Ashish Vidyarthi: మా అబ్బాయికి ఆ విషయం చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డాం..: ఆశిష్‌ విద్యార్థి

ఇటీవల నిత్యం వార్తల్లో వినిపించిన పేరు ఆశిష్‌ విద్యార్థి (Ashish Vidyarthi). తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు.

Published : 04 Jun 2023 17:10 IST

హైదరాబాద్‌: ఇటీవల నటుడు ఆశిష్‌ విద్యార్థి (Ashish Vidyarthi) ఒక్కసారిగా వార్తల్లో వైరలయ్యారు. 57 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి ఆశిష్‌కు సంబంధించిన వార్తలు రోజుకోకటి నెట్టింట ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఆంగ్లమీడియా ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆశిష్‌ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. విడాకుల విషయం తన కుమారుడికి చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.

‘‘నేను, పీలూ (Piloo Vidyarthi)  ఇద్దరం మా అబ్బాయికి ఇలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకోలేదు. అలా అని మేమిద్దరం కలిసి ఉండలేం. గందరగోళానికి గురవుతూ ఒకే ఇంట్లో ఉన్నా.. మా విషయాన్ని మా అబ్బాయి ఆర్త్‌ (Arth) కనిపెట్టగలడు. అది తనపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని కలిసిరానప్పుడు మంచి వ్యక్తులు కూడా శత్రువులుగా మారతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకే ఇంట్లో ఉంటూ దానిని పరిష్కరించుకోవాలని చాలా మంది సలహాలు చెబుతుంటారు. కానీ అలాంటి వాటి వల్ల ఉపయోగం లేదని నా అభిప్రాయం. అందుకే మేము కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాక మా అబ్బాయికి విషయాన్ని చెప్పాం. అతడు మా కంటే గొప్పగా ఆలోచించాడు. మేము చెప్పింది వినగానే సరే అన్నాడు. మేము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు. ‘మీరు ఇలా కలిసి ఉండి ఇబ్బంది పడడం కంటే.. ఎవరికి వారు విడిగా ఉండడమే మంచిది’ అని చెప్పాడు. అతడు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాడు’’ అని ఆశిష్‌ విద్యార్థి తెలిపాడు. ఇక తన మొదటి భార్య పీలూ విద్యార్థితో ఆయన 22 ఏళ్లు కలిసి ఉన్నారు. రెండేళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తిన కారణంగా వీరిద్దరు స్నేహ పూర్వకంగా విడిపోయినట్లు ఇటీవల ఓ వీడియోలో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు