Anupam Kher: జమ్మూకశ్మీర్‌లో టార్గెట్‌ హత్యలు అంతం కావాలంటే..: అనుపమ్‌ ఖేర్‌

జమ్మూ-కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రమూకలు మారణకాండకు తెగబడుతున్న ఘటనలపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌(Anupam Kher)స్పందించారు....

Published : 22 Aug 2022 22:48 IST

సిమ్లా: జమ్మూ-కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రమూకలు మారణకాండకు తెగబడుతున్న ఘటనలపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌(Anupam Kher)స్పందించారు. కశ్మీర్‌లో ముష్కరుల లక్షిత హత్యలు(Target killings‌)ని అంతం చేయాలంటే ప్రజలందరూ బహిరంగంగా ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం సిమ్లాలోని ప్రెస్‌ క్లబ్‌లో ఓ పాత్రికేయుడు రచించిన ‘పునర్వాస్‌’ అనే  హిందీ నవలను ఆ విష్కరించారు. ఈ సందర్భంగా అనుపమ్‌ ఖేర్‌ మాట్లాడుతూ.. కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని గత 50 ఏళ్లుగా దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే, 2019లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇలాంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయని వ్యాఖ్యానించారు. 

కానీ, ఇటీవల కేంద్రపాలిత ప్రాంతంలో ముష్కరులు మళ్లీ కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. దేశభక్తులుగా ఉన్న ముస్లింలనూ వారు చంపేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, ఈ ఏడాది విడుదలైన చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం తర్వాత లక్షిత హత్యలు పెరిగాయని కొందరు భావిస్తున్నారని.. కానీ తాను మాత్రం అలా అనుకోవడంలేదన్నారు.

కశ్మీరీ పండిట్‌ల జీవితంపై బాలీవుడ్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. 1990లలో జమ్మూ-కశ్మీర్‌లో చేలరేగిన తీవ్రమైన ఉగ్రవాదంలో పండిట్స్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆ దారుణాలు చూడలేక ఎంతోమంది సొంతూరుని వదిలిపెట్టి కట్టుబట్టలతో వలస వెళ్లిపోయారు. ఆ కన్నీటి వెతల రూపమే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని