Hero movie review: రివ్యూ: హీరో
చిత్రం: హీరో; నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య తదితరులు; సంగీతం: జిబ్రాన్; ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్; కళ: ఏ రామాంజనేయులు; కూర్పు: ప్రవీణ్ పూడి; సంభాషణలు: కళ్యాణ్ శంకర్, ఏఆర్ ఠాగూర్; నిర్మాత : పద్మావతి గల్లా; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య; సంస్థ: అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్; విడుదల: 15-01-2022
ఈ సంక్రాంతికి మరో కొత్త ‘హీరో’ తెరకు పరిచయమయ్యారు. కృష్ణ కుటుంబం నుంచి వస్తున్న ఆ హీరోనే... అశోక్ గల్లా. మహేశ్‌బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు.. అశోక్. ఆయన్ని పరిచయం చేసే బాధ్యతని విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తున్న శ్రీరామ్ ఆదిత్యకి అప్పజెప్పారు. విడుదలైన ‘హీరో’ ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తించేలా ఉండటం, ప్రతీసారీ ఓ కొత్త రకమైన రుచుల్ని అందించే దర్శకుడు కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. అనుకోకుండా సంక్రాంతి బెర్తు దొరకడం ఈ సినిమాకి కలిసొచ్చిన మరొక విషయం. మరి అశోక్ ఎలా నటించాడు? శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం ఎలా ఉంది?
కథేంటంటే: సినిమా హీరో కావాలని కలలు కనే ఓ మధ్య తరగతి యువకుడు అర్జున్ (అశోక్ గల్లా). పక్కింటి అమ్మాయి సుబ్బు (నిధి అగర్వాల్)ని చూసి ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటారు. ఇంతలో అర్జున్ చేతికి ఓ కొరియర్ అందుతుంది. అందులో ఓ గన్ ఉంటుంది. ముంబయి మాఫియాకి చెందిన గన్ అది. ఆ తర్వాత మరో కొరియర్‌లో చంపమని చెబుతూ ఓ ఫొటో అందుతుంది. ఆ గన్‌ని, ఫొటోని అర్జున్‌కి పంపడానికి కారణమేమిటి? ఇంతకీ ఆ ఫొటోలో ఎవరున్నారు? ముంబయి మాఫియాకీ, అర్జున్‌కీ సంబంధమేమిటి?అర్జున్ హీరో అయ్యాడా?సుబ్బుని పెళ్లి చేసుకున్నాడా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ఓ కొత్త హీరోని పరిచయం చేస్తున్నప్పుడు... అది కూడా సినీ కుటుంబానికి చెందిన వారసుడు అన్నప్పుడు ఎక్కువగా అలవాటైన మాస్ కథలనో లేదంటే ప్రేమకథలనో ఎంచుకుంటుంటారు దర్శకులు. శ్రీరామ్ ఆదిత్య మాత్రం మరోసారి తన ప్రత్యేకతని ప్రదర్శిస్తూ, సినిమాలో అనిల్ రావిపూడి చెప్పినట్టుగా ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా ఆలోచించి కామెడీతో కూడిన ఓ కొత్త రకమైన కథని రాసుకున్నారు. అదే సమయంలో హీరో స్కిల్స్‌ని బయటపెట్టే అంశాలు కూడా ఇందులో ఉండటం మరింత ప్రత్యేకం. ఇదొక కొత్త రకమైన జోనర్ సినిమా అని చెప్పొచ్చు. ప్రేమ, మాఫియా నేపథ్యం, థ్రిల్లింగ్ అంశాలు, హ్యూమర్‌ని మేళవించి సినిమా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాని తీయడం మెప్పిస్తుంది. తొలి సగభాగం రేసీగా సాగే కథనంతో సినిమా చక్కటి వినోదాన్ని పంచుతుంది. హీరో పరిచయ సన్నివేశాలు మొదలుకొని, అతని ప్రేమకథ, ఆ తర్వాత గన్ చేతికందాక చోటు చేసుకునే మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలోనే కథని సాగదీసినట్టు అనిపిస్తుంది. మాఫియా నేపథ్యాన్ని మరీ సిల్లీగా మలచడం, సీఐపై జరిగిన ఫైరింగ్ కేసుని వదిలేయడంతో అప్పటిదాకా ఆసక్తికరంగా అనిపించిన సినిమా కాస్త గాడితప్పినట్టుగా అనిపిస్తుంది. మూల కథ మరీ పలచగా ఉండటంతో కథ అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది. అయితే కామెడీ మాత్రం చివరి వరకూ పండటం సినిమాకి కలిసొచ్చే విషయం. పతాక సన్నివేశాల్లో బ్రహ్మాజీ నేపథ్యంలో పండే కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు, సినిమా నేపథ్యమున్న కథ కావడంతో కృష్ణ, మహేష్‌బాబు ప్రస్తావన సినిమాలో చాలాచోట్ల వస్తుంది. ఆ సన్నివేశాలన్నీ కూడా అభిమానుల్ని మెప్పించేవే.
ఎవరెలా చేశారంటే: అశోక్ గల్లా ఉత్సాహంగా కనిపించాడు. తొలి సినిమానే అయినా కామెడీ పరంగానూ, డ్యాన్స్‌ల పరంగానూ ఆకట్టుకున్నాడు. ఇక లుక్స్ విషయానికొస్తే సినిమాలో రైట్ ప్రొఫైల్‌లో బాగుంటానని ఇందులో ఓ డైలాగ్ చెబుతాడు హీరో. ఆ డైలాగ్‌కి తగ్గట్టే హీరో కొన్ని యాంగిల్స్‌లో బాగా కనిపిస్తారు. నిధి అగర్వాల్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ, ఉన్నంతలో అందంగా కనిపించింది. ముద్దు సన్నివేశాల్లో మురిపించింది. జగపతిబాబు పాత్రలో కోణాలు ఆకట్టుకుంటాయి. నరేష్ అలవాటైన పాత్రలో కనిపించి నవ్వించారు. ఆరంభ సన్నివేశాల్లో ఆయన హంగామా మెప్పిస్తుంది. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్య నవ్వించారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో పాన్ ఇండియా అంటూ బ్రహ్మాజీ ఓ సీనియర్ హీరో పాత్రలో చేసిన హంగామా కడుపుబ్బా నవ్విస్తుంది. అక్కడే ఓ దర్శకుడి శైలిని పోలిన సన్నివేశాలు కూడా కామెడీని పంచుతాయి.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రిచర్డ్, సమీర్‌రెడ్డి కెమెరా పనితనం సినిమాకి ఓ ప్రధాన ఆకర్షణ. రచ్చ రవిని ఛేజ్ చేసే సన్నివేశాల్లో విజువల్స్, కొన్ని పాటల చిత్రీకరణ, ఆరంభ సన్నివేశాలు కెమెరా విభాగం పనితనంలో నాణ్యతని చాటిచెబుతాయి. మాటలు బాగున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఆలోచనలు కొత్తగా ఉంటాయనడానికి ఈ సినిమా మరో ఉదాహరణ. కాకపోతే ఆయన కథ విస్తృతి పరంగా చేసిన కసరత్తులు చాలలేదు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
+ హాస్యం
+ కథనం, కథా నేపథ్యం
+ ప్రథమార్ధం
బలహీనతలు
- సాగదీతగా అనిపించే ద్వితీయార్ధం
చివరిగా: సంక్రాంతికి వచ్చిన ఈ ‘హీరో’ నవ్విస్తాడు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట: ఈవో
-
Movies News
#NBK108: బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో.. ఇంట్రో బీజీఎం అదిరిందిగా!
-
Movies News
ఆ సినిమా చూశాక నన్నెవరూ పెళ్లి చేసుకోరని అమ్మ కంగారు పడింది: ‘MCA’ నటుడు
-
India News
CJI: ప్లీజ్.. మాస్కులు పెట్టుకోండి.. లాయర్లకు సీజేఐ సూచన
-
Crime News
Crime News: కోడలి తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అత్త
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ