Anupama: తొలి పోస్టర్‌ జ్ఞాపకాలు

తొలి జ్ఞాపకాలు ఎవరికైనా ప్రత్యేకమే. సినీ తారల విషయంలో మొదటి ఆడిషన్‌.. మొదటి షూట్‌.. తొలిసారి తెరపై తమని తాము చూసుకున్న రోజు... ప్రతిదీ మధుర జ్ఞాపకమే. ఇవి నాకు మరింత ప్రత్యేకమంటోంది నటి అనుపమ పరమేశ్వరన్‌.

Updated : 20 Apr 2022 14:12 IST

తొలి జ్ఞాపకాలు ఎవరికైనా ప్రత్యేకమే. సినీ తారల విషయంలో మొదటి ఆడిషన్‌.. మొదటి షూట్‌.. తొలిసారి తెరపై తమని తాము చూసుకున్న రోజు... ప్రతిదీ మధుర జ్ఞాపకమే. ఇవి నాకు మరింత ప్రత్యేకమంటోంది నటి అనుపమ పరమేశ్వరన్‌. ముఖ్యంగా తనని తాను మొదటిసారి పోస్టర్‌పై చూసుకున్న రోజును   ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చింది. ‘‘నేను ఇండస్ట్రీలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ‘ప్రేమమ్‌’ని ప్రారంభించడానికి కొన్నిరోజుల ముందు నివిన్‌ పౌలీ తన ఫేస్‌బుక్‌లో క్యాస్టింగ్‌ కాల్‌ పెట్టారు. అది చూసి నా స్నేహితులు నా ఫొటోలు పంపారు. అవి నచ్చడంతో నన్ను పిలిచి.. రెండు దఫాలుగా ఆడిషన్స్‌ చేశారు. నేనిచ్చిన తొలి ఆడిషన్‌ అదే. నిజానికి అప్పుడు నాకు వాళ్లొక డైలాగ్‌  ఇస్తే.. టెన్షన్‌ వల్ల అసలు చెప్పలేకపోయా. ఇంటికి వచ్చాక చాలా బాధపడ్డా. అవకాశం చేజారినట్లే అనుకున్నా. కానీ, రెండు వారాల తర్వాత మళ్లీ పిలుపొస్తే వెళ్లా. అప్పుడు మాత్రం వాళ్లిచ్చిన డైలాగ్‌ను పర్‌ఫెక్ట్‌గా చెప్పా. దాంతో ఆ సినిమాకి ఎంపికయ్యా. ఇక సినిమా విడుదలకు ముందు మా ఊరి థియేటర్లో నా తొలి పోస్టర్‌ వచ్చింది. అది చూసి నాన్న సంతోషంగా ఫోన్‌ చేశారు. ‘నీ పోస్టర్‌ మన థియేటర్లో వేశారు. వెళ్లి చూడండి’ అని. అప్పటికి నేను హాస్టల్‌లో ఉంటున్నా. నాన్న ఆ మాట చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ పోస్టర్‌ చూసుకుంటానా? అని ఆతృతగా ఎదురు చూశా. వారం తర్వాత సెలవు దొరకడంతో ఊరొచ్చి.. ముందు ఆ థియేటర్‌కు వెళ్లి నా పోస్టర్‌ చూసుకున్నా. నా  జీవితంలో మర్చిపోలేని క్షణాలవి’’ అంటూ ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది అనుపమ. ప్రస్తుతం ఆమె నటించిన ‘బటర్‌ఫ్లై’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని