Allu Aravind: అలా చేయడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు: అల్లు అరవింద్‌

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌ 2’. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేశ్‌, దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు.

Updated : 05 Dec 2022 14:22 IST

హైదరాబాద్‌: ఆధునికీకరణ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ (Unstoppable) కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన థియేటర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇదే షోలో ఆయనతోపాటు మరో నిర్మాత దగ్గుబాటి సురేశ్‌, దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు.

‘‘థియేటర్లు పడిపోతున్న సమయంలో ఆయా థియేటర్ల యజమానులు వాటిని పైకి తీసుకురాలేకపోయారు. వాటిని మామూలు స్థితికి తీసుకురావడం, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులిచ్చి సినిమాలు కొనుక్కోవడం వారికి పెద్ద సమస్యగా మారింది. దాన్ని భరించలేక ‘థియేటర్లను మీరే రన్‌ చేయండి.. మాకు సంవత్సరానికి ఇంత ఇవ్వండి’ అని థియేటర్ల ఓనర్లు నిర్మాతలను కోరారు. అలా మేం వాటిని తీసుకొని కొన్ని కోట్ల రూపాయలతో మంచిగా తీర్చిదిద్దాం. అన్ని వసతులు కల్పించాం. అలా థియేటర్లను ఆధునికీకరించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. మీలాంటి (బాలకృష్ణను ఉద్దేశిస్తూ) పెద్ద హీరోలకు అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం’’ అని అల్లు అరవింద్‌ తెలిపారు. దీనిపై సురేశ్‌ స్పందిస్తూ.. దీని వల్ల కొందరికి థియేటర్లు దొరక్కపోవడంతో పలు సందర్భాల్లో విమర్శించారన్నారు. అందరూ (నిర్మాతలు) కలిసి సినిమాను బతికించారని అరవింద్‌ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ చిత్రం నిర్మించాలనుందనే తన కోరికను బయటపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని