Athidhi Review: రివ్యూ: అతిథి: హీరో వేణు నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
హీరో వేణు తొట్టెంపూడి నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘అతిథి’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ‘డిస్నీ+హాట్‌స్టార్’లో మంగళవారం విడుదలైంది. ఎలా ఉందంటే?
వెబ్‌సిరీస్: అతిథి; నటీనటులు: వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా, అదితి గౌతమ్ (సియా గౌతమ్), రవి వర్మ, వెంకటేశ్ కాకుమాను తదితరులు; సంగీతం: కపిల్ కుమార్; ఛాయాగ్రహణం: మనోజ్ కాటసాని; కూర్పు: ధర్మేంద్ర కాకరాల; నిర్మాత: ప్రవీణ్ సత్తారు; రచన, దర్శకత్వం: భరత్ వై.జి.; ఓటీటీ ప్లాట్‌ఫామ్: డిస్నీ+ హాట్‌స్టార్.
‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘చెప్పవే చిరుగాలి’లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న హీరో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). కొన్నాళ్ల విరామం అనంతరం గతేడాది ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘అతిథి’ వెబ్‌సిరీస్‌లోనూ నటించారు. ‘గుంటూరు టాకీస్’, ‘గరుడవేగ’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) ఈ సిరీస్‌కు నిర్మాత. భరత్ వై.జి. దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో మంగళవారం విడుదలైంది. మరి, ఆ కథేంటి? తొలిసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన వేణు విజయం అందుకున్నారా? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి (Athidhi Review)..
ఇదీ కథ: సవారి (వెంకటేశ్ కాకుమాను) యూట్యూబర్. ఫలానా చోట దెయ్యం ఉందనే సమాచారం తెలిస్తే చాలు అక్కడికెళ్లి అదంతా భ్రమ అని తన ఫాలోవర్స్‌కు నిరూపించాలనుకుంటాడు. తన సాహసానికి సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించి యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తుంటాడు. ఆ నేపథ్యంలోనే ఓరోజు దెయ్యాల మిట్ట అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఎదురైన ఓ సంఘటనతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని దగ్గర్లో ఉన్న ‘సంధ్య నిలయం’ చేరుకుంటాడు. కథా రచయిత రవివర్మ (వేణు తొట్టెంపూడి) ఆ ఇంటి యజమాని. ఆ పెద్ద భవంతిలో రవివర్మ, ఆయన భార్య (అదితి గౌతమ్) మాత్రమే ఉంటారు. సవారి కంటే ముందు ఆ ఇంటికి మాయ (అవంతిక మిశ్రా) అనే అమ్మాయి వస్తుంది. సవారి ఆమెను దెయ్యం అని అనుమానిస్తాడు. చివరకు అదే ఇంట్లో మాయ చనిపోతుంది. ఆమె చావుకు కారణం ఎవరు? అవంతిక దెయ్యం అనే సవారి అనుమానం నిజమైందా, లేదా? అందరూ చెప్పినట్లు దెయ్యాల మిట్టలో దెయ్యాలు ఉన్నాయా, అవన్నీ కట్టు కథలేనా? ఇంద్రభవనంలాంటి ఇంట్లో ఆ ఇద్దరే ఉండడానికి కారణమేంటి? అసలు రవి వర్మ కుటుంబ నేపథ్యం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే (Athidhi Webseries Review).
ఎలా ఉందంటే: అరిషడ్వర్గాల (కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం) వల్ల మనిషి పతనమవుతాడనే విషయాన్ని ఈ సిరీస్‌తో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు భరత్. ఈ సందేశాత్మక కథకు దెయ్యం కాన్సెప్ట్‌ను ముడిపెట్టడం కొత్తగా ఉంది. ఓ వ్యక్తి భయంతో పరిగెడుతూ కనిపించే ఓపెనింగ్ సీన్‌తోనే సిరీస్‌పై ఆసక్తి పెరుగుతుంది. సుమారు 30 నిమిషాల నిడివితో ఆరు ఎపిసోడ్లలో ఈ కథ సాగుతుంది. పాత్రల పరిచయంతో తొలి ఎపిసోడ్ కాస్త నెమ్మదిగా అనిపించినా ఆ తర్వాత నుంచి వేగం పుంజుకుంటుంది. మాయ దెయ్యమా? అని సవారి పాత్రకు వచ్చిన సందేహమే ప్రేక్షకుడికీ కలిగేలా కథనాన్ని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే, హారర్ ఎలిమెంట్స్‌ను పెద్దగా ఎలివేట్ చేయలేకపోయారని అనిపిస్తుంది. అంతర్గతంగా వచ్చే రెండు ఉపకథల్లో ఒకటి నవ్వులు పంచగా మరొకటి సీరియస్‌నెస్ క్రియేట్ చేస్తుంది. మాయ చనిపోవడం, అదే సమయంలో ఓ పోలీసు అధికారి ఎంట్రీ ఇవ్వడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆయా సన్నివేశాలకు నేపథ్య సంగీతం బలాన్ని చేకూర్చింది (Athidhi Webseries Review).
‘ది వ్యాక్సిన్ వార్’పై సుధా మూర్తి రివ్యూ
మాయ శవాన్ని పూడ్చిపెట్టే క్రమంలో సవారికి అసలు విషయం తెలియడం మరో ట్విస్ట్. అరిషడ్వర్గాల గురించి రవి వర్మ కథలు ఎందుకు రాశాడో ఆ సీన్‌తోనే అర్థమవుతుంది. ఆ క్రమంలో వచ్చే రవి వర్మ ఫ్లాష్‌బ్యాక్ అలరిస్తుంది. రాతి యుగమైనా రాకెట్ యుగమైనా మనిషికి అత్యాశ ఉంటుందనే అంశాన్ని గుర్తుచేస్తుంది. రవి వర్మ నిజ స్వరూపాన్ని చూపించే క్లైమాక్స్ ఓ స్థాయిలో థ్రిల్ పంచుతుంది. కొన్ని ఎపిసోడ్లలో ప్రేక్షకుడికి ఎదురయ్యే ప్రశ్నలకు ఆఖరి ఎపిసోడ్‌లో సమాధానం లభిస్తుంది. సిరీస్ చివరిలో వినిపించే ‘ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే’ అనే డైలాగ్‌తో దర్శకుడు సీజన్ 2కు హింట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది(Athidhi Webseries Review). లాజిక్స్‌ని పక్కనపెడితే ఈ సిరీస్ మంచి అనుభూతి పంచుతుంది.
ఎవరెలా చేశారంటే: ఎక్కువగా కామెడీ పాత్రలు పోషించిన వేణు ఇందులో పూర్తిస్థాయిలో సీరియస్‌గా కనిపిస్తారు. రచయిత రవి వర్మతోపాటు మరో కీలక పాత్రకు న్యాయం చేశారు. అవంతిక మిశ్రా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ వెంకటేశ్ కాకుమాను సవారిగా తాను భయపడుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతారు. అదితి గౌతమ్ పాత్ర పరిధి మేరకు నటించారు. కపిల్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. మనోజ్ క్యాప్చర్ చేసిన విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడికి మంచి మార్కులే పడ్డాయి (Athidhi Webseries Review).
- బలాలు
- + చివరి మూడు ఎపిసోడ్లలోని మలుపులు
- + వేణు నటన
- + నేపథ్య సంగీతం
- బలహీనతలు
- - తొలి ఎపిసోడ్‌లో పలు రొటీన్ సీన్స్
- - హారర్ ఎలిమెంట్స్ ప్రభావం చూపకపోవడం
- చివరిగా: ఈ ‘అతిథి’ మంచి కాలక్షేపాన్నిస్తుంది (Athidhi Webseries Review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా
-
ODI WC 2023: రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్ వైస్ కెప్టెన్