Allu Arjun: సినిమా విషయంలో చిన్నా పెద్దా అనే తేడా లేదు.. భయం వద్దు: అల్లు అర్జున్‌

ప్రస్తుత సినిమాల విషయంలో చిన్నాపెద్దా అనే తేడా లేదని, మంచి సినిమా అనేది ఒక్కటే ఇప్పుడు ట్రెండ్‌ అని ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ అన్నారు. చిన్న సినిమాల వారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Updated : 18 Sep 2022 23:19 IST

హైదరాబాద్‌: ప్రస్తుత సినిమాల విషయంలో చిన్నాపెద్దా అనే తేడా లేదని, మంచి సినిమా అనేది ఒక్కటే ఇప్పుడు ట్రెండ్‌ అని ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ అన్నారు. చిన్న సినిమాల వారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘అల్లూరి’ (Alluri) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ప్రదీప్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు అల్లు అర్జున్‌ (Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘నా మనసుకు నచ్చిన చాలా తక్కువ మందిలో శ్రీవిష్ణు ఒకరు. ఆయన సినిమాలన్నింటినీ నేను చూస్తుంటా. ‘ప్రేమ ఇష్క్‌  కాదల్‌’ అనే సినిమాలో ఆయన ముగ్గురు హీరోల్లో ఒకరిగా కనిపించినా తనదైన మార్క్‌ చూపించారు. ఆయనపై అభిమానం అలా మొదలైంది. కథల ఎంపికలో శ్రీవిష్ణుకు మంచి అభిరుచి ఉంది. అంకిత భావంతో పనిచేసే నటుడాయన. అందుకే సినిమా హిట్‌ అయినా కాకపోయినా ఆయనపై గౌరవం అలానే ఉంటుంది. మంచి సినిమాలు చేయాలనే తపనపడే విష్ణుని ప్రేక్షకులు దీవించాలని, ఆయన మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ‘పుష్ప 2’ సినిమా పనుల బిజీ వల్ల ఈవెంట్లకు హాజరుకాకూడదనుకున్నా. ఆ క్రమంలో ఓ రోజు విష్ణు నన్ను కలిసి.. ‘నా సినిమాలను నేను పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదని అందరూ అంటున్నారు. ఈ చిత్రానికి చేయాలనుంది. మీరొస్తే బాగుంటుంది’ అని అడిగారు. ఎంతో కష్టపడే నటుడికి ఈ మాత్రమైనా చేయలేమా? అనుకుని వచ్చా’’

‘‘ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. కథానాయిక కయదును టాలీవుడ్‌లోకి ఆహ్వానిస్తున్నా. పెద్ద సినిమాలే హిట్‌ అవుతున్నాయి, చిన్న చిత్రాలు అవట్లేదు అని చాలామంది అంటున్నారు. అలాంటిదేం లేదు. చిన్నాపెద్దా అని కాదు ఇప్పుడున్నది ఒకటే ట్రెండ్‌.. అదే మంచి సినిమా. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. ‘‘ఎవరికైనా అభిమానులుంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది. నన్ను ప్రాణంగా ప్రేమించే నా ఆర్మీ.. ఐ లవ్‌ యూ’’ అని అల్లు అర్జున్‌ అనడంతో అభిమానుల కేరింతలతో ప్రాంగణం హోరెత్తింది.

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని చేసిన ఫిక్షనల్‌ సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది. పోలీసు వ్యవస్థ మనకెంతో సేవ చేసింది. ఆ వ్యవస్థ కోసం ఏదైనా చేయాలనిపించిన ప్రయత్నంలో భాగంగా వచ్చిందే ఈ సినిమా. మీరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా. నేను చిత్ర పరిశ్రమలోకి ఖాళీ చేతులతో వచ్చా. ఈ సినిమా నిర్మాత బెల్లం వేణు గోపాల్‌ గారే అప్పట్లో ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ సినిమాలో చిన్న పాత్ర ఇచ్చారు. అది అల్లు అర్జున్‌గారికి నచ్చటంతో నన్ను ఆహ్వానించి, కాసేపు మాట్లాడారు. అప్పుడు ఆయన చెప్పిన మాటనే ఇప్పటికీ పాటిస్తున్నా. ‘శ్రీవిష్ణుగారూ మీరు చాలా బాగా నటించారు. మీకు చాలా అవకాశాలొస్తున్నాయని అనుకుంటున్నా. తొందరపడి ఏది వస్తే అది చెయ్యకండి. ఇండస్ట్రీ మరో నాలుగేళ్లలో మారబోతుంది. కంటెంట్‌ ఉన్న సినిమాకే ఆదరణ దక్కుతుంది. అలాంటి వాటినే ఎంపిక చేస్కోండి. లేదంటే ఖాళీగా ఉండండి’ అని అన్నారు. నన్ను నేను నిరూపించుకుని ఆయన్ను కలవాలనుకున్నా. ఆయన హీరోగా నటించిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో చిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది. పట్టరాని ఆనందంలోనే చిత్రీకరణలో పాల్గొన్నా’’ అని శ్రీవిష్ణు భావోద్వేగంగా మాట్లాడారు.

‘‘ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు కదా. ఈ సినిమాలో హీరో విజయం వెనక నేనుంటా.  ఈ చిత్రంలో నేను సంధ్య అనే పాత్ర పోషించా. ఈ సినిమాని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని కథానాయిక కయదు లోహర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు ప్రశాంత్‌ వర్మ, తేజ మర్ని, హర్ష కొనుగంటి తదితరులు పాల్గొన్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని