Ram Gopal Varma: నాలా ఉండాలంటే మూడు విషయాలు వదిలేయాలి: వర్మ

ఆయన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం చాలా అర్థవంతమైన అర్థంలేనితనం. ఎందుకంటే ఆయన ఎవరికీ అర్థంకారు కాబట్టి. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి చిత్రాలు తీస్తాడో గ్రంథాల్లో ఋషులు, చరిత్రలో పెద్దలెవ్వరూ చెప్పలేదు కాబట్టి..

Updated : 13 May 2022 10:14 IST

ఆయన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం చాలా అర్థవంతమైన అర్థంలేనితనం. ఎందుకంటే ఆయన ఎవరికీ అర్థం కారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు ఎలాంటి చిత్రాలు తీస్తాడో గ్రంథాల్లో రుషులు, చరిత్రలో పెద్దలెవ్వరూ చెప్పలేదు. తన గురించి తన సినిమా గురించి కాసేపు సరదాగా మాట్లాడడానికి తన తాజా చిత్రం ‘మా ఇష్టం’లోని కథానాయికలు అప్సరారాణి, నైనా గంగూలీతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమంలో రామ్‌గోపాల్‌ వర్మ చెప్పిన ముచ్చట్లు..!

శివ, గోవిందా-గోవిందా, సత్య, క్షణక్షణం..ఇలాంటి సినిమాలు తీసిన రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు ఏమయ్యారు?

వర్మ: ఆ వర్మ ఎప్పుడో చచ్చిపోయాడు. నేను ప్రతి సినిమా తర్వాత మారిపోతాను. అది నా నైజం. నాకు మైండ్‌లో వచ్చిన ఆలోచననే కథగా మలచుకొని సినిమాగా తీస్తా.

బయట నిర్మాతలు రామ్‌గోపాల్‌ వర్మతో సినిమాలు తీయడానికి భయపడుతున్నారట. దానికి కారణం?

వర్మనేను తీసినన్ని సినిమాలు ఎవరూ తీయరు. అన్ని సినిమాలకూ నిర్మాతలు ఉన్నారు కదా! కొన్ని సినిమాలకు మాత్రం నేనే నిర్మాతని. నేను సినిమా హిట్‌, ఫ్లాప్‌లను పట్టించుకోను. ఎందుకంటే వేరే పనిలో నిమగ్నమవుతాను.

భారతదేశంలో వాక్‌ స్వాతంత్ర్యాన్ని వంద శాతం ఉపయోగించుకునే వ్యక్తి వర్మ అంటారు. దీనికి మీ సమాధానం?

వర్మ: వాక్‌ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోవడమంటూ ప్రత్యేకంగా ఉండదు. వేరేవాళ్లు ఏదైనా మాట్లాడాలంటే భయపడతారు. నేను భయపడను. అంతే తేడా. భారతదేశ పౌరుడిగా రాజ్యాంగంలో నాకు ఏమి హక్కులు ఉన్నాయో నాకు తెలుసు. వాటిని వినియోగించుకుంటానంతే.

కొన్నిసార్లు మీరు ట్వీట్స్‌ చేస్తుంటారు. వాటివల్ల ఎదుటివారు బాధపడతారని అనిపించదా?

వర్మ: నేనెప్పుడైనా ప్రజాపరమైన నిర్ణయాల మీదే ట్వీట్‌ చేస్తా. ఎవరి వ్యక్తిగత విషయాలపై చేయను. మనం మాట్లాడే ప్రతీ మాటకు ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు. అవతలి వాళ్లు బాధపడతారని మాట్లాడం ఆపేస్తే. ఎవ్వరూ మాట్లాడలేరు.

ఇటీవల టిక్కెట్ల ధరలు పెంచడం కోసం మంత్రిని కలిశారు. మిగతా సినిమాల టిక్కెట్ల ధరల గురించి అడిగారా.. మీ సినిమాకు పెంచమని అడిగారా? ఫలితం ఏమైంది?

వర్మనేను అసలు ఎవరి సినిమా కోసమూ వెళ్లలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యవర్తిగా వెళ్లాను. ఇక ఫలితంతో నాకు సంబంధం లేదు. మనం మన నిర్ణయాన్ని చెప్పినప్పుడు కొంతమందికి అది నచ్చుతుంది. కొంతమందికి నచ్చదు.

మీకు ఏ విషయంలో బోరు కొడుతుంది?

వర్మ: నాకు ఏ విషయంలో బోరుకొట్టదు. జీవితంలో ఒక్క నిమిషం కూడా బోరు కొట్టదు. 

చాలా మంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. వాళ్లకి మీరేం చెబుతారు. ఒకప్పుడు గుడ్‌బాయ్‌గా ఉండే రామ్‌గోపాల్‌ వర్మ ఎందుకు ఇప్పుడు మారిపోయారు?

వర్మ: నేను 20 సంవత్సరాల నుంచి ఒకేలా ఉన్నాను. నా ఇష్టం వచ్చినట్లు నేను బతుకుతా. మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఉండండి. ఇదే నేను ఇచ్చే సందేశం.

మీ తాజా చిత్రం ‘మా ఇష్టం’ ఒకప్పుడు మీరు విడుదల చేసిన ‘నా ఇష్టం’ పుస్తకం ఒకటేనా?ఈ సినిమాని జనాలు అంగీకరిస్తారనుకుంటున్నారా?

వర్మ: 2018లో సుప్రీంకోర్టు స్వలింగసంపర్కం నేరం కాదు అని తీర్పు చెప్పినప్పుడు ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం తప్పు కాదు. అలాంటి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొని బాహాటంగా చెప్పగలగడమే ‘మా ఇష్టం’. జనాలందరికీ నచ్చుతుందా లేదా అన్నది నాకు తెలీదు. ప్రేక్షకుల్లో చాలా రకాలు ఉంటారు. అందరిని కలిపి జనాలు అని అనడం భావ్యం కాదు.

సమాజం కోసం సినిమా తీశారా? మీ కోసం తీశారా?

వర్మ: నేనెప్పుడూ జనాల కోసం సినిమా తీయను. నా జీవితంలో నేను తీసిన అన్ని సినిమాలు నా కోసమే తీసుకున్నాను. ఎవరైనా అదే చేస్తారు. నేను చెబుతాను, వాళ్లు చెప్పరు అంతే తేడా.

‘మా ఇష్టం’లో ఈ ఇద్దరు అమ్మాయిల్నే ఎందుకు ఎంచుకున్నారు. సన్నిలియోనిను పెట్టుకోవచ్చు కదా?

వర్మ: ఈ సినిమాకు వీళ్లే సరిపోతారనిపించింది. అందుకే వీళ్లని ఎంచుకున్నా.

ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చేయబోతున్నారు?

వర్మ: ఈ సినిమా తర్వాత నేను మార్షల్‌ ఆర్ట్స్‌ మీద ఓ సినిమా తీశాను. అది జూన్‌లో విడుదలవుతుంది. ‘కొండ’ అని నక్సలైట్ల మీద తీశాను. అదీ జూన్‌లోనే విడుదలవ్వచ్చు.

ఎప్పుడూ వివాదాస్పదంగా ఉండే వాటిపైనే సినిమాలు తీస్తారా?

వర్మ: నాకు సామాన్యమైన మనుషులు, మాములు పనులు బోరు కొడతాయి. నేను అలాంటి సినిమాలు కూడా చూడను. నేను ఎలాంటి సినిమాలను ఇష్టపడతానో, అలాంటి సినిమాలనే తీస్తా.

మీరు పుట్టిన రోజు చేసుకోరు కదా? ఈ మధ్య బర్త్‌డే పార్టీలు ఎందుకు చేసుకుంటున్నారు?

వర్మ: వర్మ(నవ్వుతూ): ఈ మధ్య ఎక్కువగా అమ్మాయిలు పార్టీలు ఇస్తున్నారు. నేను చేసుకోవట్లేదు.

ఇప్పుడు ఎన్నికలు పెడితే మీకు ఎన్ని ఓట్లు పడతాయి?

వర్మ: నాకు అసలు ఓట్లు పడవు. బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ నాకు ఓటు వేయరు. నాకోసం నేను బతుకుతా జనాలకు ఏమి చేయనని అందరికీ తెలుసు. అది రాజకీయ నాయకుల లక్షణం కాదు కదా!

ప్రజలందరూ కంకణం కట్టుకొని మిమ్మల్ని సీఎం చేస్తే ప్రజలకు మీరు ఏం చేస్తారు?

వర్మ: నేను అసలు ఆ పదవి తీసుకోను. ఎందుకంటే నాకు బాధ్యతలు అనేవి నచ్చవు. ప్రజల కోసం కాదు. నేను ఎవరి కోసమూ ఏమి చేయను.

బతికితే రామ్‌గోపాల్‌ వర్మలా బతకాలని చాలా మంది అనుకుంటారు. మీలా ఉండాలంటే ఏం చేయాలి?

వర్మ: నాలాగా ఉండాలంటే మూడు విషయాలు వదిలేయాలి. దేవుడు, సమాజం, కుటుంబం ఈ మూడింటినీ వదిలేస్తే మీకు స్వేచ్ఛ వచ్చేస్తుంది. అప్పుడు ఎవరైనా నాలాగా బతకగలరు.

మీరు మీ జీవితంలో సంతృప్తిగా ఉన్నారా?

వర్మ: నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఇంకా సంతోషంగా ఉండాలి. నేను అనుకున్నది చేస్తాను. అది ఏమైనా కానీ కరోనా గురించి చదవడం, వేరే వాళ్ల సినిమాను చూడడం, ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం గురించి తెలుసుకోవడం ఇలా నేను చేసే ఎందులోనైనా నాకు సంతోషం ఉంటుంది.

ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన తెలుగు సినిమా ఏది?

వర్మ: ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీయఫ్‌-2, కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాలు నచ్చాయి.

శివ సినిమాకు ముందు మీకు స్ఫూర్తినిచ్చిన దర్శకుడు ఎవరు?

వర్మ: ఎవరూ లేరు. ఫలానా వ్యక్తి అని ఎవరూ లేరు. కానీ సినిమాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు చాలా మంది బయోపిక్స్‌ తీశారు. మీ జీవితాన్ని కూడా సినిమాగా తీస్తారా?

వర్మతెలీదు. నేనైతే తీయను. ఎవరైనా తీసినా అది చాలా బోరు కొడుతుంది. ఎందుకంటే ఒక సినిమాలో అన్ని ఎమోషన్స్‌ ఉండాలి. కానీ నాకు అలా ఏమీ ఉండదు.

ఎప్పుడైనా ‘దేవుడా నా కష్టాలు తీర్చు’ అనుకున్నారా?

వర్మ: నాకు అసలు కష్టాలు అనేవి ఉండవు. అసలు దేవుడిని నమ్మను. అలాంటప్పుడు నేను ‘దేవుడా నా కష్టాలు తీర్చు’ అని ఎందుకు అంటాను. నా దృష్టిలో అసలు దీనికి అర్థం లేదు.

ఏ ప్రశ్న అడిగినా వంకరగా సమాధానం చెబుతారు. అందరూ మిమ్మల్ని తెలివైన వాళ్లు అనుకోవాలనా?

వర్మ: నేను చెప్పదలచుకుంది. ఎలా చెబుతానన్నది నా పాయింట్‌.

మిమ్మల్ని చంపడం కోసం ఒక 20 మంది వెతుకుతున్నారనుకోండి వాళ్లకి మీరు దొరికితే ఎలా తప్పించుకుంటారు?

వర్మ: మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ‘వంగవీటి’ ఆడియో ఫంక్షన్‌ జరుగుతున్నప్పుడు చుట్టూ 20వేల మంది ఉన్నారు. నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఎవరో అరవడం మొదలు పెట్టారు. నాతో పాటు వేదిక మీద 15 మంది ఉన్నారు. వాళ్లంతా భయపడ్డారు. తర్వాత నిర్మాత నా దగ్గరకు వచ్చి అడిగారు. ‘ఏంటి సార్‌ మీరు అలా అన్నారు. ధైర్యమా.. పిచ్చా’ అని అడిగారు. రెండూ కాదు అర్థంచేసుకోవడం అని చెప్పాను. ఒకవేళ మీరుచెప్పినట్లు నన్ను చంపేవాళ్లకి నేను దొరికితే.. పారిపోను. నన్ను కత్తితో పొడిచినప్పుడు ఆ ఫీలింగ్‌ ఎలా ఉంటుంది అని ఆస్వాదించి చచ్చిపోతా.

మీలాగా ఉండే మనుషుల్ని ఎప్పుడైనా, ఎవర్నైనా కలిశారా?

వర్మ: అది మంచి విషయమా, చెడ్డ విషయమా అన్నది కాదు. ఇప్పటి వరకు నా జీవితంలో నేను చాలా మంది నుంచి చాలా నేర్చుకొని ఉండొచ్చు.

రామ్‌ గోపాల్‌ వర్మని ఎప్పుడు? ఎక్కడ కలిశారు?

అప్సరారాణి: ఆయనే నన్ను చూశారు. ఒక డాన్స్‌ షోలో చూసి సినిమాలో ఆఫర్‌ ఉందని చెప్పారు.

నైనా గంగూలీ: వంగవీటి సినిమా అప్పుడే మొదటిసారి కలిశాను. నేను వర్మతో చాలా సినిమాలు చేశాను. వంగవీటి, బ్యూటిఫుల్‌, టీ కంపెనీతో పాటు ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో కూడా చేశాను. మొదట్లో కొంచెం భయపడ్డాను. సెట్లో చాలా సీరియస్‌గా ఉంటారు.

‘మా ఇష్టం’ సినిమా ఫ్యామిలీ అందరితో కలిసి చూడచ్చా?

వర్మ: అందరూ చూడచ్చు. కానీ విడివిడిగా ఎవరికి వాళ్లు చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని