Telugu movies: ఏపీలో బాలకృష్ణ, చిరు మూవీల టికెట్‌ ధరలు పెంపు.. తెలంగాణలో ఆరో షో

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి విడుదలవుతున్న అగ్ర కథానాయకులు సినిమాలైన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల టికెట్‌ ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 10 Jan 2023 22:30 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌ల వద్ద సంక్రాంతి సందడి షురూ కానుంది. అగ్ర కథానాయకుల సినిమాల విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచుకునేలా గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఈ క్రమంలో సంక్రాంతికి విడుదలవుతున్న ‘వీరసింహారెడ్డి’ (veera simha reddy), ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) టికెట్‌ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరగా, ఈ మేరకు అనుమతులు ఇచ్చింది. టికెట్‌ ధరపై గరిష్ఠంగా రూ.45 (జీఎస్టీ అదనం) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్‌ షోలకు అనుమతి ఇచ్చింది.

జనవరి 12న బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. గోపిచంద్‌ మలినేని ఈ మూవీని తెరకెక్కించారు. ఆ మరుసటి రోజే అంటే జనవరి 13న  చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ విడుదల కానుంది. ఇందులోనూ శ్రుతిహాసన్‌ నటిస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. అంటే విడుదల రోజు ఉదయం 4గంటలకు ఎంపిక చేసిన థియేటర్‌లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అతి పెద్ద పండగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పండగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. వరుస సెలవులు ఉండటంతో ప్రేక్షకులు భారీగా థియేటర్‌లకు వస్తారు. ఈ సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు వస్తుండటంతో బాక్సాఫీస్‌ వద్ద మంచి క్రేజ్‌ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాణ సంస్థ టికెట్‌ ధరను గరిష్ఠంగా రూ.70 పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకుంది. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.45 (జీఎస్టీ అదనం)పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే వివిధ థియేటర్‌లలో బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. సంక్రాంతికి ముందుగా రేసులో ఉన్న ‘వారసుడు’ వెనక్కి వెళ్లడంతో ఇప్పుడు చిరు, బాలకృష్ణ మూవీలకు థియేటర్‌లను సర్దుబాటు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని