Updated : 15 Aug 2022 07:02 IST

Anupama Parameshwaran: ఏ పాత్ర చేసినా సవాల్‌ ఉండాలి!

‘‘అవకాశం వచ్చింది కదాని ఏదొకటి చేసేయాలని తొందర నాకు లేదు. ఏం చేసినా మంచి కథలే చేయాలనుకుంటున్నా. గుర్తుండిపోయే పాత్రలే పోషించాలనుకుంటున్నా’’ అంది నటి అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameshwaran). ఆమె.. నిఖిల్‌ (Nikhil) జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ2’ (Karthikeya 2). ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా చందు మొండేటి తెర కెక్కించిన సినిమా ఇది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది అనుపమ.

స్వాతంత్య్ర వేడుకలు అనగానే మీకు గుర్తొచ్చే చిన్నప్పటి జ్ఞాపకాలేంటి?
‘‘పిల్లలందరం కలిసి జెండాలు పట్టుకుని తిరిగిన రోజులు గుర్తొస్తాయి. మా నాన్నకు పొన్నక్కు అని ఓ చిన్న స్కూటీ ఉండేది. దాని హ్యాండిల్‌కు టేప్‌తో ఓ జెండా కట్టుకుని స్కూల్‌కు వెళ్లేవాళ్లం. అలా వెళ్తుంటే భలే గర్వంగా అనిపించేది’’.

‘కార్తికేయ2’ ఫలితాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
‘‘సినిమా చూసిన వారంతా చాలా బాగుందని చెబుతున్నారు. వారి మాటలు వింటుంటే సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను పోషించిన ముగ్ధ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అది నాకు మంచి ఎనర్జీని అందిస్తోంది. నా పరిచయ సన్నివేశాలు చూసి.. అందరూ జేమ్స్‌బాండ్‌ టైప్‌లో ఎంట్రీ ఇచ్చావంటున్నారు. అదంతా కాలభైరవ తన నేపథ్య సంగీతంతో చేసిన మ్యాజిక్‌’’.

ఈ కథలో ఆకర్షించిన అంశాలేంటి?
‘‘పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు కాకుండా కొత్తగా ఇంకేదన్నా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దర్శకుడు చందు నాకీ కథ వినిపించారు. ఈ స్క్రిప్ట్‌ వింటున్నప్పుడే చాలా ఎగ్జైట్‌ అయ్యి సినిమా చేద్దామని నిర్ణయించుకున్నా. ఆధ్యాత్మికత, దైవం వంటి   విషయాల్లో కార్తికేయ పాత్రకు ఉన్నట్లే నాకు చాలా ప్రశ్నలున్నాయి. వాటిలో చాలా వాటికి ఈ కథ ద్వారా నాకు సమాధానాలు దొరికాయి. నా ముగ్ధ పాత్ర తెరపై ఎలా కనిపించిందో.. నిజ జీవితంలో నేనూ అలాగే కనిపించేందుకు ఇష్టపడతా. ఇందులోని కృష్ణతత్త్వం కాన్సెప్ట్‌ బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా కోసం నాకు వచ్చిన కొన్ని ప్రాజెక్టులనూ వదులుకున్నా’’.

నటిగా ఓ కంఫర్ట్‌ జోన్‌లో ఉండటాన్ని ఇష్టపడతారా? ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపుతారా?
‘‘కంఫర్ట్‌ జోన్‌లో పని చేయడమంటే చాలా బోరింగ్‌గా ఉంటుంది. ప్రయోగాలే చేయాలి. ఏ పాత్ర చేసినా అందులో ఓ సవాల్‌ ఉండాలి. దర్శకుడు రీటేక్స్‌ అడిగినప్పుడే నాకు చాలా నచ్చుతుంది. ఒక ఆర్టిస్ట్‌గా ఎన్ని భాషల్లో కుదిరితే అన్ని భాషల్లో నాకు నటించాలని ఉంది. ఇప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న హద్దులు చెరిగిపోయాయి. ఇప్పుడంతా ఇండియన్‌ సినిమా’’.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయింది. మహిళా సాధికారిత విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
‘‘మహిళలు అన్ని రకాలుగా సాధికారత సాధించారు. ప్రత్యేకంగా మళ్లీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పడం వల్లే ఇంకా వారు వెనుకబడి ఉన్నారనే భావన కలుగుతోంది. ఇప్పుడు మహిళలు.. మగవారితో సమానంగా ముందుకు వెళ్తున్నారు. వారు ఓవైపు ఇంట్లో పనులు చేసుకుంటూనే..  వృత్తిలోనూ రాణిస్తున్నారు. మగవాళ్లు అలా కాదు.. పని చేసి ఇంటికి రాగానే.. ‘బాగా అలిసిపోయాం టీ పెట్టి, పట్టుకురా’ అని చెప్పి పడుకుంటారు. నాకు తెలిసి సాధికారత మహిళలకు వచ్చింది, మగవాళ్లకే రాలేదనిపిస్తుంది (నవ్వుతూ)’’.


* ‘‘ప్రస్తుతం నేను చేసిన ‘18 పేజెస్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘బటర్‌ ఫ్లై’ అనే మరో చిత్రం త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. తెలుగులో రెండు కథలకు సంతకాలు చేశా. వీటిలో ఓ నాయికా ప్రాధాన్య చిత్రమూ ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నా. త్వరలో వాటి వివరాలు అధికారికంగా తెలియజేస్తా’’. 

* ‘‘హిట్.. ప్లాప్‌లను దృష్టిలో పెట్టుకోకుండా మంచి సినిమా చేస్తున్నామనే నమ్మకంతో అందరం కష్టపడ్డాం. ఇప్పుడా నమ్మకం నిజమైంది. దీనికోసం రకరకాల వాతావరణాల్లో చిత్రీకరణ జరిపాం. ఒకరోజు అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతంలో చిత్రీకరణ జరిపితే.. మరో రోజు మైనస్‌ డిగ్రీ సెల్సియస్‌లోనూ పనిచేశాం. చాలా కొత్త అనుభవమిది’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని