Karthikeya 2: అందుకే ‘కార్తికేయ 2’ ప్రచారంలో పాల్గొనడం లేదు: అనుపమ

తాను హీరోయిన్‌గా నటించిన ‘కార్తికేయ 2’ సినిమా ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదో అనుపమ పమమేశ్వరన్‌  తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా తన పరిస్థితిని వివరించారు.

Published : 02 Aug 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను హీరోయిన్‌గా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమా ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదో అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా తన పరిస్థితిని వివరించారు. ‘‘ప్రస్తుతం నేను రాత్రీపగలూ అనే తేడా లేకుండా రెండు సినిమాల చిత్రీకరణలో తలమునకలై ఉన్నా. ఇతర ఆర్టిస్టులతో నేను కలిసి నటించాల్సిన ఈ షెడ్యూల్‌ కొన్నాళ్ల క్రితమై ఖరారైంది. అలాగే ‘కార్తికేయ 2’ సినిమా విడుదల విషయంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. దాంతో నేనిప్పుడు ఈ చిత్ర ప్రచారానికి రాలేకపోతున్నా. నా పరిస్థితిని మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అని అనుపమ పరమేశ్వరన్‌ పేర్కొన్నారు. ఎంతగానో కష్టపడి తెరకెక్కించిన ‘కార్తికేయ 2’ చిత్ర బృందంపై అనుపమ ప్రేమను కురిపించారు. హీరో నిఖిల్‌ను ప్రత్యేకంగా కొనియాడారు.

నిఖిల్‌ (Nikhil Siddharth) హీరోగా రూపొందిన చిత్రమే ‘కార్తికేయ 2’. ద్వారకా నగర రహస్యాన్ని ఛేదించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకుడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కార్తికేయ’కు ఇది సీక్వెల్‌. ఈ పాన్‌ ఇండియా సినిమా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు సినిమాను దగ్గర చేసేందుకు చిత్ర బృందం విభిన్న రకాలుగా ప్రచారం చేస్తోంది. వీటిల్లో కథానాయకుడు నిఖిల్‌ మాత్రమే కనిపించడంతో అనుపమ రావట్లేదేంటనే ప్రశ్నలు సినీ అభిమానుల్లో ఉత్పన్నమయ్యాయి. నిఖిల్‌- అనుపమ కాంబోలో తెరకెక్కిన ‘18 పేజెస్‌’ (18 Pages) సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు, ‘బటర్‌ఫ్లై’ (Butterfly) అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో అనుపమ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని