పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్‌ అయ్యింది!

సినిమా.. వారిని మనకు పరిచయం చేసింది. వారివురి మధ్య ప్రేమను చిగురింపజేసి రీల్‌లైఫ్‌ హీరోహీరోయిన్లైన వీరిని రియల్‌లైఫ్‌ కపుల్‌గా ఒక్కటి చేసింది. తమ సహజ నటనతో ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించి ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. వారే నటులు

Updated : 21 Jan 2021 13:33 IST

సినిమా.. వారిద్దరినీ మనకు పరిచయం చేసింది. వారి మధ్య ప్రేమను చిగురింపజేసి రీల్‌లైఫ్‌ హీరోహీరోయిన్లైన వీరిని రియల్‌లైఫ్‌ కపుల్‌గా ఒక్కటి చేసింది. తమ సహజ నటనతో ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. వారే నటులు శివబాలాజీ, మధుమిత.  వీరివురు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారం అవుతున్న ‘ఆలీతో సరదాగా’షోకు వచ్చి సందడి చేశారు. మరి ఈ జంట ఆలీతో పంచుకున్న విశేషాలను మీరూ చదివేయండి! 

ఆలీ: మీ సొంతూరు ఏది?
శివబాలాజీ: పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. మా పూర్వీకులు చిత్తూరు నుంచి తమిళనాడుకు వలస వెళ్లారు. మధురైలోని రాజుపాలెం, మహారాజపురంలో ఇప్పటికీ మావాళ్లు ఉంటారు. వాళ్లు మాట్లాడే తెలుగు కొత్తగా ఉంటుంది. ‘భోం చేసారా ’అని అడగటానికి ‘కూడు తింటివా’ అంటుంటారు. అలాగే కూతురిని చెలా అనీ, తండ్రిని అయ్యా అనీ పిలుస్తారు. మా అమ్మగారిది గుంటూరే. ఎవరన్నా నన్ను సొంతూరు పేరు చెప్పమంటే ‘గుంటూరు’అనే చెప్తాను.

‘మనోహరన్‌’ శివబాలాజీగా ఎలా మారారు?
శివబాలాజీ: మా నాన్న పేరు మనోహరన్, నాపేరు శివబాలాజీ మనోహరన్‌. మేము తమిళనాడుకు వలస వెళ్లాక మా తండ్రి పేరే ఇంటిపేరుగా మారిపోయింది.
మధు: అయితే, వీరి కుటుంబం ఇంటిపేర్ల గురించి ఒకరు పుస్తకం రాశారు. అందులో ‘కాంగుల’ అనేది ఇంటిపేరుగా ఉంది. ఇపుడు మా పిల్లలకు ఇంటిపేరుగా అదే ఉంచాం.

స్వప్న మాధురి పేరు మధుమితగా ఎలా మారింది?
మధుమిత: తెలుగులో చేస్తున్నపుడు ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క పేరు పెట్టేవారు. అప్పట్లో స్వప్న అని మరొక నటి ఉండేది. నా పేరు స్వప్నమాధురి అయినప్పటికి స్వప్న అనే పిలిచేవారు. అందుకే పేరు మార్చుకోవాలనుకున్నా. ‘పుట్టింటికి రా చెల్లి’ చిత్రంలో నా పాత్ర పేరు స్వాతి. అదే స్క్రీన్‌ నేమ్‌గా వేశారు దర్శకులు కోడి రామకృష్ణగారు. ఆ తర్వాత తమిళ్‌లో హీరోయిన్‌గా సినిమాలు చేయడం ప్రారభించాను. అప్పుడు ఒక సినిమాలో నా పాత్ర పేరు మధుమిత. ఇంటర్వ్యూలు తీసుకునేవారు కూడా అలానే నన్ను పరిచయం చేశారు. సెట్‌లో కూడా అలాగే పిలిచేవారు. అలా నా పేరు మారింది. నటుడు పార్థిబన్‌ కూడా నా మార్పుకు కారణం.

మీ సొంతూరు?
మధుమిత: నెల్లూరు, ప్రకాశంలో  మా మూలాలు ఉన్నాయి. ప్రకాశంలోని చిన్నపావని అనే గ్రామం మా అమ్మవాళ్లది. మా నాన్నగారిది పెద్దపావని అనే గ్రామం. 

మా ఇద్దరిలో(శివ బాలాజీని చూపిస్తూ)ఎవరు నీకు ముందు పరిచయం?
మధు: మీరే! డాన్స్‌ బేబి డాన్స్‌ షోలో పరిచయం అయ్యారు.

మొదటిసారి తెరపై ఎప్పుడు పరిచయం అయ్యారు?
మధు: నాకిప్పటికీ గుర్తు. అన్నమయ్య చిత్రం అప్పుడే రిలీజ్ అయ్యింది. ఆ చిత్రం ప్రమోషన్‌ కోసం కొన్ని ఆడిషన్స్‌ చేశారు. అక్కడకు వెళ్లిన నాకు ఒక డైలాగ్‌ చెప్పమని అడిగారు. టీనేజ్‌ కావడంలో గొంతులో అంత గంభీరత ఉండేది కాదు. దీంతో వాళ్లు మరో రెండేళ్లు ఆగితే మంచి అవకాశాలు వస్తాయని అన్నారు.

శివబాలాజీ మీకు ఎక్కడ పరిచయం?
మధుమిత: 2004 తమిళనాడులోని గోపిచెట్టిపాలెంలో ‘ఇంగ్లీష్‌ కారన్‌’అనే చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. అది హీరోయిన్‌గా నా మూడోచిత్రం.. అప్పటికే శివబాలాజీ కంటే ఇండస్ట్రీలో నేను సీనియర్‌. అక్కడే ఆయన పరిచయమయ్యారు.

మొదటిసారి కలిసినపుడు ఏమన్నారు?
శివబాలాజీ: ఎవరైనా హలో అనే అంటారు సార్‌! (నవ్వులు)
మధు: ఆ చిత్రం షూటింగ్‌ ఒక ఇంట్లో జరుగుతుంది. ఆయన సెట్లో ఒక పక్కన కూర్చుని ఉన్నారు. డైరెక్టర్‌ మా ఇద్దరికి పరస్పరం పరిచయం చేయించారు. నేను ఆయన్ను చూడగానే ‘హా మీరు నాకు తెలుసు. మీ ‘ఆశోక్‌గ్గాడి లవ్‌స్టోరీ’ సినిమా చాలా బాగుంది అన్నాను. అప్పటికే ఆయనపై నాకు మంచి అభిప్రాయం ఉండేది.

శివబాలాజీ: అంతకుముందు ‘అమ్మాయిలు..అబ్బాయిలు’ సినిమా చూసినపుడే మధుమితను చూసి ‘ఈ అమ్మాయి బాగా చేస్తుందే అనుకున్నాను’. ఆ తర్వాత ‘ఆర్య’రిలీజ్‌ అయ్యాక ‘ఇంగ్లీష్‌ కారన్‌’లో నాకు అవకాశం వచ్చింది.
మధుమిత: ‘ఇంగ్లీష్ కారన్‌’ దర్శకుడు శక్తి సిదంబరన్‌ మా ఇద్దరి మధ్య ప్రేమకు మొదట బీజం వేశారు (నవ్వులు). అయన సెట్లోని వారందరికి ‘శివబాలాజీ చేస్తేనే నేను హీరోయిన్‌గా చేస్తానంటూ మధుమిత అంటుంది’ అని ఒక రూమర్‌ క్రియేట్‌ చేశారు. శివబాలాజీని నేనే రికమండ్‌ చేసినట్టు చెప్పేవారు.

ముందు ఎవరు ప్రపోజ్‌ చేశారు?
శివబాలాజీ: మ ఇద్దరికి ఈ లవ్‌ ప్రపోజల్స్‌ లేవు. నేరుగా పెళ్లి గురించే మాట్లాడుకున్నాం.
మధుమిత: అంతకంటే ముందు ఆయన నన్ను చాలా ఏడిపించేవారు.
శివ బాలాజీ: అలా అని ఏం కాదు! మా ఇద్దరికి ఒకరిపట్ల ఒకరికి మంచి అభిప్రాయం ఉంది. నాకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. దాంతో కుదరినప్పుడల్లా ఫ్లర్ట్‌ చేస్తూ ఉండేవాడిని(నవ్వులు). అలా తనతో పెళ్లి గురించి మాట్లాడాను.

మరి మీ పెద్దలు ఒప్పుకున్నారా?
శివాబాలాజీ: మా ఇంట్లో ఒప్పుకున్నారు.
మధుమిత: మా ఇంట్లో మొదట ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈయనకు కోపం బాగా ఎక్కువని మా అమ్మ అభిప్రాయం. అమ్మ ఎప్పుడూ నాతోపాటే షూటింగ్‌లో ఉండేది. అలా ‘ఇంగ్లీష్‌కారన్‌’షూటింగ్‌లో ఉన్నప్పుడు ప్రొడక్షన్‌ వాళ్లు ఏదో ఏర్పాటు చేయలేదని ఈయన పెద్దగొడవ చేశారు. ఈ ఘటనతో ఆయనపై అమ్మకు సరైన అభిప్రాయం కలగలేదు. అందులోనూ నేను సినిమావాళ్లను పెళ్లి చేసుకోకూడదని అమ్మ భావించేది. ఎందుకంటే ఆదాయంలో స్థిరత్వం ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు పడతానేమోనని వద్దనుకున్నారు. (మధ్యలో ఆలీ అందుకుని.. ఇండస్ట్రీలో ఉంటారు. కానీ, ఇండస్ట్రీవాళ్లు వద్దా?) అయితే, నా అభిప్రాయం అలా ఉండేది కాదు. ఇప్పుడు నాకంటే మావారే అమ్మకు చాలా ఇష్టం.

అత్తగారికి అంత ఇష్టం ఎలా అయ్యారు?
శివబాలాజీ: నన్ను వాళ్లు ఒకవైపు మాత్రమే చూశారు. నాలో మిగతా మంచి లక్షణాలు చూడలేదు. ఎప్పుడైతే నాతో వారి బంధుత్వం మొదలైందో అప్పటి నుంచి నేనంటేనే ఎక్కువ ఇష్టపడతున్నారు.

 

శివబాలాజీ చదుకునే రోజుల్లో చాలా అవుట్‌స్టాండింగ్‌ స్టూడెంట్ తెలుసా?
మధుమిత: తెలుసు! ఎప్పుడూ క్లాస్‌ బయటే ఉండేవాళ్లంటా..(నవ్వులు)
బాలాజీ: నాకెప్పుడూ నాలుగు గోడల మధ్య చదవాలని ఉండేది కాదు. ప్రకృతితో పాటు మనం నేర్చుకోవాలనే తత్వం ఉండేది. అందుకే ఎప్పుడూ బయట ఉండేవాడిని.

స్కూల్లో నువ్వు పెద్ద రౌడీవంటగా?
శివబాలాజీ: అది రౌడీయిజం కాదు సార్‌. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ (నవ్వులు). స్కూలింగ్‌లో ఉన్నప్పుడు నేను ఆటల్లో బాగా చురుగ్గా ఉండేవాడిని. అపుడు నేను ఎల్లోటీమ్‌లో ఉండేవాడిని. దాంతో ఓ గ్యాంగ్‌ ఎప్పుడూ నాతో ఉండేది. పరుగుపందెంలో ఎప్పుడూ నేనే విన్నర్‌. అప్పట్లో నా ప్రత్యర్థిగా ఉండే స్టూడెంట్‌కు ఇప్పటికీ నేనంటే నచ్చదు. అతనిప్పుడు ఆర్మీ అధికారిగా కశ్మీర్లో ఉన్నాడు. (మధ్యలో ఆలీ అందుకుని..ఎప్పుడూ అక్కడకి వెళ్లకు)

కేబీఆర్‌ పార్కులో జాగింగ్‌ చేస్తుండగా సినిమా అవకాశం వచ్చిందటగా..ఎలా?
శివబాలాజీ: స్రవంతి రవికిషోర్‌ గారూ, రమణగారూ కేబీఆర్‌లో వాకింగ్‌కి వచ్చేవాళ్లు. అప్పుడే నేను జాగింగ్‌ చేస్తూ వాళ్లు కనిపించినప్పుడల్లా గుడ్‌మార్నింగ్‌, హలో చెబుతుండేవాడిని. వారి కంట్లో పడటానికే అలా నిత్యం కనిపిస్తుండేవాడిని. ఎట్టకేలకు వారు నాకు ‘ఎలా చెప్పను’ చిత్రంలో అవకాశం ఇచ్చారు.

బాలాజీలో నీకు నచ్చిన, నచ్చని అంశాలేంటి?
మధుమిత: నచ్చేది, నచ్చనిది అంటూ ఏమిలేవు సార్‌. అన్ని విషయాల్లోనూ కలిసే నిర్ణయాలు తీసుకుంటాం.
శివబాలాజీ: సార్‌ మా బంధం పాలు, నీళ్లు లాంటిది. ఒక్కసారి కలిశాక విడదీయటం కష్టం.

మీ కుటుంబంలో ఎవరైనా బాగా కోపంగా ఉండేవారా?
శివబాలాజీ: మా నాన్నగారూ చాలా స్ట్రిక్ట్‌. కోపం ఎక్కువగా ఉండేది. అదే నాకూ కొంచెం వచ్చిందనుకుంటున్నా.

సినిమాలో తొలి అవకాశం వచ్చినపుడు నాన్న ఏమన్నారు?
శివబాలాజీ: మా నాన్న వార్తలు చూసేటపుడు ఇంట్లో ఎవరూ మాట్లాడరు. ఆ సమయంలోనే నాకొచ్చిన అవకాశం గురించి ఆయనకు చెప్పాను. ఒక్క సినిమా చేసి వచ్చేస్తానని వివరించాను. అందుకు ఆయన ‘మళ్లీ ఎందుకు వెనక్కి రావడం’ అని ‘అల్‌ ది బెస్ట్‌’ చెప్పి పంపించారు.

శివబాలాజీ మంచి వ్యాపారవేత్త అని విన్నాను?
శివబాలాజీ: అవును సార్‌. ఫ్యామిలీ బిజినెస్‌లోనే నాన్నతో కలిసి పనిచేసేవాడిని. 21 ఏళ్లకే సొంతంగా నాకో ఫ్యాక్టరీ ఉండేది. మా నాన్నగారి ఎమ్‌ఎస్‌బీ కంపెనీకి కావాల్సిన ముడి పరికరాలు నా ఫ్యాక్టరీలో తయారయ్యేవి. ఐరన్‌ స్ప్రింగ్స్‌, ఎల్‌పీజీ వాల్వ్స్‌లాంటివి తయారు చేసేవాళ్లం. నాన్నగారు చనిపోయాక ఆ ఫ్యాక్టరీ మూసేసి సినీ పరిశ్రమలోనే ఉండిపోయాను. నాన్నగారికి చిత్ర పరిశ్రమలో చాలా పెద్దవారితో పరిచయాలు ఉండేవి. అప్పట్లో మా కంపెనీకి మంచి పేరుండేది. సుమారు 1500 మంది కార్మికులు పనిచేసేవారు. ఇప్పుడు ఆ స్థలాన్నంతా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చేశాం.

నటుడిగా మీ సక్సెస్‌ను నాన్నగారూ చూశారా?
శివబాలాజీ: సక్సెస్‌ చూశాను అని ఇప్పటికీ నేను చెప్పను. ఇంకా ప్రయాణంలోనే ఉన్నాను. అయితే, ‘ఆర్య’ చిత్రం బాగా హిట్టయ్యాక నేను ఆనందంలో ఉంటే నాన్నగారూ బాధపడ్డారు. ఎందుకంటే ఆయనకు నన్ను నెగటివ్‌ రోల్‌లో చూడటం ఇష్టం లేదు. ఆ తర్వాత నా సినిమాలు కొన్ని సీడీల్లో చూసి ఆనందించేవారు. ‘చందమామ’లో నేను వేసిన పాత్ర కూడా నాన్నగారికి నచ్చలేదు. కానీ ‘శంభో శివ శంభో’ సినిమా చూసి నన్ను మెచ్చుకున్నారు. అదే ఆయన చూసిన నా చివరి చిత్రం.

అమ్మ గురించి?
శివబాలాజీ: అమ్మ చెన్నైలో ఉంటారు. తమ్ముళ్లు కూడా అక్కడే ఉంటారు. అమ్మ ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది.
మధుమిత: అత్తగారూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఆమె నాకు మరో అమ్మ. ఏ విషయాన్నైనా ఆమెతో పంచుకుంటా. 

అన్నదమ్ముల గురించి?
శివబాలాజీ: నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లి. ఒక తమ్ముడు ఐటీలో చేస్తున్నాడు. మరొక తమ్ముడుది గార్డెనరీ వ్యాపారం. చెల్లి అమెరికాలో సెటిల్‌ అయ్యింది.

మధుమిత చిన్నతనంలో ‘రౌడీ బేబి’లా ఉండేవారట?
మధు: అంతేమి ఉండేది కాదు సార్‌! నా స్నేహితులు బిందు, శ్రీలత బాగా కలిసిఉండేవాళ్లం. బిందు తిరుపతిలో ఉంటుంది. శ్రీలత ప్రస్తుతం టచ్‌లో లేదు. అప్పట్లో వాళ్లు బెంగళూరు నుంచి వచ్చారు. (మధ్యలో ఆలీ అందుకుని..శ్రీలతే చిన్నతనంలో మీ వేషాల గురించి చెప్పారు)

మధుమిత కళ్లల్లో కళ్లు పెట్టి ఊరమాస్‌ సాంగ్‌ పాడారట?
శివ బాలాజీ: నాకు రొమాంటిక్‌ సాంగ్‌లు పాడటం రాదు సార్‌. ‘క్యాండిల్‌ నైట్‌ డిన్నర్‌’కు తనతో కలిసి వెళ్లాను. పాట పాడమని అడిగింది. దీంతో అప్పట్లో బాగా ఫేమస్‌ అయిన హీరో కార్తీక్‌ సాంగ్‌ ఒకటి పాడాను. (పాట పాడారు)

అర్య సినిమా తర్వాత శివబాలాజీకి బ్రేక్‌ ఎందుకు రాలేదు?
శివ బాలాజీ: ఏమో సార్‌! ఆర్య  హిట్‌ తర్వాత ఆరునెలల పాటు ఎదురుచూశాను. మంచి ప్రాజెక్టు చెయ్యాలని. ఆఫీసులకు వెళ్లి మాట్లాడమని మా వాళ్లు అంటుండేవారు. నాకేమో మొహమాటం. ఎవరినైనా అడిగితే ‘మీరు మాకు తెలుసు. మంచి నటులు. మీరిక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు. మీకు సరిపోయే పాత్ర ఉంటే మేమే చెబుతాం’ అనేవాళ్లు అలా కాలం గడిచిపోతూ ఉండేది.

శివబాలాజీ నిర్మాతగా ఎందుకు మారాల్సివచ్చింది?
శివ బాలాజీ: ‘స్నేహమేరా జీవితం’అనే సినిమా చేశాం. మంచి కథ అది. వేరే వాళ్లు మనకు అవకాశాలు ఇచ్చేకంటే మనమే చేద్దాం అని, ఆ సినిమా నిర్మించాం. కానీ, మీకు తెలిసిందే కదా (ఆలీని ఉద్దేశిస్తూ) ఒక సినిమా రిలీజ్‌ అవ్వాలంటే ఎన్ని అవాంతరాలు ఉంటాయో.. అప్పటికీ కొందరికి రిక్వెస్ట్‌ చేశాను. కానీ, ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. తర్వాత ‘బిగ్‌బాస్‌’లో విన్నర్‌గా నిలిచాను. ఆ వచ్చిన డబ్బుతో ఎలాగోలా ఆ సినిమాను విడుదల చేయించాను. ఈ విషయంలో నటుడు రాజీవ్‌ కనకాల నాకు బాగా సాయం చేశారు. మేమిద్దరం ఆప్తమిత్రులం.
 

పెళ్లికి ముందు మీరిద్దరూ బ్రేకప్‌ అయ్యారంటా?
మధుమిత: అవును సార్‌. అది బ్రేకప్‌ అనలేం. ఎందుకంటే మా ఇద్దరి జాతకాలు కలవలేదని వాళ్లింట్లో చెప్పారు. ఇద్దరం పెళ్లి చేసుకుంటే అత్తమ్మకు ఆయుక్షీణం అని జాతకాల్లో ఉందట. నేనైతే వాటిని నమ్మను. కానీ, ఆయన ఇంట్లో బాగా నమ్ముతారు. ఒకరోజంతా ఫోన్‌లో దీనిగురించి మాట్లాడుకున్నాం. అంతకముందే మేమిద్దరం ఒకటనుకున్నాం. ఇరువురి ఇంట్లో ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకోవాలని. అలా మా బ్రేకప్‌ జరిగింది.
శివబాలాజీ: నిజంగా అదొక దురదృష్టకర సంఘటన సార్‌. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాపై తనకు ఇష్టం కలిగేలా నేనే ప్రవర్తించి, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి, చివరకు జాతకాలు కలవట్లేదని చెప్పాను. కానీ, ఏం చెయ్యను? పరిస్థితుల ప్రభావం. అలా బ్రేకప్‌ అయ్యాక ఒక సంవత్సరం గడువు విధించుకున్నాను. ఒకవేళ ఈ లోపు తనకు గానీ, నాకుగానీ వేరే పెళ్లైతే వదిలేద్దాం. లేదంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. సంకల్ప బలం అంటారు కదా! అదే పనిచేసిందేమో. సంవత్సరం తర్వాత జాతకాలు చూపిస్తే మళ్లీ కలిశాయి. వెంటనే తన మెడలో మూడు ముళ్లూ వేసేశా!(నవ్వులు)
పిల్లలు ఎంతమంది?
బాలాజీ: ఇద్దరు అబ్బాయిలు సార్. ధన్విన్‌, గగన్‌ ఇద్దరి పేర్లు. ఒకరు 6వ తరగతి, ఒకరు 1వ తరగతి చదువుతున్నారు.

మీ బర్త్‌డేకి పెళ్లైన కొత్తలో ఏదో షాకిచ్చారట?
మధుమిత: అవున్‌ సార్‌. నా పుట్టినరోజు ఎప్పుడు ఆయన మర్చిపోతుంటారు.
బాలాజీ: పెళ్లైన కొత్తలో తన పుట్టినరోజుకు ఏమి తెలియనట్టు ఒక గంట ముందు నుంచి పడుకున్నట్టు నటించాను సార్‌. ఇంతలో ఆమెకు ఫోన్‌కాల్స్‌ రావడం మొదలైంది. లేచాక ‘హా.. పుట్టినరోజైతే ఇప్పుడేంటి! అనేవాడిని. బాగా హర్ట్‌ అయ్యింది. బయటకు వెళ్దామంటే కూడా వద్దన్నాను. ఇక సాయంత్రం నేనే.. పద ఏదైనా హోటల్‌కు వెళ్దాం అంటూ బలవంతపెట్టి తీసుకెళ్లాను. ఒక పెద్ద టేబుల్‌ ముందు కూర్చున్నాం. ఇంతలో మా కుటుంబసభ్యులు, స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. దీంతో మధు ఒక్కసారిగా షాక్‌ అయ్యింది.
చిత్రపరిశ్రమలోకి వచ్చి ఎన్నేళ్లు అవుతుంది?
శివబాలాజీ: 2002లో వచ్చాను సార్‌.

‘పుట్టింటికి రా..చెల్లి’చూసి ఒకరు నీ దగ్గర ఏడ్చారంటగా?

మధుమిత: అవును సార్‌! ‘పుట్టింటికి రా చెల్లి’ సినిమా తర్వాత మరో షూటింగ్‌ నిమిత్తం రాజమండ్రి వెళ్లాము. అక్కడ ఒక ముసలావిడ వచ్చి‘ నీకెన్ని కష్టాలు వచ్చాయమ్మా. నిన్ను నేను చూసుకుంటాను. మా ఇంటికొచ్చేయ్‌. మీ అత్తమ్మ అడ్రస్‌ చెప్పు మేం గట్టిగా మాట్లాడతాం’అంటూ నన్ను గట్టిగా హత్తుకుంది. నిజంగా అదో మధురానుభూతి. ఒక నటికి అదే కదా కావాల్సింది. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు కోడిరామకృష్ణగారికే దక్కుతుంది. ఆయన నటించి చూపించిన దానిలో 10 శాతం చేస్తేనే నన్ను ఆ సినిమాలో ప్రేక్షకులు అంతలా గుర్తించారు. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా అది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని