Ghani: వరుణ్‌ సినిమాల్లోకి వచ్చాక అతడిపై గౌరవం పెరిగింది: అల్లు అర్జున్‌

వరుణ్‌తేజ్‌(Varun tej) అంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని, సినిమాల్లోకి వచ్చిన అతడు కథలు ఎంపిక చేసుకునే విధానం

Updated : 04 Apr 2022 16:02 IST

విశాఖపట్నం: వరుణ్‌తేజ్‌(Varun tej) అంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని, సినిమాల్లోకి వచ్చిన అతడు కథలు ఎంపిక చేసుకునే విధానం చూసి ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగిందన్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’.  సయీ మంజ్రేకర్‌ కథానాయిక. సిద్ధూ, అల్లు బాబిలు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం విశాఖలో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో అన్నయ్య అల్లు బాబి నిర్మాత కావటం సంతోషంగా ఉంది. సిద్ధూ కూడా సినిమా రంగంలోకి రావటానికి చాలా కష్టపడ్డాడు. ఏదో సినిమాలు చేయాలన్న ఉద్దేశంతో వరుణ్‌తేజ్‌ కథలను ఎంచుకోడు. అతడు సినీ కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఇంత ఖర్చు పెట్టి కొత్త దర్శకుడితో సినిమా చేయటం నిజంగా సాహసం. కానీ, వరుణ్‌ చేశాడు. ‘గని’ నేను చూశా. చాలా బాగుంది. సంగీత దర్శకుడు తమన్‌ పట్టుకున్నదల్లా బంగారం అవుతోంది. ఈ సినిమాతో మరో హిట్‌ అతడి ఖాతాలో పడుతుంది. ఎవరికైనా అభిమానులు ఉంటారు. కానీ నాకు ఆర్మీ ఉంది. నా అభిమానులు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఎవరైనా హీరోను చూసి స్ఫూర్తి పొందుతారు. కానీ, నేను నా అభిమానుల నుంచి స్ఫూర్తి పొందుతున్నా. ‘గని’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అల్లు అర్జున్‌ అన్నారు.

‘గని’కి స్ఫూర్తి కల్యాణ్‌ బాబాయ్‌ ‘తమ్ముడు’ మూవీనే: వరుణ్‌తేజ్‌

కథానాయకుడు వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ.. ‘‘అందరూ ఉగాది పండగ కుటుంబం మధ్య జరుపుకొంటారు. కానీ, నేను మెగా అభిమానుల మధ్య చేసుకుంటున్నా. ‘గని’ మూడేళ్ల జర్నీ. కరోనా వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. కిరణ్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకుని మంచి పనిచేశా. ఆయనకు మంచి భవిష్యత్‌ ఉంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు. సయీ మంజ్రేకర్‌ చక్కగా నటించింది. నాతో పాటు నటుడు నవీన్‌ ఎంతో కష్టపడ్డాడు. చిన్నప్పుడు కల్యాణ్‌ బాబాయ్‌ ‘తమ్ముడు’ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సార్లు చూశాను కూడా. హీరో అయిన తర్వాత స్పోర్ట్స్‌ సినిమాలు ఎవరూ ఎందుకు చేయటం లేదా? అనిపించింది. కల్యాణ్‌ బాబాయ్‌ స్ఫూర్తితోనే ఈ సినిమా చేశాం. చిరంజీవిగారు లేకపోతే మేమంతా లేము.  షూటింగ్‌ సమయంలో చాలా దెబ్బలు తగిలాయి. ప్రేక్షకుడు కొనే టికెట్‌కు న్యాయం చేయాలనే ఈ స్థాయిలో సినిమా చేస్తున్నాం’’ అని వరుణ్‌తేజ్‌ అన్నారు.

‘మెగా ప్రిన్స్‌’ అన్న బిరుదుకు వరుణ్‌తేజ్‌ సరైనవాడని అతడి తండ్రిలా వరుణ్‌ కూడా మంచి వాడని నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. ‘కేజీయఫ్‌’ చూసిన తర్వాత వరుణ్‌తో ఇలాంటి సినిమా ఎప్పటికైనా చేయాలనిపించిందన్నారు. తప్పకుండా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కొత్త దర్శకుడితో సినిమా చేయడం సాహసమని కానీ, కిరణ్‌పై నమ్మకంతో నిర్మాతలు కావాల్సినంత ఇచ్చారని చెప్పుకొచ్చారు. నిర్మాతలకు, దర్శకుడు సాయికి మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. మెగా అభిమానులకు కావాల్సిన అన్ని హంగులు సినిమాలో ఉన్నాయని అరవింద్‌ తెలిపారు. ‘గని’ యాక్షన్‌ చిత్రం మాత్రమే కాదని, ఎమోషనల్‌ మూవీ అని వివరించారు.  కార్యక్రమంలో కథానాయిక సయీ మంజ్రేకర్‌, నటుడు నరేశ్‌, నవీన్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు