Cinema tickets: జీవో నెం.35 రద్దు అందరికీ వర్తిస్తుంది.. కానీ,

ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్‌ ధరల విషయమై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది.

Updated : 20 Dec 2021 18:28 IST

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా టికెట్‌ ధరల విషయమై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. టికెట్‌ రేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తూ జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. జీవో నెం.35 రద్దు రాష్ట్రంలోని అన్ని థియేటర్‌లకు వర్తిస్తుందని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. గత విచారణ సందర్భంగా పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని, రేట్లు నిర్ణయించుకునే అధికారం వారికి మాత్రమే ఉంటుందని హోంశాఖ తెలిపిన నేపథ్యంలో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై సోమవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

ఈ సందర్భంగా టికెట్‌ ధరల విషయమై గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అన్ని థియేటర్‌లకు వర్తిస్తుందని ఏజీ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. అన్ని వర్గాలకూ తక్కువ ధరకు వినోదాన్ని అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఏజీ అన్నారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల వల్ల చాలా చోట్ల టికెట్‌ రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునే అవకాశం ఉంటుందని ఏజీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇక అంశంపై కమిటీ ఏర్పాటు చేశామని, అయితే కమిటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. మరి ప్రభుత్వ వాదనలతో కోర్టు ఏకీభవిస్తుందా? లేదా సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును యథాతథంగా కొనసాగిస్తుందా? అనేది చూడాలి. మరోవైపు జీవో నెం.35 రద్దు అయినా, టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం పొందాలంటే థియేటర్‌ యజమానులు జాయింట్‌ కలెక్టర్ల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని