kalki: ‘ఇది ఎందుకు?’ అని ఎప్పుడూ, ఏ దర్శకుణ్నీ అడగలేదు: అశ్వనీదత్‌

వైజయంతి మూవీస్‌ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అశ్వనీ దత్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా దీని ప్రోమో విడుదలైంది. 

Published : 09 Jul 2024 14:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). వైజయంతి మూవీస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ నిర్మాణ సంస్థ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత అశ్వనీదత్‌ (Ashwini Dutt) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ క్రమంలో నాగ్‌ అశ్విన్‌, ‘కల్కి’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

‘‘జనం దృష్టిలో నాగ్‌ అశ్విన్‌ గొప్ప వ్యక్తి కానీ, ఆయన గురించి ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. ‘హడావుడిగా మా ఇంటికి వస్తాడు.. చెప్పులు బయటి విడిచి లోపలికి వస్తాడు. వెళ్లేటప్పుడు నా చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడు.. ఆశ్చర్యం ఏమిటంటే.. వచ్చేటప్పుడు కూడా వాళ్ల నాన్న చెప్పులు వేసుకుని వస్తాడు’’ అంటూ నాగీ గురించి సరదా విషయాలను పంచుకున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రెండో భాగం గురించి మాట్లాడుతూ.. ‘‘కథ చర్చల దశలో ఉండగానే సినిమాను రెండు భాగాలుగా చేయాలని అనుకున్నాం. కమల్‌ హాసన్‌ సినిమాలో భాగం అవ్వగానే కచ్చితంగా రెండు భాగాలు చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పారు.

‘కల్కి’ టీమ్‌కు హ్యాట్సాఫ్‌.. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండమే..: మహేశ్‌ బాబు

1974లో మొదలైన వైజయంతి మూవీస్ ఈ ఏడాదితో 50 వసంతాలను పూర్తిచేసుకుంది. ‘ఎదురులేని మనిషి’ నుంచి ‘కల్కి 2898 ఏడీ’ వరకు అనేక భారీ విజయాలను సొంతం చేసుకుంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తుపాను సమయంలోనూ రికార్డులు సృష్టించింది. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం అంటూ తమ బ్యానర్‌ ఘనతల్ని అశ్వనీదత్‌ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘‘ఇండస్ట్రీకి మేం వచ్చి 50 ఏళ్లు దాటింది. నా మొదటి సినిమా నుంచి దర్శకుడు చెప్పింది విని, వారి విజన్‌కు ఏం కావాలో అవి ఇస్తూ వచ్చాను. ‘ఇది ఎందుకు?’ అని ఎప్పుడూ దర్శకుడితో చర్చించలేదు. ఆ రోజుల్లో నిర్మాతలుగా ఇండస్ట్రీకి వచ్చిన వారిలో నేను, అల్లు అరవింద్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాం. పరిశ్రమలో అనేక సమస్యలు ఎదురవుతాయి వాటిని సవాలుగా తీసుకొని ముందుకు సాగాలి’’ అని అశ్వనీదత్ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని