Anni Manchi Sakunamule: సంతోష్‌ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది: నాని

సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నాని, దుల్కర్‌ సల్మాన్‌ ముఖ్య అతిథులుగా హాజరై, సందడి చేశారు.

Published : 14 May 2023 22:55 IST

హైదరాబాద్‌: యువ నటుడు సంతోష్‌ శోభన్‌ (Santosh Soban)ను చూస్తే తనని తాను చూసుకుంటున్నట్టు ఉంటుందని ప్రముఖ హీరో నాని (nani) అన్నారు. ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. సంతోష్‌, మాళవిక నాయర్‌ జంటగా నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. రాజేంద్ర ప్రసాద్‌, నరేశ్‌, గౌతమి, వాసుకి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని మే 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సందర్భంగా ఆదివారం ఈవెంట్‌ నిర్వహించారు. నానితోపాటు హీరో దుల్కర్‌ సల్మాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి నాని మాట్లాడుతూ.. ‘‘వైజయంతి సంస్థ నా ఫ్యామిలీలాంటిది. నందిని ఈ సినిమాని ఎంత బాగా తెరకెక్కించిందో ట్రైలర్‌లోని విజువల్స్‌ చూస్తే అర్థమవుతుంది. దర్శకత్వంలో ఆమె పరిణతి కనిపిస్తుంది. గొప్ప నటుల్లో మాళవిక నాయర్‌ ఒకరు. ఆమె మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నా. కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో సంతోష్‌ శోభన్‌. అతణ్ని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. నందినికి మరో నాని దొరికాడనిపిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’.. ప్రేక్షకులందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని నాని అన్నారు. ఇంతటి మంచి సినిమాలో తనకు నటించే అవకాశం రాలేదని, అందులో నటించిన వారిపై అసూయగా ఉందని దుల్కర్‌ సల్మాన్‌ పేర్కొన్నారు. వైజయంతి సంస్థతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ఆ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు.

గౌతమి కాల్షీట్స్‌ దొరకలేదు: అశ్వినీదత్‌

‘‘ఆ రోజుల్లో గౌతమిగారికి నేను అభిమానిని. ఆమెను ఓ సినిమాలో నటింపజేసేందుకు చాలా ప్రయత్నించా. కాల్షీట్స్‌ దొరకలేదు. ఈ వేడుకకు ఆమె, నా అభిమాన హీరోలు నాని, దుల్కర్‌ సల్మాన్‌రావడం సంతోషంగా ఉంది. నందమూరి తారకరామారావుగారు మా నిర్మాణ సంస్థకు నామకరణం చేసి, మమ్నల్మి ఆశీర్వదించారు. ఆయన శతజయంతి ఉత్సవాలు జరుగుతోన్న సమయానికి మా సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. మరో ఆనందకర విషయం ఏంటంటే.. అమితాబ్‌ బచ్చన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొణె వంటి ప్రముఖుల కాంబినేషన్‌లో సినిమా (ప్రాజెక్ట్‌ కె) చేస్తుండడం. రెండేళ్ల నుంచి మా అమ్మాయిలే ఈ సంస్థని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్టీఆర్‌ నుంచి ఇప్పటి హీరోల వరకు మా సంస్థతో కలిసి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు’’ అని అశ్వినీదత్‌ పేర్కొన్నారు.

ఈ సినిమాకి సూపర్‌స్టార్‌ అతడే: నందిని రెడ్డి

‘‘హీరో నాని లేకపోతే నా తొలి సినిమా ‘అలా మొదలైంది’ పూర్తయ్యేది కాదు. ఆ విషయం చాలామందికి తెలియదు. ఆయన ఈ వేడుకకు రావడం చాలా సంతోషం. దుల్కర్‌ సల్మాన్‌ అంటే నాకు ఇష్టం. ఆయన మరిన్ని ప్రేమకథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా. చిత్రీకరణలో ఏ సమస్య ఎదురైనా ఏం కాదంటూ నన్ను ప్రోత్సహించిన అశ్వినీదత్‌గారికి కృతజ్ఞతలు. ఎక్కువ మంది స్టార్‌ నటులతో సినిమా తీయడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమాకి సూపర్‌స్టార్‌ అంటే సంగీత దర్శకుడు మిక్కీ. జె. మేయర్‌. అద్భుతమైన సంగీతం అందించాడు. నిర్మాతలు స్వప్న, ప్రియాంక నా కుటుంబ సభ్యుల్లాంటి వారు. ఈ సినిమా చూసిన వారంతా థియేటర్‌ నుంచి మంచి అనుభూతితో బయటకు వస్తారు’’ అని నందిని రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌, కె. వి. అనుదీప్‌, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు