Published : 07 May 2022 14:45 IST

Koffee with Karan: ప్రభాస్‌-అల్లు అర్జున్‌, చరణ్‌- తారక్‌.. ఆ షోకి అతిథులుగా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌- అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌.. ఇలా అగ్ర హీరోలు ఇద్దరిద్దరు కలిసి ఓ షోకి విచ్చేస్తే ఎలా ఉంటుంది? ఆ మస్తీని ప్రేక్షకులకు అందించడానికే బాలీవుడ్‌ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈయన వ్యాఖ్యాతగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ అనే సెలబ్రిటీ టాక్‌ షో విజయవంతంగా 6 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 7వ సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ‘‘నా, మీ జీవితాల్లో భాగమైన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో 7వ సీజన్‌ ఇకపై ఉండదు’’ అంటూ అభిమానులను నిరాశకు గురిచేసిన కరణ్‌ కొన్ని గంటల్లోనే మరో ట్విస్ట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఈ షో టెలివిజన్‌లో ప్రసారం కాదుగానీ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది’’ అని సర్‌ప్రైజ్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకాలం ఎక్కువగా బాలీవుడ్‌ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఓటీటీ వేదికగా దక్షిణాది ప్రేక్షకులనూ ఆకట్టుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ‘కరణ్‌తో ముచ్చట్లు చెప్పబోయే దక్షిణాది తారలు వీరే’ అంటూ ప్రభాస్‌, చరణ్‌, తారక్‌, బన్నీతోపాటు మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ వివరాలివీ..

ప్రభాస్‌- అల్లు అర్జున్‌

చాలాకాలంగా ప్రభాస్‌- అల్లు అర్జున్‌ మధ్య మంచి స్నేహం ఉంది. ‘బాహుబలి’తో ప్రభాస్‌, ‘పుష్ప’తో అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌లుగా మారారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరితో ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.


రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌

చరణ్‌, తారక్‌ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రారంభానికి ముందే ఈ ఇద్దరు మంచి మిత్రులు. అలాంటి వీరిని ఈ పాన్‌ ఇండియా చిత్రం మరింత దగ్గర చేసింది. ఇరువురు ఎంత సరదాగా ఉంటారో చిత్ర ప్రచారంలోనే చాలామంది చూశారు. మరోసారి ఆ ఫన్‌ పంచేందుకు వీరు ఈ షోకి రాబోతున్నారని సమాచారం.


సమంత- రష్మిక

సమంత.. ‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ సిరీస్‌, రష్మిక.. ‘పుష్ప’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. అలాంటి ఈ కథానాయికలను ఒకే వేదికపైకి తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఉన్నారట కరణ్‌.


నయనతార- విఘ్నేష్‌

కోలీవుడ్‌ ప్రేమజంట నయనతార- విఘ్నేష్‌ శివన్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారట. నయనతార, సమంత, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో విఘ్నేష్‌ తెరకెక్కించిన ‘కాతువాకుల రెండు కాదల్‌’ ఇటీవల విడుదలై, థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు, నయనతార త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే నయనతార- విఘ్నేశ్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని