Karthikeya 2: ‘కార్తికేయ2’లో హైలైట్‌ సీన్‌.. కృష్ణుడి గొప్పతనంపై అనుపమ్‌ ఖేర్‌ స్పీచ్‌

‘కార్తికేయ2’లో కృష్ణుడి విశిష్టతను, గొప్పతనాన్ని  అనుపమ్‌ఖేర్‌ చెప్పే సన్నివేశాన్ని మీరూ చూసేయండి.

Updated : 07 Dec 2022 18:47 IST

హైదరాబాద్‌: ‘మనకు కనిపించడం లేదు అంటే, మన కన్ను చూడలేకపోతోందని అర్థం. లేదని కాదు.’ అంటున్నారు అనుపమ్‌ఖేర్‌. నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘కార్తికేయ2’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. బాక్సాఫీస్‌ వద్ద రూ.120కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా దసరా కానుకగా జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాలో కృష్ణుడి గొప్పతనం గురించి అనుపమ్‌ఖేర్‌ వివరించే సీన్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

‘‘కృష్ణుడు అపర మేధావి. ఉన్నత విలువలతో జన్మ తీసుకుని, ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు.. మన జీవితం. గీతతో కోట్లమందికి దారి చూపించిన అతనికన్నా గురువు ఎవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్‌ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్‌ ఎవరు? వేణుగానంతో గోవుల్ని, గోపికలను కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్‌ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతని కన్నా మించిన డాక్టర్‌ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన కృష్ణుడికి మించిన యోధుడు ఎవరు? కరవు, కష్టం తెలియకుండా చూసుకున్న అతడికి మించిన రాజు ఎవరు?’’ ఇలా కృష్ణుడి గొప్పతనాన్ని అనుపమ్‌ఖేర్‌ చెబుతుంటే ఒళ్లు గగురుపొడిచేలా చందూ మొండేటి సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. దీనికి కాల భైరవ నేపథ్య సంగీతం అదనపు బలాన్ని ఇచ్చింది. తాజాగా ఈ సన్నివేశాన్ని జీ5 అభిమానులతో పంచుకుంది. కృష్ణుడి విశిష్టతను, గొప్పతనాన్ని అనుపమ్‌ఖేర్‌ చెబుతుంటే ఒళ్లు గగురుపొడిచేలా చేసే సన్నివేశాన్ని మీరూ చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని