Anandam: హృదయాన్ని హత్తుకున్న ‘ఆనందం’కి 20ఏళ్లు

టాలీవుడ్‌లో వచ్చిన చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రం ‘ఆనందం’కి 20ఏళ్లు

Updated : 28 Sep 2021 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ‘ఆనందం’. టీవీల్లో ఇప్పుడు ప్రసారమైనా సరే ప్రేక్షకులను కదలనివ్వకుండా కట్టిపడేసేంత ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా దర్శకుడు శ్రీనువైట్ల తెరకెక్కించారు. ఇదే ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. హీరో ఆకాశ్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ని చేసింది. సంగీత దర్శకుడిగా అప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైన దేవీశ్రీప్రసాద్‌ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్‌ ఆయన్ను మరో మెట్టు ఎక్కించింది. మెలోడి పాటలు, నేపథ్య సంగీతం ఇవ్వాలంటే దేవీ తరువాతే ఎవరైనా అని చెప్పుకునేలా చేసింది. కాలేజీలో హీరో-హీరోయిన్ల అల్లర్లు, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే లవ్‌ ట్రాక్‌, హౌస్‌ ఓనర్స్‌గా బ్రహ్మానందం, ఎం.ఎస్‌ నారాయణ, కాలేజీలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చిత్రం శీను, మిమిక్రీ ఆర్టిస్ట్‌ శివారెడ్డి, బబ్లూ పండించిన కామెడీ ఈ సినిమాకు బలం. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం విడుదలై నేటికి (సెప్టెంబరు 28) 20ఏళ్లు. మరి ఆ చిత్ర విశేషాలను తెలుసుకుందామా!

కథేంటంటే: చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్లలో ఉంటారు కిరణ్‌ (ఆకాశ్‌) ఐశ్వర(రేఖ). ప్రతి చిన్న విషయానికీ గొడవ పడుతుంటారు. కాలేజీకి వెళ్లే వయసు వచ్చినా సరే.. ఒకరంటే ఒకరికి పీకల దాకా కోపం. ఒకరోజు ఐశ్వర కుటుంబం ఇల్లు ఖాళీ చేసి ఊటీకి షిఫ్ట్‌ అవుతారు. ఈ విషయం తెలిసిన కిరణ్‌ తనకు ఐశ్వర్య నుంచి విముక్తి లభించిందని పండగ చేసుకుంటాడు. అలా ఊటీలో ఓ ఇంట్లోకి వెళ్లాక ఐశ్వర్యకు దీపిక (తనూరాయ్‌) పేరుతో వచ్చిన ఉత్తరం, గ్రీటింగ్‌ కార్డ్‌ కనిపిస్తాయి. ఇప్పుడు తాము ఉండే ఇంట్లోనే గతంలో దీపిక వాళ్లు ఉండేవాళ్లని తెలుసుకున్న ఐశ్వర్య ఎలాగైనా ఆ లేఖ, గ్రీటింగ్‌ కార్డును దీపికకు అందించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే ఆమెకో షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది. తాను వెతికే దీపిక సూసైడ్‌ చేసుకొని చనిపోయిందని దీపిక స్నేహితురాలు చెబుతుంది. దీపిక, వంశీ (వెంకట్‌) కాలేజీలో ప్రేమికులు. వెంకట్‌ తన తల్లిదండ్రులను ఒప్పించి వస్తానని చెప్పి ఊరు వెళ్లిపోతాడు. రోజులు గడుస్తున్నా రాకపోయే సరికి దీపికకి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసేందుకు సిద్ధమవుతారు. సున్నిత మనస్కురాలైన దీపిక ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక సూసైడ్‌ చేసుకుంటుంది. దీపిక లేదన్న నిజం వంశీకి తెలిస్తే ఏమైపోతాడోనని.. ఆమె పేరుతో ఐశ్వర్య లేఖలు రాయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? నిజానిజాలు ఎలా బయటపడ్డాయి. వంశీ పేరుతో ఉత్తరాలు రాస్తున్నది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

* 2001లో విడుదలైన చిత్రం 200రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. కొత్తతరాన్ని, కొత్త కథలను ఎప్పుడూ ప్రోత్సహించే నిర్మాత రామోజీరావు.. మరోసారి కొత్త దర్శకుడు శ్రీనువైట్ల, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌లో దాగి ఉన్న టాలెంట్‌ను గుర్తించి టాలీవుడ్‌కు మరపురాని చిత్రమిచ్చారు. 

* అటు ఆకాశ్‌.. ఇటు రేఖ కూడా తెలుగులో తొలిచిత్రమైనా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 

* తమిళంలో ‘ఇనిదు ఇనిదు కాదల్‌ ఇనిదు’, కన్నడలో ‘ఆనంద’ పేరుతోనూ విడుదలై.. అక్కడా మంచి టాక్‌ తెచ్చుకుంది. మూడు భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని రామోజీరావు నిర్మించారు.

* సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన  ‘కనులు తెరిచినా కనులు మూసినా’, ‘ఎవరైనా ఎప్పుడైనా’ పాటలు యూత్‌ను ఆకట్టుకున్నాయి.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని