Kalki: ‘కల్కి’ బుజ్జితో ఆనంద్‌ మహీంద్ర.. వీడియో షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ

ఆనంద్‌ మహీంద్రా ‘కల్కి’ వాహనం బుజ్జిని నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ షేర్‌ చేసింది.

Updated : 12 Jun 2024 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కల్కి’లో ఎంతో కీలకమైన బుజ్జి(వాహనం)ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా నడిపారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్‌ జోరు పెంచింది టీమ్‌. బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతూ సినిమా విశేషాలను ప్రచారం చేస్తుంది. ఇందులోభాగంగానే  ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఈ వాహనాన్ని డ్రైవ్‌ చేశారు. ఈ వీడియోను ‘బుజ్జి మీట్స్‌ ఆనంద్‌ మహీంద్రా’ అనే క్యాప్షన్‌తో నిర్మాణసంస్థ షేర్‌ చేసింది. డ్రైవ్‌ చేసిన అనంతరం ఆయన బుజ్జితో ఫొటోలు దిగారు.

కల నెరవేరడానికి చాలా సమయం పట్టింది: నాగ్‌ అశ్విన్‌

‘కల్కి’ మూవీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, ఆయన టీమ్‌ ‘బుజ్జి’ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. ఇందుకోసం వందల స్కెచ్‌లు వేశారు. కారుకు రూపు రేఖలు ఇవ్వడానికి ఏకంగా ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌లను చదవాల్సి వచ్చిందని నాగ్‌ అశ్విన్‌ చెబుతున్నాడంటే దీని తయారీ కోసం ఎంత పరిశోధన చేశారో అర్థం చేసుకోవచ్చు. కారును వాస్తవ రూపంలో తీసుకురావడానికి ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థలైన మహీంద్రా, జయం మోటార్స్‌ (కోయంబత్తూరు) ఇంజినీర్లు సహకారం అందించారు.

‘కల్కి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌పై ఆనంద్‌ మహీంద్ర ఇటీవల ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాహనాన్ని రూపొందించాలనే ఆలోచన అద్భుతమని ఆయన చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘నాగ్‌ అశ్విన్‌, అతడి టీమ్‌ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అధునాతన వాహనాలు తయారుచేయడంలో ‘కల్కి’ చిత్ర బృందానికి చెన్నైలోని ‘మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ’ టీమ్‌ సహాయపడింది. ‘బుజ్జి’ వాహనం రెండు మహీంద్రా ఇ-మోటార్లతో నడుస్తుంది’’ అని తెలిపారు. పురాణాలను సైన్స్‌ను జోడించి తీసిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ (Kamal Haasan), దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని