
Anasuya: నెటిజన్లకు సారీ చెప్పిన నటి అనసూయ..!
హైదరాబాద్: సోషల్‌మీడియా యూజర్లకు నటి అనసూయ క్షమాపణలు చెప్పారు. తన డే టు డే లైఫ్ గురించి తరచూ సోషల్‌మీడియాలోని నెటిజన్లతో ముచ్చటించే ఆమె బుధవారం ఉదయం దేశప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన జాతీయ గేయమైన ‘వందేమాతరం’ ఆలపిస్తూ ఓ వీడియోను షేర్ చేసి.. రిపబ్లిక్ డే విషెస్ చెప్పారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘మేడమ్ ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవం కాదు.. గణతంత్ర దినోత్సం. మీరు వేసుకున్న షర్ట్‌పై మహాత్మా గాంధీ బొమ్మ ఉంది. గాంధీకి గణతంత్ర దినోత్సవానికి సంబంధం ఏమిటి?’’, ‘‘మీరు కూర్చొని ఈ పాట పాటడం ఏం బాలేదు. కొంచెం నిల్చొని పాట పాడుంటే హుందాగా అనిపించేది. ఇలా చెప్పినందుకు మీరు ఫీలై ఉంటే క్షమించండి’’ అని నెటిజన్ల నుంచి వరుస కామెంట్లు వచ్చాయి.
ఆ కామెంట్లపై స్పందించిన అనసూయ..‘‘మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిల్చొని పాట పాడనందుకు చాలామంది అసహనానికి లోనైనట్లు ఉన్నారు. అందుకు నన్ను క్షమించండి. జాతీయ గీతమైన ‘జనగణమన’కు లేచి నిల్చుటాం.. తద్వారా దేశంపట్ల మన గౌరవాన్ని చాటుతాం. కానీ, నేను ఆలపించింది జాతీయ గేయమైన వందేమాతరం.. దాన్ని మీరందరూ గమనించాలి. నా దేశం పట్ల నాకెంతో గౌరవం ఉంది’’ అని ఆమె రిప్లై ఇచ్చారు. అనసూయ సమాధానమిచ్చినప్పటికీ నెగటివ్ కామెంట్లు ఆగకపోవడంతో ఆమె అసహనానికి గురయ్యారు. ‘‘అరేయ్ ఎందిరా భయ్ మీ లొల్లి.. జాతీయ గేయం అంటారు.. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటి? అంటారు.. వందేమాతరాన్ని జాతీయ గీతం అనుకుంటే మరి జనగణమన ఏంది? ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్యం రాబట్టే జనవరి 26, 1950లో గణతంత్ర దినోత్సవం వచ్చింది. కాబట్టి కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకుని మాట్లాడండి’’ అని కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.