Amitabh Bachchan: గాయం నుంచి కోలుకున్న అమితాబ్‌.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌

తాను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, స్నేహితులకు సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు అమితాబ్‌ బచ్చన్‌.

Published : 20 Mar 2023 19:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా చిత్రీకరణలో ఇటీవల గాయపడిన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే యథావిధిగా పని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్‌ చేశారు. అందులో ఆయన బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు. ‘గ్రేట్‌ న్యూస్‌’, ‘షెహన్‌షా ఈజ్‌ బ్యాక్‌’ అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మార్చి తొలివారంలో హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చిత్రీకరణలో అమితాబ్‌ గాయాల పాలైన సంగతి తెలిసిందే. యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ చేస్తుండగా ఆయన కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తగిన చికిత్స తీసుకున్న అనంతరం.. ముంబయిలోని తన నివాసానికి చేరుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని అభిమానులకు ఓ రోజు తెలియజేస్తూ.. ‘‘వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నా. ఏదైనా జరిగితే బాధ పడకుండా దాన్ని అధిగమించడమే నేను చేసే పని. మనకు ఎంత వేగంగా గాయమవుతుందో అంతే వేగంగా మన శరీరం దాన్ని నయం చేస్తుంది’’ అంటూ స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రమే ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K). దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని