
Amitabh Bachchan: ‘షోలే’ చిత్రంలో ఆ సీన్ షూట్ చేసేందుకు మూడేళ్లు పట్టింది
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్‌లో విడుదలైన క్లాసిక్ చిత్రాల్లో ‘షోలే’ ఒకటి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని, జయాబచ్చన్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం 1975లో విడుదలవ్వగా.. అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశం గురించి ఎవరికీ తెలియని విషయాలను పంచుకున్నారు బిగ్‌బి అమితాబ్. ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలే చిత్రం రీయూనియన్‌కి వేదికైంది. ఈ క్విజ్ షోకి షోలే దర్శకుడు రమేష్ సిప్పి, హీరోయిన్ హేమామాలిని కంటెస్టెంట్స్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా అలనాటి షోలే జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఇక అమితాబ్ మాట్లాడుతూ.. ‘షోలో చిత్రంలో నేను మౌతార్గన్ ప్లే చేస్తుండగా.. జయా బచ్చన్ దీపాలు వెలిగించే సన్నివేశం ఉంది. దాన్ని సూర్యాస్తమయం వేళ షూట్ చేద్దామని మా డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ (డీఓపీ) దివేచా అన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ.. రమేష్ జీ కేవలం ఆ సన్నివేశం అనుకున్నట్లు రావాలని మూడేళ్లు శ్రమించారు. మొత్తానికి ఆ షాట్ విజయవంతంగా వచ్చింది’’ అని చెప్పారు. షోలే విడుదలై 46ఏళ్లైనా ఇప్పటికీ ఆ చిత్రానికి ఉండే క్రేజ్ వేరు. ‘వీరూ’ పాత్ర పోషించిన ధర్మేంద్ర వీడియో కాల్‌లో 28మైళ్ల దూరం నడిచాననే సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన దేనికోసం నడిచారు? దర్శకుడు రమేష్ ‘జై’ పాత్రకు ఎందుకు అమితాబ్‌నే ఎంచుకున్నారు? షోలో జై, వీరు పాత్రల డైలాగ్స్‌ని హేమామాలిని ఎలా చెప్పారు.. వీటితో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే కేబీసీ 13 షోలే రీయూనియన్ ఎపిసోడ్ వీక్షించాల్సిందే.