Anasuya: అనసూయ కోసం వాళ్ల నాన్న రక్తం అమ్మి బహుమతి ఇచ్చారట: దర్శకుడు శివ ప్రసాద్‌

సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విమానం’ (Vimanam). శివ ప్రసాద్‌ దర్శకుడు. అనసూయ కీలకపాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 08 Jun 2023 23:03 IST

హైదరాబాద్‌: త్యాగం నుంచే తండ్రి ప్రేమ పుడుతుందని, పిల్లల కలలు నెరవేర్చడం కోసం నాన్న ఎప్పుడూ త్యాగాలు చేస్తూనే ఉంటాడని అన్నారు ‘విమానం’ (Vimanam) దర్శకుడు శివ ప్రసాద్‌. తండ్రి సెంటిమెంట్‌తో ఆయన తెరకెక్కించిన ‘విమానం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా అనసూయకు సంబంధించిన ఓ విషయాన్ని దర్శకుడు బయటపెట్టారు.

‘‘మాతృదేవోభవ’, ‘అమ్మ రాజీనామా’వంటి చిత్రాల్లో అమ్మ గొప్పతనం కనిపిస్తుంది. అమ్మను డ్రమటైజ్‌ చేసినంత తేలిగ్గా నాన్నని చేయలేకపోయామని దర్శకుడు త్రివిక్రమ్‌ ఓ సందర్భంలో అన్నారు. ఆయన అలా చెప్పారని నేను కథ రాయలేదు. అప్పటికే సిద్ధమైన నా స్టోరీ పరిధిని ఇంకాస్త పెంచానంతే. నాకు కొడుకు పుట్టాకే మా నాన్న గొప్పతనం అర్థమైంది. ఆ తర్వాత ఆయనపై ఒక్కసారి కూడా కోప్పడలేదు’’ అని శివప్రసాద్‌ తెలిపారు.

ఇంతకుముందు అనసూయగారితో మాట్లాడుతుండగా.. ‘నాకు మా నాన్న గుర్తొచ్చారండీ’ అని ఆమె అన్నారు. ఈ మాట చెప్పొచ్చో, లేదో తెలియదుగానీ ఆవిడ అనుమతితోనే చెబుతున్నా. గతంలో పుట్టినరోజు నాడు అనసూయ తన తండ్రిని బహుమతి కావాలని అడిగారట. ఆయన షాప్‌కు వెళ్లి గిఫ్ట్‌ తీసుకొచ్చి ఆమెకు ఇచ్చారు. ఆ తర్వాత ఆయనకు నీరసంగా ఉండడంతో పడుకున్నారు. ఏమైందో అప్పుడు ఆమెకు అర్థంకాలేదు. ‘ఈ రోజు నా బర్త్‌డే కదా. నాన్న ఏంటీ డల్‌గా ఉన్నారు’ అని ఆలోచించారు. కొంత సమయానికిగానీ ఆమెకు తెలియలేదు తన తండ్రి రక్తాన్ని అమ్మేసి ఆ గిఫ్ట్‌ కొనితెచ్చారని. ఈ విషయాన్ని ఆమె నాకు చెప్పినప్పుడు షాక్‌ అయ్యా.  నాన్న ప్రేమ త్యాగం నుంచి పుడుతుంది. చెట్టుకు వేర్లు ఎలాగో మనకు నాన్న కూడా అలానే. వేర్లు మట్టిలోంచి పోషకాలు తీసుకుని చెట్టు ఎదుగుదలకు తోడ్పడినట్టే నాన్న బాధ, దుఃఖాన్ని తీసుకొని పిల్లలకు సంతోషాన్ని పంచుతాడు’’ అని శివ ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. దీంతో అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ భావోద్వేగానికి గురయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని