Allu Aravind: మా వల్ల పైకొచ్చిన వాళ్లు వెళ్లిపోయారు.. ఆ ఒక్క దర్శకుడే మాటకు కట్టుబడ్డాడు!

2018 (2018 Movie) సినిమా ప్రెస్‌మీట్‌ తాజాగా హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో అల్లు అరవింద్‌ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 01 Jun 2023 18:14 IST

హైదరాబాద్‌: తన వల్ల కెరీర్‌లో ఎంతోమంది పైకి వచ్చారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. కెరీర్‌లో వృద్ధి చెందిన తర్వాత కొంతమంది ఆ సంగతి మర్చిపోయి గీత దాటి వెళ్లి వేరే సినిమాలు చేశారని ఆయన చెప్పారు. అయితే, వాళ్ల పేర్లు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదన్నారు. ‘2018’ చిత్ర ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన ‘కార్తికేయ 2’ దర్శకుడు చందూ మొండేటిని ప్రశంసిస్తూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఈ మధ్యకాలంలో ఓ పని మీద నేను అమెరికా వెళ్లా. ఆ సమయంలో బన్నీవాసు ఫోన్‌ చేసి ‘2018’ సినిమా చూశానని, తనకు బాగా నచ్చిందని చెప్పాడు. మన బ్యానర్‌పై రిలీజ్‌ చేద్దామని అన్నాడు. నేను ఓకే అన్నాను. తాజాగా నేను ఆ చిత్రాన్ని చూశా. నాకూ నచ్చింది. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యా. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్‌లోనే వీక్షించి.. ఆ అనుభూతిని పొందాలి. ఇక, చందూ మొండేటి గురించి చెప్పాలి. ‘కార్తికేయ 2’ విడుదల కాకముందే ఆయనలో ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడని భావించాను. మా బ్యానర్‌లో రెండు సినిమాలు చేసేందుకు ఆయన అంగీకరించారు. ‘కార్తికేయ 2’ విడుదలయ్యాక ఆయనకు బయట నుంచి భారీ ఆఫర్స్‌ వచ్చాయి. నా వల్ల పైకి వచ్చిన కొంతమంది ఆ తర్వాత గీత దాటి వెళ్లి సినిమాలు చేశారు. వాళ్ల పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కానీ, చందూ మాత్రం ఇచ్చిన మాటకే నిలబడ్డారు. నా సినిమా పూర్తయ్యాకే వేరే ప్రాజెక్ట్‌లు టేకప్‌ చేస్తానని ఫిక్స్‌ అయ్యారు’’ అని అరవింద్‌ వివరించారు.

ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే వేరేవాళ్లు నిర్మించిన చిత్రాలను తీసుకువచ్చి డిస్ట్రిబ్యూట్‌ చేయడం ఉత్తమమనే భావన పెద్ద డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలకు వస్తుందనుకోవచ్చా?

అరవింద్‌: మీరు చెప్పేది కచ్చితంగా నిజమేనని అంగీకరించడం కష్టం. సినిమా పరంగా ఇప్పుడున్న రోజుల్లో హద్దులు చెరిగిపోయాయి. ఒక మంచి సినిమా ఉంటే అది ఎక్కడిదైనా సరే మనం చూస్తున్నాం. ప్రతిదాన్ని మన ప్రేక్షకులు ఆహ్వానించే విధానాన్ని మనం మెచ్చుకోవాలి. ఇప్పుడున్న రోజులకు అనుగుణంగా వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకుని వేరే వాళ్లు నిర్మించిన చిత్రాలను ఇలా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాం.

ఈ సినిమా విజయం సాధించడానికి ప్రధాన కారణం?

అరవింద్‌: భావోద్వేగాలు.

భవిష్యత్తులో ఇలాంటి కథలు మీ వద్దకు వస్తే అల్లు అర్జున్‌తో సినిమా చేస్తారా?

అరవింద్‌: 200 శాతం.

ఇతర భాషల్లో వచ్చిన చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్నారు కదా! మీరు ఇతర ఇండస్ట్రీల్లో వచ్చే సినిమాలపై ఎప్పుడూ దృష్టి పెడుతుంటారా?

బన్నీ వాసు: అరవింద్‌ గారు నాకు ఇచ్చిన జాబ్‌ అదే కదా. ప్రపంచంలో ఏ పరిశ్రమలో ఏ సినిమా విడుదలైంది అనేది నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అలా, కాకపోతే నాకు పోటీ పెరిగిపోతుంది. ఆయన మాకు ఎప్పుడూ ధైర్యం ఇస్తుంటారు. అందుకే మేము ముందుకు అడుగు వేయగలుగుతున్నాం.

బోయపాటి సినిమా గురించి..?

అరవింద్‌: బోయపాటి తదుపరి ప్రాజెక్ట్‌ మా బ్యానర్‌లోనే ఉంటుంది. ఇద్దరు హీరోలు దృష్టిలో ఉన్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. సురేందర్‌ రెడ్డి కూడా గీతా ఆర్ట్స్‌లో ఒక సినిమా చేస్తారు. దాని స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. అన్నీ ఫిక్స్‌ అయ్యాక అనౌన్స్‌ చేస్తాం. ఇవి కాకుండా, చందూ మొండేటితో రెండు ప్రాజెక్ట్‌లు లాక్‌ అయ్యాయి. అందులో ఒకటి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని