RRR: ఆస్కార్‌కు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. నామినేట్‌ అయ్యే ఛాన్స్‌ ఎంతంటే?

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఓటీటీలో

Published : 17 Aug 2022 01:25 IST

హైదరాబాద్‌: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఓటీటీలో విడుదలైన తర్వాత హాలీవుడ్‌ నటులు, నిపుణుల నుంచి చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా వెరైటీ మ్యాగజైన్‌ సైతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని రాసుకొచ్చింది. దీనిపై దర్శక-నటుడు అనురాగ్‌ కశ్యప్‌ స్పందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌కు 99శాతం నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

తన కొత్త చిత్రం ‘దోబారా’ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..  ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లభిస్తే, ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పోటీ పడే అవకాశం ఉందన్నారు. ‘‘ఆర్ఆర్‌ఆర్‌’చిత్రాన్ని వారు పరిగణనలోకి తీసుకుంటే ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో పోటీ పడే ఐదు చిత్రాల్లో ఒకటి కచ్చితంగా అవుతుంది. ముఖ్యంగా నా దగ్గర హాలీవుడ్‌ గురించి మాట్లాడేవాళ్లకు ఇది చెబుతున్నా. ఈ చిత్రంతో రాజమౌళి అనే కొత్త ఫిల్మ్‌ మేకర్‌ను వాళ్లు చూస్తారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి నచ్చింది. మార్వెల్‌ మూవీ కన్నా ఇది ఎందులోనూ తీసిపోదు. అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు అక్కడి వారిని కట్టిపడేశాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇక 2022లో విడుదలైన ఉత్తమ చిత్రాల జాబితానూ స్క్రీన్‌ క్రష్‌ సినీ వెబ్‌సైట్‌ విడుదల చేయగా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అందులోనూ చోటు సంపాదించుకుంది.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ను రాజమౌళి తెరకెక్కించారు. అలియాభట్‌, ఓలివియా మోరిస్‌ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక జీ5, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీల వేదికగా ప్రపంచం వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. మరోవైపు ‘ఆర్ఆర్‌ఆర్’కు సంబంధించి ఓ ఆసక్తికర వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. హాలీవుడ్‌ చిత్రాలను పోలుస్తూ చేసిన ఎడిటింగ్‌ నవ్వులు పూయిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని