AR Rahman: ‘ఆస్కార్‌కు అర్హత లేని చిత్రాలు’.. ఏఆర్‌ రెహమాన్‌ కామెంట్స్‌

‘ఆస్కార్‌’ ఎంట్రీ సినిమాలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.

Published : 18 Mar 2023 01:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని భారతీయ చిత్రాలు ‘ఆస్కార్‌’ (Oscar) వరకూ వెళ్లి విజయం దక్కించుకోలేక వెనుదిరుగుతున్నాయని.. అర్హతలేని వాటిని పంపిస్తున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్‌. రెహమాన్‌ (AR Rahman) అసహనం వ్యక్తం చేశారు. ఆ విషయంలో బాధగా ఉన్నా ఏం చేయలేమన్నారు. తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా సంగీత దిగ్గజం ఎల్‌. సుబ్రహ్మణంతో నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ చిట్‌చాట్‌లో ముఖ్యంగా సంగీత ప్రపంచంలో వచ్చిన మార్పులు గురించి చర్చించారు. మధ్యలో ఆస్కార్‌ ప్రస్తావన రాగా రెహమాన్‌ తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.

ఆయన ఏ చిత్రాన్ని ఉద్దేశించి అలా అన్నారో తెలీదు గానీ కొందరు నెటిజన్లు మాత్రం ఆయన కామెంట్లను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు  ఆపాదిస్తున్నారు. ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో భారత్‌ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అధికారికంగా ఎంపిక కాకపోవడం పట్ల రెహమాన్‌ ఆ కామెంట్స్‌ చేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి కాకపోయి ఉండొచ్చని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

ఈ ఏడాది నిర్వహించిన 95వ ఆస్కార్‌ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ విజేతగా నిలిచింది. రెహమాన్‌ గతంలో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికిగానూ బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (జయహో) విభాగాల్లో ఒకేసారి రెండు ఆస్కార్‌ అవార్డులు అందుకుని రికార్డు సృష్టించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని