Kudi Yedamaithe review: రివ్యూ: కుడి ఎడమైతే

Kudi Yedamaithe review: వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 19 Jul 2021 19:16 IST

వెబ్‌సిరీస్‌: కుడి ఎడమైతే; నటీనటులు: అమలాపాల్‌, రాహుల్‌ విజయ్‌, రవి ప్రకాశ్‌, సూర్య శ్రీనివాస్‌, నిత్య శ్రీ, రుద్ర ప్రదీప్‌, తదితరులు; సంగీతం: పూర్ణ చంద్ర తేజస్వీ ఎస్‌.వి.; ఎడిటింగ్‌: సురేశ్‌ ఆర్ముగం; సినిమాటోగ్రఫీ: అద్వైత్‌ గురుమూర్తి; నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల,  పవన్‌కుమార్‌; రచన: రామ్‌ విఘ్నేష్‌; దర్శకత్వం: పవన్‌ కుమార్‌; విడుదల: ఆహా

కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి కథలు కొత్తేమీ కాదు. అయితే, కాలం అనే కాన్సెప్ట్‌ను ఎవరు? ఎలా ఉపయోగించుకుని ఆసక్తికరంగా మలిచారన్నదానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్‌సిరీస్‌ ‘కుడి ఎడమైతే’. ‘యూటర్న్‌’లాంటి విభిన్న కథను ప్రేక్షకులకు అందించిన పవన్‌కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల ఆహాలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. మరి ఈ వెబ్‌ సిరీస్‌ కథేంటి? అమలాపాల్‌, రాహుల్‌ విజయ్‌లు ఎలా నటించారు? పవన్‌కుమార్‌ ఎంచుకున్న కాన్సెప్ట్‌ ఏంటి?

కథేంటంటే: ఆది‌(రాహుల్‌ విజయ్‌) ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. మంచి నటుడు అవ్వాలని సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతుంటాడు. అది ఫిబ్రవరి 29, 2020. ఎప్పటిలాగే ఫుడ్‌ డెలివరీ ఇవ్వడానికి ఒక అపార్ట్‌మెంట్‌కు వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించి భయంతో బైక్‌పై బయలుదేరతాడు. ఒక మలుపు వద్ద సడెన్‌గా పోలీస్‌ జీపు ఆదిని ఢీకొంటుంది. దీంతో అతడు అక్కడికక్కడే చనిపోతాడు. ఆ జీపులో ఉన్న పోలీస్‌ ఆఫీసర్‌ దుర్గ(అమలాపాల్‌) తలకు కూడా గాయమై కొద్దిసేపటికి ఆమె కూడా చనిపోతుంది. అయితే, మళ్లీ మరుసటి రోజు ఉదయం ఎవరి ఇళ్లలో వాళ్లు నిద్రలేస్తారు. జరిగిన ప్రమాదం గుర్తుంటుంది కానీ, అది జరగడానికి కారణం ఏంటి? వాళ్ల జీవితంలో ఫిబ్రవరి 29 ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వాటిని ఆది, దుర్గ ఎలా అధిగమించారన్నది చిత్ర కథ.

ఎలా ఉందంటే: ‘జీవితం సెకండ్‌ ఛాన్స్‌ ఇవ్వదు’ ఈ మాట చాలా సందర్భాల్లో వింటాం. అది వాస్తవం కూడా. ఎందుకంటే డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ, కాలం పోతే తిరిగిరాదు. జీవితంలో సెకండ్‌ ఛాన్స్‌ అనేది చాలా అరుదు. ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఉత్కంఠభరిత వెబ్‌ సిరీస్‌ ‘కుడి ఎడమైతే’. ఈ వెబ్‌సిరీస్‌ మొత్తం టైమ్‌ లూప్‌ ఊహాజనిత శాస్త్రీయ సంభవం అనే కాన్సెప్ట్‌ చుట్టూ తిరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక రోజులో జరిగిన సంఘటనలు మళ్లీ మళ్లీ జరగడం, వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే, అనుకోని విపత్కర పరిస్థితులు ఏర్పడటం, ఎలాగైతే అలా అయిందని వదిలేస్తే ఊహించని విధంగా జరగడం. ఇదే తరహా టైమ్‌లూప్‌లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు కలిసి వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నించడం. కాస్త కన్ఫ్యూజన్‌గా ఉన్నా జరిగిదే ఇదే.

ఆది, దుర్గలకు ఫిబ్రవరి 29వ తేదీన జరిగిన సంఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతుంటాయి. వాటిని వాళ్లు మార్చడానికి ప్రయత్నించడం, అప్పుడు విచిత్ర పరిస్థితులు ఎదురవడం ఇలా సిరీస్‌  మొదటి నుంచి చివరి వరకూ జరిగిందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే, వాళ్లు ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారన్నది ఆసక్తిగా మలచడంలో దర్శకుడు విజయం సాధించాడు. రచయిత అనుకున్న కాన్సెప్ట్‌ను ఎలాంటి తికమకా లేకుండా చక్కగా తెరకెక్కించాడు. మొదటి మూడు ఎపిసోడ్స్‌లో అభి, దుర్గ, పార్వతి సహా పిల్లలను కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌లను పరిచయం చేసుకుంటూ వెళ్లాడు. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఆరంభ సన్నివేశాలు పునరావృతం అవుతాయి. నాలుగో ఎపిసోడ్‌ దగ్గరి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆది, దుర్గలు టైమ్‌ లూప్‌లో ఇర్కుపోయామని గుర్తించి కలిసి పనిచేయడంతో కథ, కథనాల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఎపిసోడ్‌ చూస్తూ, తర్వాత ఇలా జరుగుతుందేమో అని ప్రేక్షకుడు ఊహించేలోపే ఊహకు అందని విధంగా కథ మలుపు తిరగడం రసవత్తరంగా ఉంటుంది. క్లైమాక్స్‌ వరకూ ఇదే బిగిసడలని కథా, కథనంతో కట్టిపడేశాడు దర్శకుడు. ముఖ్యంగా చివరి ఎపిసోడ్‌లో ఇద్దరూ ఈ టైమ్‌లూప్‌ నుంచి ఎలా బయటపడతారన్న ఆసక్తి చూసే ప్రేక్షకుడిలో తారస్థాయికి చేరుతుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్‌ను ఎవరూ ఊహించరు. ఈ సిరీస్‌కు కొనసాగింపు ఉంటుందని చెప్పకనే చెప్పాడు. ఇటీవల కాలంలో అలరించిన తెలుగు వెబ్‌సిరీస్‌లలో ‘కుడి ఎడమైతే’ మంచి థ్రిల్లర్‌.

ఎవరెలా చేశారంటే: సీఐ దుర్గగా అమలాపాల్‌ చక్కని నటన కనబరిచింది.  ఎక్కడా కూడా పాత్ర పరిధి దాటి నటించలేదు. డెలివరీ బాయ్‌ ఆదిగా యువ నటుడు రాహుల్‌ విజయ్‌ ఒదిగిపోయాడు. నటుడు కావాలని అతను పడే తపన, ప్రేయసికి తన ప్రేమను వ్యక్తం చేయలేకపోయే నిస్సహాయ పాత్రలో విజయ్‌ హావభావాలు మెప్పిస్తాయి. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. పూర్ణ చంద్ర తేజస్వీ సంగీతం బాగుంది.  నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేసింది. సినిమాటోగ్రాఫర్‌ అద్వైత్‌ గురుమూర్తి  చాలా చక్కగా తీశారు. నైట్‌ ఎఫెక్ట్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  సురేశ్‌ ఆర్ముగం ఎడిటింగ్‌ పర్వాలేదు. దర్శకుడు అనుకున్న కథను తికమకలేకుండా సన్నివేశాలను జత చేస్తూ వెళ్లారు. అయితే, నిడివి కాస్త ఎక్కువైందని చెప్పవచ్చు. ఇక ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం దర్శకుడికి కత్తిమీద సాములాంటిది. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా అయినా, సిరీస్‌ అయినా అట్టర్‌ఫ్లాప్‌ అవుతుంది. అయితే, రచయిత రామ్‌ విఘ్నేష్‌, దర్శకుడు పవన్‌ చాలా చక్కగా ప్రతి సన్నివేశాన్ని రాసుకున్నారు. వచ్చిన సన్నివేశాలే వస్తున్నట్లు అనిపించడం ఒక్కటే మైనస్‌. బహుశా వెబ్‌ సిరీస్‌గానే తీయాలన్న ఉద్దేశంతో నిడివి విషయంలో అస్సలు ఆలోచించలేదనిపిస్తోంది. అదే సినిమాగా క్లుప్తంగా రెండున్నర గంటల్లో కథ చెప్పేసి ఉంటే మరోలా ఉండేదేమో. ఏదేమైనా ఒక చక్కని సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూసిన భావన ప్రేక్షకుడిలో కలుగుతుంది

బలాలు: + కథ, కథనాలు; + నటీనటులు; + రచన, దర్శకత్వం; + సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు: - చూసిన సన్నివేశాలే చూసినట్లు అనిపించడం; - పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం

చివరిగా: ‘కుడి ఎడమైతే’ ఎడమకు కుడి అవుతుంది.. ఎడమకు ఎడమ.. కుడికి కుడి.. అబ్బా ఈ తికమక వద్దు.. ‘కుడి ఎడమైతే’ చూసేయండి.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని