నా కూతురిని బెదిరించారు.. దాంతో నాకు గుండెపోటు వచ్చింది..: స్టార్‌ డైరెక్టర్‌

తన కూతురికి వచ్చిన బెదిరింపుల కారణంగా ఒత్తిడికి గురయ్యానని.. దీంతో తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెలిపారు.

Updated : 28 Nov 2022 13:45 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌లలో ఒకరు అనురాగ్‌ కశ్యప్(Anurag Kashyap)‌. వైవిధ్యభరితమైన కథలను తెరకెక్కిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న దారుణమైన సంఘటనల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తన కూతురికి వచ్చిన అత్యాచార బెదిరింపుల కారణంగా తాను మూడేళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పారు. ఆ ఒత్తిడి కారణంగా గుండెపోటుకు గురయినట్లు వివరించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో అనురాగ్‌ కశ్యప్‌ మాట్లాడారు.

‘‘పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కొందరు నాపై, నా కూతురిపై విమర్శలు చేశారు. ఆమెను అత్యాచారం చేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. తను అలా బాధపడడం నేను చూడలేక డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ సమయంలో నాకు అన్ని వదిలేసి విదేశాలకు వెళ్లడమే మంచిదనిపించింది. 2019లో ట్విటర్‌ అకౌంట్‌ను వాడడం కూడా ఆపేశాను. కుటుంబంతో కలిసి పోర్చుగల్‌ వెళ్లిపోయాను. కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్‌ కోసం తిరిగి భారత్‌కు వచ్చాను. ఇక అదే సమయంలో కొవిడ్‌ వచ్చింది. నేను తీసే చిత్రాలు ఆలస్యం అయ్యాయి. వెబ్‌సిరీస్‌లు ఆగిపోయాయి. ఈ ఒత్తిడి అంతా నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో గుండెపోటు వచ్చింది. కానీ వీటన్నింటినీ ఎదుర్కొన్నాను. ప్రస్తుతం పనిలో బిజీగా ఉన్నాను’’ అని తెలిపారు అనురాగ్‌.  ఈ  దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ‘మొహబ్బత్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు