Anushka Sharma: కాపీరైట్‌ ఆమెదే.. అనుష్క శర్మ పన్ను కట్టాల్సిందే..!

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ తన స్టేజ్‌ షోల ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారని, ఆ వీడియోలకు కాపీరైట్‌ ఆమెదే కాబట్టి దానికి పన్ను చెల్లించాల్సిందేనని సేల్స్‌ ట్యాక్స్ విభాగం తెలిపింది.

Updated : 29 Mar 2023 20:44 IST

కోర్టుకు తెలిపిన సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం

ముంబయి: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ నటి అనుష్క శర్మ (Anushka Sharma) పన్ను వివాదంపై బాంబే హైకోర్టు (Bombay High Court)లో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై తమ స్పందన తెలియజేసిన సేల్స్‌ ట్యాక్స్‌ (Sales Tax) విభాగం.. ఆమె తన స్టేజ్‌ ప్రదర్శనలతో ఆదాయం పొందుతున్నారని పేర్కొంది. అందువల్ల ఆమె పన్ను చెల్లించాల్సిందేనని తెలిపింది. (Anushka Sharma Tax Issue)

2012-16 మధ్య ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయి పడిన అమ్మకపు పన్ను చెల్లించాలంటూ సేల్స్‌ ట్యాక్స్‌ (Sales Tax) డిప్యటీ కమిషనర్‌ పంపిన నోటీసులను సవాల్‌ చేస్తూ అనుష్క శర్మ (Anushka Sharma) బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వివిధ సందర్భాల్లో నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం మేరకు కొన్ని అవార్డు కార్యక్రమాల్లోనూ ప్రదర్శనలను ఇస్తానని, అలాగని నిర్మాతలకు విధిస్తున్న శ్లాబులో పన్ను చెల్లించాలంటే ఎలాగని ఆమె ప్రశ్నించారు. వివిధ కార్యక్రమాల్లో నటించినంత మాత్రాన ఆ వీడియోల కాపీరైట్స్‌ తనకు రావని, కాపీరైట్స్‌ అన్నీ నిర్మాతకే ఉంటాయని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. దీనిపై వివరణ ఇవ్వాలని సేల్స్‌ ట్యాక్స్‌ను ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. తన ప్రదర్శనల వీడియోల కాపీరైట్‌కు అనుష్క (Anushka Sharma)నే తొలి యజమాని అని, నిర్మాతల నుంచి కొంత మొత్తం తీసుకుని ఆ కాపీరైట్‌ను ఆమె వారికి బదిలీ చేశారని పేర్కొంది. అందువల్ల అది విక్రయం కిందకే వస్తుందని తెలిపింది. ‘‘కాపీరైట్‌ చట్టం కిందే అనుష్క తన ప్రదర్శనలు ఇస్తున్నారు. తన ప్రతి ప్రదర్శనకు కాపీరైట్‌ ఉంటుంది. ఒప్పంద సేవల ద్వారా ఆమె తన ప్రదర్శనలకు ఆదాయం పొందుతున్నారు. అందువల్ల చట్టం ప్రకారం.. తన వీడియోల కాపీరైట్‌కు ఆమే తొలి యజమాని. అంతేగాక, తన కాపీరైట్స్‌ను వాణిజ్య అవసరాలకు ఆమె క్లయింట్లకు బదిలీ చేస్తున్నారు. దాని నుంచి కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఇది విక్రయం కిందకే వస్తున్నందున.. ఆ పన్నులు చెల్లించాల్సిన బాధ్యత ఆమెదే’’ అని సేల్స్‌ ట్యాక్స్‌ విభాగం కోర్టుకు వివరించింది.

ఈ అఫిడవిట్‌ను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం.. దీనిపై గురువారం విచారణ చేపడుతామని వెల్లడించింది. 2012-13 మదింపు సంవత్సరానికి గానూ రూ.1.2కోట్లు, 2013-14 మదింపు సంవత్సరానికి గానూ రూ.1.6కోట్లు విక్రయ పన్ను చెల్లించాలని సేల్స్‌ ట్యాక్స్‌ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపైనే నటి (Anushka Sharma) కోర్టును ఆశ్రయించారు. సినిమాల్లో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ ఎవరైనా నటిస్తే వాళ్లు నటులు మాత్రమే అవుతారని, నిర్మాతలు కాబోరని ఆమె తెలిపారు. నటులకు వర్తించే శ్లాబులోనే పన్ను వేయాలని ఆమె పిటిషన్‌లో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని