Anupam Kher: టాలెంట్‌ కంటే హెయిర్‌ స్టైల్‌ ముఖ్యమని అప్పుడర్థమైంది: అనుపమ్‌

‘త్రిమూర్తులు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌. తన కొత్త చిత్రం ప్రచారంలో కెరీర్‌ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

Published : 06 Feb 2023 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలెంట్‌ కంటే హెయిర్‌ స్టైల్‌కే అధిక ప్రాధాన్యం ఉంటుందని తన సినీ కెరీర్‌ ప్రారంభంలో తెలుసుకున్నట్టు ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher) చెప్పారు. తన కొత్త చిత్రం ‘శివ్‌ శాస్త్రి బల్బోవా’ (Shiv Shastri Balboa) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ‘‘దిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (ఎన్‌. ఎస్‌. డి) నుంచి నేను గోల్డ్ మెడల్‌ అందుకున్నా. సినీ నటుడుకావాలనే కాంక్షతో ముంబయి చేరుకున్నా. 20 ఏళ్ల వయసున్న నాకు అప్పటికే కొద్దిగా బట్టతల వచ్చింది. అవకాశాల కోసం మూడేళ్లపాటు చెప్పులు అరిగేలా తిరిగా. ఆ ప్రయాణంలో టాలెంట్‌ కంటే హెయిర్‌ స్టైల్‌ ముఖ్యమని అర్థమైంది. ప్రాక్టికల్‌గా ఆలోచించి ఏ చిన్న వేషం వచ్చినా చేయాలని నిర్ణయించుకున్నా. ఆ మాటపై నిలబడిన నేను దాదాపు రెండు దశాబ్దాల కాలం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిపోయా. నటుడిగా అనుభవం గడించాను కాబట్టి కథాబలం ఉన్న సినిమాల్లోనే నటించాలనుకుని, రాత్రీపగలు తేడా లేకుండా మరో 20 ఏళ్లకిపైగా కష్టపడ్డా. కొందరు నిర్మాతలు రూ. 5000 మాత్రమే ఇవ్వగలమనేవారు. అయినా నేను కాదనలేదు. కానీ, ప్రస్తుతం మార్పుకోరుకుంటున్నా. ఏదైనా సినిమాలో నటించాలంటే ముందు నాకు కథ నచ్చాలి. ఆ తర్వాత నా పాత్ర బాగుండాలి. డబ్బు కూడా ముఖ్యమే’’ అని అనుపమ్‌ వివరించారు.

1987లో వచ్చిన ‘త్రిమూర్తులు’ సినిమాతో అనుపమ్‌ టాలీవుడ్‌కు పరిచయమ్యారు. కొన్నేళ్ల విరామం అనంతరం 2022లో వచ్చిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao)లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేసిన ఈయన తమిళం, మలయాళం, బెంగాలీ, పంజాబీ, ఇంగ్లిష్‌, చైనీస్‌ భాషల్లోనూ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని