ ఆ మలయాళ నటి ఈ సినిమా చేసి ఉంటే, మంచి పేరు వచ్చేది. ఎందుకంటే సావిత్రిగారి పాత్రను తను ఈజీగా చేసేస్తుంది. కానీ, కీర్తిసురేశ్‌ చేయడంతో అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఇదంతా పైనుంచి సావిత్రిగారే చేయించారని నేను అనుకుంటున్నా. ‘మహానటి’ తర్వాత స్వప్నకు కూతురు పుట్టింది. అది ఏది చేసినా సావిత్రిగారిలా చేస్తుంది. ఆమె మా ఇంట్లోనే పుట్టిందా? అనిపిస్తుంది.

భవిష్యత్‌లో వైజయంతీ మూవీస్‌ నుంచి ఎలాంటి సినిమాలు ఆశించవచ్చు?

అశ్వనీదత్‌నందినీరెడ్డితో ఒక సినిమా చేస్తున్నాం. ‘అన్నీ మంచి శకునములే’.  సంతోష్‌ శోభన్‌ టాలెంటెడ్‌ నటుడు. దీంతో పాటు ‘ప్రాజెక్ట్‌-కె’. ఇక నా మనసులో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ పార్ట్‌-2 చేయాలని ఉంది. రాఘవేంద్రరావుగారు, నాగీ కలిసి చేస్తే కుదురుతుందేమో. ‘ప్రాజెక్టు-కె’ 2023 అక్టోబరు 18న విడుదల చేయాలనుకుంటున్నా. అయితే, గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తవ్వాలి కదా! ఇప్పటికే అమెరికాలో ఆ పనులు మొదలయ్యాయి.

ఉత్తమ నిర్మాత ఎవరు? అశ్వనీదత్‌? స్వప్నా? మీకు వారసులు లేరని ఎప్పుడైనా ఫీలయ్యారా?

అశ్వనీదత్‌: కచ్చితంగా స్వప్ననే.(నవ్వులు) ఇక వారసులు లేరని ఫీలింగ్‌ వచ్చే ముందు ఒకటి ఆలోచిస్తా. ‘వాడెవడో విచిత్రంగా పుట్టి, నన్ను హీరోను చెయ్‌’ అంటే మొత్తం పోయేది కదా! ఆ సమస్య రాలేదు. ‘సన్‌స్ట్రోక్‌’ రాలేదు.(నవ్వులు)

ఉమాచండీ-గౌరీశంకరుల కథ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగిందని సింగీతం శ్రీనివాసరావు మీతో చెప్పారట!

అశ్వనీదత్‌: ఆ సినిమాకు సింగీతం కో-డైరెక్టర్‌. అప్పట్లో ఇంట్లోనే మేకప్‌ వేసుకుని సెట్‌కు వెళ్లి ఆభరణాలు తగిలించుకునేవారు. శివుడి మెడలో పాము కూడా ఆభరణమే. సాధారణంగా రబ్బరు పాములు వాడతారు. ఎన్టీఆర్‌ మాత్రం నిజమైన పామును మెడలో వేసుకునేవారు. సెట్‌కు రాగానే పాముని చూసి ‘వదలండి బ్రదర్‌. వారే వస్తారు’ అన్నారు. ఇంతలో కె.వి.రెడ్డిగారు ‘సింగీతం ఏంటి ఆలస్యం’ అని అడిగారు. ‘పాము మెడలో వేయాలండీ. కానీ, వారేమో వదలండి వారే వస్తారని అంటున్నారు’ అని సింగీతం సమాధానం ఇచ్చారు. ‘పాముకు బ్రెయిన్‌ ఉందా? పిలిస్తే వస్తుందా?’ అని కె.వి.రెడ్డి అన్నారట. ఇంతలో బూర ఊదడంతో పాము పాకుతూ వెళ్లి ఎన్టీఆర్‌ మెడలో చుట్టుకుందట. అది చూసిన కె.వి.రెడ్డి పరుగున వచ్చిన ‘మిస్టర్‌ రామారావు మీరు చాలా ప్రత్యేకం’ అని నమస్కారం చేశారట. నిజంగా ఎన్టీఆర్‌ దైవాంశ సంభూతుడు.

భవిష్యత్‌లో ఓటీటీ అనేది థియేటర్‌ మనుగడకు ఇబ్బందిగా మారుతుందా?

అశ్వనీదత్‌: నాలుగు వారాలకే సినిమా ఓటీటీకి వచ్చేస్తే, కింద ఉన్న బి,సీ సెంటర్ల పరిస్థితి ఏంటి? అనే చర్చలు ఉన్నాయి. ఏమీ కాదు. మొదటి రెండు, మూడు వారాల్లో థియేటర్ల నుంచి ఏమైతే డబ్బులు వస్తాయో అవి తీసుకుని, ఓటీటీలకు ఇచ్చేయొచ్చు. చిత్ర పరిశ్రమకు ఓటీటీలు ఎంతమాత్రం ప్రమాదకరం కాదు. యూట్యూబ్‌ అనేది చాలా ప్రమాదకరం. ‘ఆలీ-అశ్వనీదత్‌ కొట్టుకున్నారు’ అని పెడితే, ఎందుకు జరిగింది? అసలు ఏం జరిగింది? అన్నది ఎవరూ పట్టించుకోకుండా చదువుతుంటారు. కాకపోతే, ఓటీటీలో విడుదల చేసే విషయంలో పరిమిత సమయం పెట్టుకుంటే మంచిది.

‘ఇక జీవితంలో సినిమా చేయొద్దు’ అని ఎప్పుడైనా అనిపించిందా?

అశ్వనీదత్‌: విరామం తీసుకుందామనుకున్నాను కానీ, అసలు సినిమాలు చేయొద్దు అని అనుకోలేదు. నిర్మాతగా ఇండస్ట్రీలో నా ముగింపు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని