
Allu Arjun: విడుదలకు నోచుకోని హిందీ ‘అల.. వైకుంఠపురంలో..’!
ముంబయి: సుకుమార్-అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. బాలీవుడ్లో ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. బన్నీ నటనకు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో బన్నీ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని ‘గోల్డ్‌మైన్’ అనే చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. బన్నీ గతంలో నటించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి జనవరి 26న థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే, తాజాగా ఆ చిత్రాన్ని విడుదల చేయట్లేదని ‘గోల్డ్‌మైన్’ అధినేత మనీశ్ షా ప్రకటించారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల..’ చిత్రం బ్లాక్ బాస్టర్హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జోడీతో హిందీలో ‘షేజాదా’గా రీమేక్ చేస్తున్నారు. దీనికి అల్లు అరవింద్, భూషణ్ కుమార్, అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 4న విడుదల చేయనున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఒకవైపు ఈ రీమేక్ చిత్రీకరణ దశలో ఉండగానే.. తెలుగు ‘అల వైకుంఠపురంలో’ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేయడం ‘షేజాదా’ నిర్మాతలను కలవరపెట్టింది. హిందీ వెర్షన్ విడుదలైతే ‘షేజాదా’ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవచ్చని భావించారు. దీంతో తన నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆ నిర్మాతలు మనీశ్ షాకు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన.. విడుదలపై వెనక్కి తగ్గారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో మనీశ్ షాకు ‘షేజాదా’ చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది.