Arjun Kapoor: ‘బాయ్‌కాట్‌’ ట్రెండ్‌.. మేము తప్పు చేశాం: అర్జున్‌ కపూర్‌

బాలీవుడ్‌ (Bollywood) చిత్రాలను వ్యతిరేకిస్తూ గత కొంతకాలం నుంచి సోషల్‌మీడియాలో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బీటౌన్‌ అగ్ర నటీ నటుల సినిమాలు విడుదలైన ప్రతిసారీ నెట్టింట ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది....

Published : 18 Aug 2022 02:06 IST

ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేసిన నటుడు

ముంబయి: బాలీవుడ్‌ (Bollywood) చిత్రాలను వ్యతిరేకిస్తూ గత కొంతకాలం నుంచి సోషల్‌మీడియాలో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బీటౌన్‌ అగ్ర నటుల సినిమాలు విడుదలైన ప్రతిసారీ నెట్టింట ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది. ఇలాంటి వాటి వల్లే హిందీ చిత్ర పరిశ్రమ పూర్వ వైభవాన్ని కోల్పోతోందని నటుడు అర్జున్‌ కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై ఆయన స్పందించారు.

‘‘బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై ఇంతకాలంగా పెదవి విప్పకుండా మేము తప్పు చేశాం. ఆ విషయంపై మేము సరిగ్గా దృష్టి సారించలేకపోయాం. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని కొంతమంది అవకాశంగా భావిస్తున్నారు. ‘మన టాలెంట్‌ గురించి మన సినిమా మాట్లాడుతుంది’.. అనే సిద్ధాంతాన్ని నమ్మడం వల్లే మేము సైలెంట్‌గా ఉన్నాం. ఇప్పటికే ఎంతో భరించాం. మా సహనాన్ని కొంతమంది చేతకానితనంగా భావించి.. బాయ్‌కాట్‌ ట్రెండ్‌ని అలవాటుగా మార్చుకున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఇష్టం వచ్చిన వార్తలు, హ్యాష్‌ట్యాగ్స్‌ సృష్టిస్తూ మాపై బురద జల్లుతున్నారు. ఇకనైనా నటీనటులందరూ ఒకే తాటిపైకి రావాలి. ఇలాంటి ట్రెండ్‌ని సృష్టిస్తోన్న వారిపై గట్టి చర్యలు తీసుకునేలా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని అర్జున్‌ కపూర్‌ అన్నారు.

ఇక, ఇటీవల విడుదలైన ఆమిర్‌ ఖాన్‌ - కరీనా కపూర్‌ల కొత్త సినిమా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ‘బాయ్‌కాట్‌’ ట్రెండ్‌లో చిక్కుకొన్న విషయం తెలిసిందే. గతంలో ఆమిర్‌ చేసిన వ్యాఖ్యలను ట్యాగ్‌ చేస్తూ ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ని బాయ్‌కాట్‌ చేయాలని పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. తాజాగా, ఆమిర్‌ చిత్రాన్ని సపోర్ట్‌ చేసినందుకు హృతిక్‌ రోషన్‌పై  కూడా సోషల్‌మీడియా యూజర్స్‌ విరుచుకుపడుతున్నారు. తమ తదుపరి టార్గెట్‌ హృతిక్‌ నటిస్తోన్న ‘విక్రమ్‌ వేద’ అని ట్వీట్స్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని