Allari Naresh: వాటిల్లో నటించినప్పుడు నన్ను నేను తిట్టుకున్నా: అల్లరి నరేశ్‌

‘నాంది’ తర్వాత హీరో అల్లరి నరేశ్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఉగ్రం’. ఈ సినిమా ఈ నెల 5న విడుదలకానున్న సందర్భంగా నరేశ్‌ విలేకర్లతో మాట్లాడారు.

Updated : 04 May 2023 00:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు (దివంగత) ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా నరేశ్‌ (Allari Naresh) టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తొలి ప్రయత్నంలోనే ‘అల్లరి’తో హిట్‌ కొట్టి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. కొంతకాలంగా అల్లరిని తగ్గించి సీరియస్‌ కథలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో తెరకెక్కిందే ‘ఉగ్రం’ (Ugram). విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నరేశ్‌.. మీడియాతో ముచ్చటించారు. మరి, ఆయన ఏ విషయంలో తనని తాను తిట్టుకున్నారో ఈ ఇంటర్వ్యూ చదివి తెలుసుకోండి..

* నాంది, ఉగ్రంలాంటి టైటిళ్లు మీ సినిమాలకు ఊహించుకోవడం కష్టమే..!

నరేశ్‌: ఇరవై ఏళ్లుగా బాగా అల్లరి చేసి, ఇప్పుడు రూటు మార్చడంతో అలా అనిపిస్తుంది. ఎప్పుడూ ఒకే రకమైన సినిమాలు చేస్తే బోరింగ్‌. మహేశ్‌బాబు ‘మహర్షి’లోని నేను నటించిన పాత్ర నాకు సీరియస్‌ క్యారెక్టర్లు చేయగలననే నమ్మకం ఇచ్చింది. ఆ స్ఫూర్తితో ముందుకెళ్తున్నా.

* నాంది, మారుడేమిల్లి, ఉగ్రం.. ఇలా వరుసగా అలాంటి కథలే ఎంపిక చేసుకుంటున్నారేంటి?

నరేశ్‌: ‘నాంది’కి ముందు నేను ఎలాంటి సినిమాల్లో నటించానో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని రచయితలు అలాంటి నేపథ్య కథలే నా కోసం రాసేవారు. ‘మహర్షి’ తర్వాత ఇలాంటి కథలు రాస్తున్నారు.

* ఉగ్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

నరేశ్‌: ఇందులో మూడు పార్శ్వాలున్న పాత్రలో కనిపిస్తా. పోలీసు పాత్ర కోసం ఎంతో శ్రమించా.

* మీ తండ్రి వారసత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు?

నరేశ్‌: నాన్న పేరు కాపాడితే చాలు. పరిశ్రమలో వివాదాల జోలికి వెళ్లొద్దు, ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దని ఆయన చెప్పారు. పని తప్ప నాకు మరో ఆలోచన లేదు.

* కామెడీ, యాక్షన్.. ఇందులో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? 

నరేశ్‌: కామెడీ సినిమాలు సరదాగా చేసేయొచ్చు. కానీ, ఉగ్రంలాంటి యాక్షన్‌ చిత్రాలకు చాలా కష్టపడాలి.

* మీ సినిమాల్లో దేనికి సీక్వెల్‌ తీస్తే బాగుంటుందనుకుంటున్నారు?

నరేశ్‌: ‘సుడిగాడు’ విషయంలో ఆ ఆసక్తి ఉంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆ చిత్రానికి పనిచేశారు. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు ‘సుడిగాడు పార్ట్‌ 2 చేద్దామా?’ అని అడిగారు. నాన్న చివరి రోజుల్లో.. ‘ఆలీబాబా అరడజను దొంగలు’ చిత్రానికి సీక్వెల్‌ చేయాలనుకున్నాం.

* స్పూఫ్‌ కథల వైపు మళ్లీ దృష్టి పెడతారా?

నరేశ్‌: ఆ ఉద్దేశం లేదు. ఒకరిని అనుకరించడం నటన కాదు. స్పూఫ్‌లు చేసినప్పుడు నన్ను నేను తిట్టుకున్నా. అది ఒకరిని ఇమిటేట్ చేయడం కాబట్టి నాదైన నటనను ప్రదర్శించే అవకాశం లేదని బాధపడ్డా.

* ‘ఉగ్రం 2’ ఉంటుందా?

నరేశ్‌: లేదండీ. కానీ, మా కాంబినేషన్‌లో మరో చిత్రం తప్పక ఉంటుంది. వచ్చే ఏడాది అది ప్రారంభం కావొచ్చు. ‘ఉగ్రం’ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా చేస్తున్నా. నేను కామెడీని వదలడం లేదు. ‘ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ అంటూ సినిమా డైలాగ్‌ వినిపించారు.

* తదుపరి ప్రాజెక్టులు?

నరేశ్‌: సుబ్బు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నా. అందులో ఫరియా అబ్దుల్లా కథానాయిక. ‘జెండా’ అనే కథ హక్కులు తీసుకున్నా. నిర్మాతగా ఆ సినిమాని రూపొందిస్తా. దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనుంది. ఒకవేళ నేను ఏదైనా సినిమాకి డైరెక్టర్‌గా పనిచేస్తే అందులో నటించను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు