Anushka Shetty: అనుష్క లుక్‌పై ప్రచారం.. ఆందోళనలో అభిమానులు

సుమారు రెండేళ్ల బ్రేక్‌ తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు అగ్రకథానాయిక అనుష్క శెట్టి(Anushka). యూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఓ విభిన్నమై కుటుంబ కథా చిత్రంలో ఆమె నటిస్తోన్న ...

Updated : 03 Aug 2022 17:01 IST

హైదరాబాద్‌: సుమారు రెండేళ్ల బ్రేక్‌ తర్వాత వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు అగ్రకథానాయిక అనుష్క శెట్టి(Anushka). యూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఓ విభిన్న కుటుంబ కథా చిత్రంలో ఆమె నటిస్తోన్న విషయం తెలిసిందే. నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘సైజ్‌ జీరో’(Size Zero) చిత్రంలో మాదిరిగా ఈ సినిమాలో అనుష్క కాస్త బొద్దుగా కనిపించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్‌ చేయడంతో దర్శకుడు మహేశ్‌.పి చెప్పినట్లు అనుష్క శరీరాకృతిని మార్చుకుంటున్నారని.. ఈ మేరకు ఆమె బరువు పెరిగే పనిలో పడిందని, అందుకే సోషల్‌మీడియాలోనూ తన ఫొటోలు షేర్‌ చేయడం లేదని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు దర్శనమిస్తున్నాయి. ఈ వార్తలు చూసిన స్వీటీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వృత్తిపట్ల ఆమెకున్న అంకితభావాన్ని కొంతమంది మెచ్చుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం బరువు అస్సలు పెరగొద్దని సూచిస్తున్నారు.

పాత్రలు, నటనతోపాటు శరీరాకృతి విషయంలోనూ సాహసాలు చేసేందుకు అనుష్క ముందుంటారు. కెరీర్‌ ఆరంభం నుంచి నాజూగ్గా కనబడిన ఆమె 2015లో విడుదలైన ‘సైజ్‌ జీరో’ కోసం అమాంతం బరువు పెరిగారు. బొద్దుగా ఉండే మహిళలు సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు?అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈసినిమా కోసం స్వీటీ సుమారు 20 కేజీల బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. అయితే, ఈ సినిమా అనంతరం బరువు తగ్గి మళ్లీ సాధారణ లుక్‌లోకి వచ్చేందుకు అనుష్క ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని