Anchor Syamala: యాంకర్‌ శ్యామల ఇంటిని చూశారా.. పల్లెటూరి వాతావరణం ఉట్టిపడేలా!

సినీ, సీరియల్‌ నటులు, వ్యాఖ్యాతలు.. ఇలా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న వారంతా అభిమానులతో తమ ఇంటి విశేషాలు పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంటి నిర్మాణం ఎలా సాగింది? ఏ ఏ వస్తువులు కొన్నారు? ఎన్ని రూమ్స్‌ ఉన్నాయి?

Updated : 30 Jul 2022 10:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ, సీరియల్‌ నటులు, వ్యాఖ్యాతలు.. అభిమానులతో తమ ఇంటి విశేషాలు పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి నిర్మాణం ఎలా సాగింది? ఏయే వస్తువులు కొన్నారు?ఎన్ని రూమ్స్‌ ఉన్నాయి? తదితర వివరాలతో వీడియోలు రూపొందించి ‘హోంటూర్‌’ పేరిట సోషల్‌ మీడియాలో విడుదల చేస్తున్నారు. ఈ జాబితాలోకి యాంకర్‌, ఆర్టిస్ట్‌ శ్యామల (Anchor Syamala) చేరారు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, ప్రోత్సాహం వల్ల తమ సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆ ఇంటి విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘నేనూ మా వారు పల్లెటూరి నుంచి వచ్చాం. కాబట్టి ఆ వాతావరణం ఉట్టిపడేలా మా ఇంటిని డిజైన్‌ చేసుకున్నాం. నిర్మాణం పూర్తవకపోయినా మంచి ముహూర్తం ఉందని కార్తీక మాసంలో గృహ ప్రవేశం చేశాం. ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు ఇంకా సమయం పడుతుంది. అందుకే మీరంతా అడిగినా నేను ఇప్పటి వరకు హోంటూర్‌ చేయలేకపోయా. మొత్తం అన్ని పనులు పూర్తయ్యాకే మీకు చూపించాలనుకున్నా. ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి. తర్వాత, మా ఇంటిని ఎలా డెకరేట్‌ చేశామో దానికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేస్తా’’

‘‘వైట్‌, గ్రే, బ్రాంజ్‌.. మా ఇంట్లో ఈ మూడు రంగులే కనిపిస్తాయి. మాకు లైట్‌ కలర్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకే జిగేల్‌మనిపించే ఇంటీరియర్‌ను పక్కకు పెట్టి వీటినే ఎంపిక చేసుకున్నాం. నాకు దైవభక్తి ఎక్కువ. ప్రత్యేకంగా దేవుడి గదిని రూపొందించాం. వంటల్లో ప్రయోగాలు చేయాలంటే నేను ముందుంటా. నా యూట్యూబ్‌ ఛానల్‌లో మీరు చూసే వంటలన్నీ ఇక్కడ వండినవే. ‘అది చేద్దాం... ఇది చేద్దాం’ అంటూ నేనూ మా వారు ఈ కిచెన్‌లోనే చర్చిస్తాం. వంటగది.. మాకు మంచి అనుభూతి పంచుతుంది. స్థలాభావం వల్ల.. చిన్న సైజులో అందంగా ఉండే డైనింగ్‌ టేబుల్‌ కోసం ఎంతగానో శ్రమించాం’’

‘‘మా అబ్బాయి ఇషాన్‌ వేసిన పెయింటింగ్‌ని భద్రంగా దాచుకున్నా. ఓ కారు బొమ్మ వేసి, అందులో మేం ప్రయాణిస్తున్నట్టు చెప్తుంటాడు. మేం వినియోగించే వాహనాలన్నీ ఎరుపు రంగువే. అందుకే వాడూ తన కారు బొమ్మకు రెడ్‌ కలర్‌ వేశాడు. అంతేకాదు, అన్ని వాహనాలతో పాటు ఈ కార్‌నీ క్లీన్‌ చేయమని డ్రైవర్‌కి చెబుతుంటాడు. మా ఇంట్లో రెండు సెపరేట్‌ హాల్స్‌ ఉన్నాయి. మేం ఉండేందుకు ఒకటి. అతిథుల కోసం మరొకటి. అప్పుడప్పుడు హాల్‌లోనే భోజనం చేస్తూ టీవీ చూస్తాం. ఇలా అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఫర్నిచర్‌ను సెట్‌ చేశాం. బయటి నుంచి వచ్చిన వెంటనే నేను ఇక్కడున్న సోఫాలో పడిపోయి, విశ్రాంతి తీసుకుంటా. నాకు బాగా ఇష్టమైన ప్లేస్‌ ఇది’’

‘‘గృహ ప్రవేశం వీడియో చూసిన చాలామంది ‘ఆ చెట్టు ఎక్కడ కొన్నారు?’ అనే అడిగారు. ఆ విషయం నాకూ తెలియదు. దీన్ని మా వారు తీసుకొచ్చారు. ఇంటి పనుల్లో నాకంటే ఎక్కువగా మా వారే లీనమయ్యారు. ఈ చెట్టు డిజైన్‌ వర్క్‌ ఇంకా పూర్తవలేదు. దానికి మిర్రర్‌ పెడితే లుక్‌ బాగుంటుంది. సంబంధిత పని చేసే వారు ఎప్పటికప్పుడు వస్తా అంటూనే ఇప్పటికీ రాలేదు’’

‘‘నా దగ్గర మేకప్‌ కిట్స్‌ ఎక్కువగా ఉంటాయనుకుంటారు. కానీ, అసలు ఉండవు. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లేముందు మేకప్‌మ్యాన్‌, హెయిర్‌ స్టైలిష్ట్‌ వచ్చి, నన్ను రెడీ చేస్తారు. అది మినహా వ్యక్తిగతంగా నేను మేకప్‌ వేసుకోను. ఇంటి విషయంలో పిల్లల ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోవాలి. ఇషాన్‌ అభిరుచి మేరకు ఓ రూమ్‌ని ఏర్పాటు చేశాం. తను పడుకునేందుకు ఓ బెడ్‌, ఆడుకునేందుకు మరో బెడ్‌ ఉంటుంది. ఇంటికి ఎవరు కొత్తగా వచ్చినా తన రూమ్‌నే ముందు చూపిస్తాడు. దాన్ని మేం ఆనందిస్తాం’’

‘‘ప్రస్తుతానికి ఈ ఇంట్లో నేనూ మా వారు, బాబు ఉంటున్నాం. భవిష్యత్తులో మా పెద్దవారు మాతో ఉండాల్సి వస్తుంది. వారిని దష్టిలో పెట్టుకుని లిఫ్ట్‌ కూడా పెట్టించాం. హోమ్‌ థియేటర్‌ రూమ్‌నీ బెడ్‌ రూమ్‌గా మార్చడంతో మొత్తం నాలుగు బెడ్‌ రూమ్‌లు అయ్యాయి. లైటింగ్‌ కోసం మేం చాలా ఖర్చుపెట్టాం. రాత్రి వేళ మా ఇంటిని చూస్తే మరింత అందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మా ‘ఇంటి కల’ నెరవేరింది. మీ అభిమానం చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మా ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువు వివరాలు తెలుసుకోవాలనుంటే కామెంట్‌ చేయండి. తప్పకుండా సమాధానమిస్తా. మీకు అది ఉపయోగపడొచ్చు’’ అని శ్యామల తన అభిమానులకు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని