NTR: ‘మహానటి’లో ఎన్టీఆర్‌ పాత్రకు జూనియర్‌ను ఎందుకు తీసుకోలేదో రివీల్‌ చేసిన అశ్వనీదత్‌

సావిత్రి జీవిత కథతో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘మహానటి’. కీర్తి సురేశ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ

Updated : 17 Aug 2022 15:34 IST

హైదరాబాద్‌: సావిత్రి జీవిత కథతో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘మహానటి’. కీర్తి సురేశ్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అయితే, ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య నటించగా, ఎన్టీఆర్‌ పాత్రను ఎవరూ చేయలేదు. ఆ పాత్రను జూనియర్‌ ఎన్టీఆర్‌ చేయాల్సిందని, కొన్ని కారణాల వల్ల కుదరలేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ చెప్పారు.

‘‘మహానటి’లో ఎన్టీఆర్‌ పాత్రను జూనియర్‌తో చేయిద్దామని అనుకున్నాం. ఆ ఆలోచన అందరికీ నచ్చింది. ఈలోగా బాలకృష్ణగారు ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ ప్రకటించారు. దీంతో మా సినిమాలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమోననిపించింది. ఒకవేళ ఎన్టీఆర్‌ను పెట్టి తీసినా బాగుండదేమోనని అనుకున్నాం. నాగీతో ఈ విషయం చెబితే, ‘అసలు రామారావుగారి పాత్ర లేకుండా తీస్తా’నని చెప్పాడు. అలా ఒకే ఒకషాట్‌ పెట్టాం. ఆ పామును పట్టుకునే సీన్‌ కూడా రామారావుగారి కెరీర్‌ ప్రారంభంలో నిజంగానే జరిగిందట. ఆ పాత్రకు రాజేంద్రప్రసాద్‌ డబ్బింగ్‌ చెప్పారు. మిగతా అంతా మేనేజ్‌ చేశాం. నిజ జీవితంలో ఎక్కువగా నాగేశ్వరరావుగారు-సావిత్రిగారు కలిసి సినిమాలు చేయడంతో చైతన్య కాంబినేషన్‌పై ఎక్కువ సీన్లు వచ్చేలా తీశాం’’

అందుకే అప్పట్లో తెదేపాలో చేరలేదు

‘‘ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు కృష్ణగారితో ‘అగ్నిపర్వతం’ చేస్తున్నా. కృష్ణగారేమో కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలా మందితో సినిమాలు చేయాలి. అప్పుడు రాజకీయాల్లోకి వస్తే, సినిమాలపరంగా సమస్య వస్తుందని వెనకడుగు వేశా. పైగా నేను చెన్నైలో ఉన్నా. మరొక విషయం ఏంటంటే, నా తండ్రి కమ్యూనిస్ట్‌. ఆ భావాలే నాకు ఉండేవి. అయితే, రామారావుగారి పార్టీ సూపర్‌హిట్‌ కావాలని కోరుకునేవాడిని. వచ్చినప్పుడల్లా వెళ్లి కనపడేవాడిని. ఆ పార్టీ సభ్యుడిగా మెలిగాను కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఇక దేశరాజకీయాల్లో గొప్ప విజన్‌ ఉన్న వ్యక్తి చంద్రబాబునాయుడు. ఆయనపై గౌరవంతో పార్టీలో చేరా. చిరంజీవిగారి ప్రోద్బలం, ఆయనే స్వయంగా చంద్రబాబుగారితో మాట్లాడి విజయవాడ సీటు ఇప్పించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ చంద్రబాబుగారి కోసం ప్రచార కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగడం లేదు. అయితే, చంద్రబాబుగారి కోసం నేను, స్వప్న ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. తరచూ ఆయన్ను కలుస్తూనే ఉన్నా. ఎన్నికల్లో పోటీ చేయాలని, పదవులు చేపట్టాలని అస్సలు లేదు’’

నాగార్జునను పరిచయం చేయాల్సింది..

‘‘అన్నపూర్ణా స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున కథానాయకుడిగా ‘విక్రమ్‌’ ప్రకటించారు. విషయం తెలుసుకుని మద్రాసు నుంచి హైదరాబాద్‌ వచ్చి నాగేశ్వరరావుగారిని కలిశా. ఆ సినిమా నేను చేస్తానని చెప్పా. వెంటనే వెంకట్‌ను పిలిచి, ‘మీరు చేయటం కాదు. దత్తు చేస్తే గౌరవం’ అని చెప్పారు. అయితే, అప్పటికే సినిమాను ప్రకటించడం, రికార్డింగ్‌ కూడా అయిపోయిందని చెప్పడంతో ‘వీళ్ల వారసుడినైనా నువ్వే పరిచయం చేయాలి’ అని నాగేశ్వరరావుగారు అన్నారు’’ అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు అశ్వనీదత్‌. ప్రస్తుతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ప్రభాస్‌ కథానాయకుడిగా ‘ప్రాజెక్ట్‌-కె’ నిర్మిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దీనికి దర్శకుడు. దీపిక పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని