Anger Tales Review: రివ్యూ: యాంగర్‌ టేల్స్‌ (వెబ్‌సిరీస్)

వెంకటేశ్‌ మహా, తరుణ్‌ భాస్కర్‌, మడోన్నా సెబాస్టియన్‌, బిందు మాధవి తదితరులు కలిసి నటించిన వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 09 Mar 2023 18:05 IST

Anger Tales Review వెబ్‌సిరీస్‌: యాంగర్‌ టేల్స్‌; నటీనటులు: వెంకటేశ్‌ మహా, సుహాస్‌, బిందు మాధవి, తరుణ్‌ భాస్కర్‌, మడోన్నా సెబాస్టియన్‌, ఆచార్య ఫణి, సుధ తదితరులు; సంగీతం: స్మరణ్‌ సాయి; సినిమాటోగ్రఫీ: అమర్‌ దీప్‌, వినోద్‌, వెంకట్‌; నిర్మాతలు: సుహాస్‌, శ్రీధర్‌ రెడ్డి; దర్శకత్వం: ప్రభల తిలక్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్‌.

నటుడు సుహాస్‌ (Suhas) నిర్మాతగా వ్యవహరించిన వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’ (Anger Tales). యువ దర్శకులు వెంకటేశ్‌ మహా (Venkatesh Maha), తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker), హీరోయిన్‌ బిందు మాధవి (Bindu Madhavi) తదితరులు ప్రధాన పాత్రలు పోషించడంతో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి, ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో విడుదలైన సిరీస్‌ ఎలా ఉందో, కథేంటో తెలుసుకుందామా (Anger Tales Review)..

ఇవీ కథలు: నాలుగు కథల సమాహారం ఈ ‘యాంగర్‌ టేల్స్‌’. తన అభిమాన హీరో సినిమా ‘బ్లాస్టర్‌’ను బెనిఫిట్‌ షో ప్రదర్శనకు రంగ (వెంకటేశ్‌) రంగంలోకి దిగుతాడు. టికెట్లు అమ్మడం సహా అన్ని పనులూ తానే చూసుకుంటాడు. చెప్పిన సమయానికి చిత్రాన్ని ప్రదర్శించలేకపోవడంతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వారిలో ఒకరైన పచ్చ బొట్టు శ్రీను (సుహాస్‌) సినిమా పోయిందంటూ హేళన చేయడంతో రంగ అతనితో గొడవ పడతాడు. ‘సినిమా హిట్‌ అయితే అది చేయాలి, లేకపోతే ఇది చేయాలి’ అంటూ ఇద్దరూ పందెం వేసుకుంటారు? ఆ బెట్‌ ఏంటి? ఎవరు గెలిచారు? అనేది తెలియాలంటే తొలి ఎపిసోడ్‌ ‘బెనిఫిట్‌ షో’ చూడాల్సిందే. రాజీవ్‌ (తరుణ్‌ భాస్కర్‌) కుటుంబం నివసించే అపార్ట్‌మెంట్‌లో మాంసాహారం తినడం నిషిద్ధం. ఆరోగ్య సమస్య తలెత్తిన రాజీవ్‌ భార్య పూజ (మడోన్నా) డాక్టర్‌ని సంప్రదించగా ఆమె గుడ్డు తినాల్సిందేనని సూచిస్తుంది. దాంతో, పూజ తన భర్త, అత్తయ్యకు తెలియకుండా గుడ్లు తెచ్చుకుని తింటుంటుంది. చివరకి ఆ విషయం తెలుసుకున్న రాజీవ్‌.. పూజను ఏమన్నాడు? దానికి పూజ ఏం చేసిందనేది రెండో ఎపిసోడ్‌ ‘ఫుడ్‌ ఫెస్టివల్‌’ సారాంశం.

మూడో ఎపిసోడ్‌ ‘ఆఫ్టర్‌నూన్‌ న్యాప్‌’ విషయానికొస్తే.. రాధ (బిందు మాధవి) ఓ పాత ఇంట్లో అద్దెకు ఉంటుంది. బంధువులురాగా ఆ ఇంటి యజమానురాలు వారితో కలిసి మెట్లపైనే ముచ్చట్లు పెడుతుంది. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్న రాధకు వారి మాటలు వినపడుతుండడంతో ఓ రోజు తన ఇబ్బంది గురించి చెబుతుంది. ఎంత విజ్ఞప్తి చేసినా వారి తీరు మారదు. మరి, రాధ వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకుంది? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. గిరిధర్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఉద్యోగి. బట్టతల కారణంగా పెళ్లి ఆలస్యమవుతుంది. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసుకుంటానని పెద్దమ్మ (సుధ)తో చెబితే ఆవిడ అంగీకరించదు. చివరకు ఓ పెళ్లి సంబంధంరాగా అంతకుముందు కొన్ని నిమిషాల్లోనే గిరిధర్‌ ఉద్యోగం పోతుంది. పెద్దమ్మ మరణించాక ఆమె ఇన్సూరెన్స్‌ డబ్బుతో హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్న అతను మళ్లీ దాన్ని ఎందుకు వద్దనుకున్నాడు? జుట్టు ఊడిపోవడంపై ఎవరిపై కేసు వేశాడు? అన్నది నాలుగో ఎపిసోడ్‌ ‘హెల్మెట్‌ హెడ్‌’లో చూడొచ్చు (Anger Tales Review).

ఎలా ఉందంటే: ఇందులోని కథలు వేరైనా ప్రధాన పాత్రల భావోద్వేగం ఒక్కటే. కారణాలు వేరైనా అన్ని క్యారెక్టర్లు చివరకు కోపం ప్రదర్శిస్తాయి. నాలుగు విభిన్న స్టోరీలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు దర్శకుడు తిలక్‌. ‘ఇలానే నేనూ ఎదుర్కొనా, ఈ అనుభవం నాకూ ఉంది’ అని చాలామంది ఆడియన్స్‌ ఏదో ఓ కథ విషయంలోనైనా అనుకునే అవకాశాలు ఉన్నాయి. ‘బెనిఫిట్‌ షో’ ద్వారా స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ల హంగామా.. చెప్పిన టైమ్‌కు షో వేయలేకపోతే థియేటర్‌ యజమానులు ఎదుర్కొనే ఒత్తిడి.. సినిమా హిట్టా, ఫట్టా? అంటూ ఇరు వర్గాల మధ్య సాగే పోరును చూపించారు. బెనిఫిట్‌ షో పేరుతో నష్టపోయిన వీరాభిమాని సదరు హీరో ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడం కొత్తగా ఉంటుంది. తెరకెక్కించాలనే ఉద్దేశమో, ‘ఓటీటీనే కదా’ అని అనుకున్నారేమోగానీ అక్కడక్కడా అసభ్య పదజాలం వాడారు. ఆయా సన్నివేశాలు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.

‘ఫుడ్‌ ఫెస్టివల్‌’లో స్వేచ్ఛలేని మహిళల మనోభావాలను ఆవిష్కరించారు. సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కాబట్టి ఈ పాత్రలను మరింత బలంగా చూపించి ఉండాల్సింది. భావోద్వేగాలకు పెద్దపీట వేసే ఈ కథలో అదే మిస్‌ అయింది. గుడ్డుకు బదులు మరో థీమ్‌ను ఎంపిక చేసుకుని, కథానాన్ని వేగంగా నడిపించే ఉంటే బాగుండేది. ‘ఆఫ్టర్‌నూన్‌ న్యాప్‌’లో సగటు మధ్యతరగతి గృహిణి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. భార్యాభర్తల గిల్లిగజ్జాలు, త్వరలోనే తమ జీవితంలో మార్పు వస్తుందనే ఆశ, ఇంటి ఓనర్‌తో చిన్న చిన్న గొడవలు.. ఇలా మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీలో చోటుచేసుకునే వాటిని సహజంగా తెరపైకి తీసుకొచ్చారు. ‘హెల్మెట్‌ హెడ్‌’ విషయానికొస్తే.. నేటి యువతలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో బట్టతల ఒకటి. పెళ్లికానివారు దాని వల్ల ఎంతగా బాధపడతారో ఇప్పటికే పలు సినిమాల్లో చెప్పారు. ఇందులోనూ అదే తరహా సన్నివేశాలు కనిపిస్తాయి. జుట్టు ఊడిపోవడానికి కారణమేంటే తెలుసుకుని, గిరిధర్‌ పాత్ర కేసు వేయడం భిన్నంగా సాగుతుంది (Anger Tales Review).

ఎవరెలా చేశారంటే: ‘కేరాఫ్‌ కంచరపాలెం’తో సెన్సేషన్‌గా మారిన దర్శకుడు వెంకటేశ్‌ మహా తనలోని నటుణ్ని గతంలోనే పరిచయం చేశారు. కానీ, పూర్తిస్థాయి పాత్ర పోషించడం ఇదే తొలిసారి. ఇందులోని రంగ పాత్రలో ఆయన ఒదిగిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. సుహాస్‌ నెగెటివ్‌ ఛాయలున్న పాత్రకు న్యాయం చేశారు. ‘ఆవకాయ్‌ బిర్యాని’, ‘బంపర్‌ ఆఫర్’, ‘పిల్ల జమీందార్‌’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన బిందు మాధవి ఇందులో రాధగా చక్కటి హావభావాలు పలికించారు. కొత్త నటుడైనా ఫణి.. గిరిధర్‌గా మెప్పిస్తారు. తరుణ్‌ భాస్కర్‌, మడోన్నా, సుధ తదితరులు ఫర్వాలేదనపిస్తారు. ఫస్ట్‌ ఎపిసోడ్‌లోని ఓ పాట, నేపథ్య సంగీతం అలరిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సాగదీతను తగ్గించి, అన్ని ఎపిసోడ్ల నిడివి తగ్గించి ఉంటే సిరీస్‌ ఇంకా బాగుండేది (Anger Tales Review).

బలాలు: + మూడో ఎపిసోడ్‌,  + బిందు మాధవి, వెంకటేశ్‌ మహా నటన

బలహీనతలు: - నెమ్మదిగా సాగే కథనం, - ఎమోషన్స్‌ బలంగా లేకపోవడం

చివరిగా: అన్నింటిలో ‘యాంగర్‌’ ఉన్నా రెండు ‘టేల్స్‌’ బాగున్నాయి.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు