Butterfly Review: రివ్యూ: బటర్‌ ఫ్లై

Butterfly Review: అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్రలో నటించిన ‘బటర్‌ఫ్లై’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 29 Dec 2022 16:58 IST

Butterfly Review; చిత్రం: బటర్‌ఫ్లై; నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, నిహాల్, భూమిక, రావు రమేష్, ప్రవీణ్, ‘రచ్చ’ రవి, ప్రభు, రజిత, ‘వెన్నెల’ రామారావు, మేఘన, మాస్టర్ దేవాన్షు, బేబీ ఆద్య తదితరులు; సంగీతం: అర్విజ్, గిడియన్ కట్టా; మాటలు: దక్షిణ్ శ్రీనివాస్; ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి; నిర్మాతలు: రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్ళూరి, ప్రదీప్ నల్లమెల్లి; కథ, కథనం, దర్శకత్వం: గంటా సతీష్ బాబు; విడుదల: డిస్నీ+హాట్‌స్టార్‌

ప్రస్తుతం థియేటర్‌లో సినిమాలను విడుదల చేసే అవకాశం ఉన్నా, పలు చిత్రాలు ఓటీటీ వేదికగా నేరుగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో అలా వస్తున్న సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది. కథానాయికగా తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్‌. ఆమె కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘బటర్‌ప్లై’. తాజాగా ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా నేరుగా ఓటీటీలో విడుదలైంది. మరి ఈ సినిమా కథేంటి? (Butterfly Review) అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) పాత్ర ఎలా సాగింది?

కథేంటంటే: వైజయంతి (భూమిక) ప్రముఖ లాయర్‌. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే, చెల్లెలు గీత (అనుపమ పరమేశ్వరన్‌)ను పెంచి పెద్ద చేస్తుంది. అక్కలా కాకుండా అమ్మలా గీత మంచి, చెడులను చూస్తుంటుంది. వైజయంతికి మరో లాయర్‌ (రావు రమేశ్‌)తో వివాహం జరుగుతుంది. అయితే, అతని ప్రవర్తన కారణంగా ఇద్దరు పిల్లలు, చెల్లెలుతో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓ పరీక్ష రాయడం కోసం వైజయంతి తన పిల్లల్ని గీతకు అప్పగించి దిల్లీ వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అవుతారు. ఇంతకీ ఆ కిడ్నాప్‌ ఎవరు చేశారు? వారి నుంచి పిల్లల్ని రక్షించడానికి గీత చేసిన ప్రయత్నాలు ఏంటి? (Butterfly movie Review)ఈ క్రమంలో గీత ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి?చివరకు కిడ్నాపర్‌లను గీత ఎలా పట్టుకుంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: కిడ్నాప్‌, హత్యల మిస్టరీ నేపథ్యంలో అన్ని భాషల్లో పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అలాంటి కోవకు చెందిన చిత్రమే ‘బటర్‌ఫ్లై’ అయినా, కాస్త విభిన్నంగా ఉంది. దర్శకుడు సతీష్‌బాబు సందేశాన్ని మేళవించి కిడ్నాప్‌ మిస్టరీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ఫర్వాలేదనిపించారు. వైజయంతి, గీత పాత్రలను పరిచయం చేసుకుంటూ సినిమా ఆరంభించిన దర్శకుడు మెయిన్‌ ప్లాట్‌కు వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఎప్పుడైతే పిల్లలు అపహరణకు గురవుతారో అప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. (Butterfly Review) నగర జీవనం, ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లలో ఉండే కల్చర్‌ గురించి దర్శకుడు చూపించిన విధానం నేటి పరిస్థితికి చక్కగా అద్దం పడుతుంది. పక్కవాడికి కష్టం వస్తే, సరిగ్గా స్పందించటం కూడా చేతకాని వారు ఎంతో మంది మన మధ్యే బతుకుతున్నారని సెటైరికల్‌గా ఇందులో చూపించారు. కిడ్నాపర్‌ డిమాండ్‌ చేసిన డబ్బులు తెచ్చేందుకు గీత పడే కష్టాన్ని, ఎదుటివారి ఇబ్బందిని ఆసరాగా చేసుకుని, అవసరాలు తీర్చుకునే వ్యక్తుల మనస్తత్వాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. గీతకు ప్రేమికుడు విశ్వ (నిహాల్‌) ఉన్నా, లవ్‌ ట్రాక్‌ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్‌ అంశాలపైనే దృష్టి పెట్టడం బాగుంది. పిల్లలు కావాలంటే డబ్బులు ఇవ్వడంతో పాటు, కిడ్నాపర్‌ పెట్టే షరతులు, వాటిని అందుకోలేక గీత పడే ఇబ్బందులతో కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. (Butterfly movie Review) కిడ్నాప్‌ చేసింది ఎవరో ప్రేక్షకుడికి కాస్త ముందే చెప్పేసి, వాళ్లను గీత ఎలా పట్టుకుంటుందన్న ఉత్కంఠతో పతాక సన్నివేశాలను నడిపిన తీరు బాగుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఒకట్రెండు ట్విస్ట్‌లు మెప్పిస్తాయి. ఇక చివరల్లో అనుపమ పరమేశ్వరన్‌ నటన హైలైట్‌. మధ్య మధ్యలో వచ్చే పాటలు కాస్త కథాగమనాన్ని సాగదీసినట్టు అనిపిస్తాయి. మిస్టరీ థ్రిల్లర్‌లు ఇష్టపడేవారికి ‘బటర్‌ఫ్లై’ మంచి ఆప్షన్‌. కుటుంబమంతా కూడా కలిసి చూసేలా సినిమాను తీర్చిదిద్దారు. ఎలాంటి అసభ్యతకు సినిమాలో తావు లేదు.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమాలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి చివరి వరకూ గీత పాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ కనిపిస్తూనే ఉంటుంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. పిల్లల్ని కాపాడలేక భావోద్వేగానికి గురయ్యే సన్నివేశాల్లో అనుపమ నటన బాగుంది. క్లైమాక్స్‌లో ఆమె నటనే హైలైట్‌. భూమిక కనిపించేది కొద్దిసేపే. అనుపమను ప్రేమించే వ్యక్తిగా నిహాల్ చక్కగా నటించారు. రావు రమేష్, ‘వెన్నెల’ రామారావు, ‘రచ్చ’ రవి, పనిమనిషి బేబి  తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. అర్విజ్‌ నేపథ్య సంగీతం ఓకే. దర్శకుడు సతీష్‌బాబు మిస్టరీ థ్రిల్లర్‌గా ‘బటర్‌ఫ్లై’ని తీర్చిదిద్దడంలో పర్వాలేదనిపించారు. పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారేమోననిపిస్తుంది. కథనాన్ని ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. బడ్జెట్‌ పరిమితులకు లోబడి సినిమాను తీర్చిదిద్దిన విధానం బాగుంది.

బలాలు: + అనుపమ పరమేశ్వరన్‌ నటన; + ద్వితీయార్ధం; + పతాక సన్నివేశాలు

బలహీనతలు: - ఆరంభ సన్నివేశాలు; - అక్కడక్కడా నెమ్మదించిన కథనం

చివరిగా: మిస్టరీ ‘బటర్‌ఫ్లై’ బాగుంది(Butterfly Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని