ATM Review: రివ్యూ: ఏటీఎం.. వీజే సన్నీ ఏ పాత్రలో కనిపించాడంటే?

వీజే సన్నీ, దివి, సుబ్బరాజు, పృథ్వీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఏటీఎం’. హరీశ్‌ శంకర్‌ కథ అందించిన ఈ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 20 Jan 2023 18:07 IST

ATM Webseries Review వెబ్‌ సిరీస్‌: ఏటీఎం; నటీనటులు: వీజే సన్నీ, పృథ్వీ, సుబ్బరాజు, దివి, దివ్యవాణి తదితరులు; సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి; సినిమాటోగ్రఫీ: మోనిక్‌ కుమార్‌ జి; ఎడిటర్: అశ్విన్‌ ఎస్‌; సంభాషణలు: విజయ్‌ ముత్యం, సీపీ ఇమ్మాన్యుయేల్‌; కథ: హరీశ్‌ శంకర్‌; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సి. చంద్రమోహన్‌; నిర్మాణ సంస్థ: దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌; స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: జీ 5.

సినీ నటులతో పాటు దర్శక, నిర్మాతలూ ట్రెండ్‌కు తగ్గట్టు వెబ్‌సిరీస్‌లకూ పనిచేస్తున్నారు. అలా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కథ అందించగా దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ (Dil Raju Productions) సంస్థలో రూపొందిన సిరీస్‌ ‘ఏటీఎం’ (ATM). కొంతకాలంగా ప్రేక్షకులను ఊరిస్తున్న ఈ సిరీస్‌ ఓటీటీ ‘జీ 5’ (Zee 5)లో శుక్రవారం విడుదలైంది. మరి, హరీశ్‌ రాసిన కథేంటి? ఎలా ఉంది? (ATM Webseries Review)..

ఇదీ కథ: జగన్‌ (వీజే సన్నీ-VJ Sunny)ది హైదరాబాద్‌లోని ఓ బస్తీ. బాల్యంలోనే తల్లిని కోల్పోతాడు. ఏం అడిగినా కొనివ్వట్లేదని, మంచి పాఠశాలకు పంపించట్లేదని తన తండ్రిపై కోపం పెంచుకుంటాడు. తండ్రిలా పేదవాడిగా కాకుండా ధనవంతుడిగా మారాలనుకుంటాడు. అదే ఆలోచన ఉన్న మరో ముగ్గురితో స్నేహం చేస్తాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించి, జల్సా చేసేందుకు ఆ నలుగురు చిన్న చిన్న చోరీలు చేస్తుంటారు. కట్‌చేస్తే, పెద్దయ్యాక ఓ కారును కొట్టేస్తారు. రూ. 10 కోట్ల విలువైన వజ్రాలున్నాయని తెలియక దాన్ని అమ్మేస్తారు. వజ్రాలు లేదా రూ. 10 కోట్లు తిరిగి ఇవ్వాలంటూ కారు యజమాని జగన్‌ గ్యాంగ్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. దాంతో, చేసేదేమీ లేక ఆ నలుగురు మళ్లీ ఓ దోపిడికి పాల్పడతారు. పక్కా ప్లానింగ్‌తో ఏటీఎంలకు నగదును తీసుకెళ్లే సెక్యూరిటీ వ్యాన్‌ను కొట్టేస్తారు. అందులో రూ. 25 కోట్లు ఉంటాయి. ఈ కేసును ఛేదించేందుకు వచ్చిన ఏసీపీ హెగ్డే (సుబ్బరాజు).. స్థానిక బస్తీ కార్పొరేటర్‌ గజేంద్ర (పృథ్వీ)ను ఎందుకు అరెస్ట్‌ చేశాడు? జగన్‌ స్కెచ్‌కు, గజేంద్రకు సంబంధమేంటి? హెగ్డే ఆ డబ్బును రికవరీ చేయగలిగాడా? అన్నది సిరీస్‌ (ATM Webseries Review) చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే? ఏటీఎం అనగానే ఠక్కున గుర్తొచ్చేది డబ్బే. టైటిల్‌ ప్రకటించినప్పుడే ఈ కథ మనీ నేపథ్యంలో సాగుతుందనే విషయం చాలామందికి అర్థమై ఉంటుంది. చెమట చిందించకుండా డబ్బు కోసం పాకులాడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో వార్తల్లో, ఎన్నో సినిమాల్లో కనిపించాయి. ఈ సిరీస్‌ కూడా అదే ఇతివృత్తంగా రూపొందింది. దాంతోపాటు పాలిటిక్స్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రారంభ సన్నివేశంతోనే హీరో క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది? అనే విషయం తెలుస్తుంది. కథానాయకుడు తన స్నేహితులతో కలిసి ఏదో నేరం చేశాడని, దాన్నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని అర్థమవుతుంది. హీరో, అతని ఫ్రెండ్స్‌ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌, కార్పొరేటర్‌ గజేంద్ర పాలిటిక్స్‌, సీఐ ఉమాదేవి (దివ్యవాణి) ఇగో.. సంబంధిత సన్నివేశాలతో తొలి మూడు ఎపిసోడ్లు నెమ్మదిగా సాగుతాయి. ఒకానొక సమయంలో ఉమాదేవి పాత్ర మ్యానరిజం అసహనానికి గురి చేస్తుంది. హీరో, అతని మిత్రుల ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సీన్స్‌లో ఎమోషన్‌ అంతగా పండలేదు. సిరీస్‌లోని చాలా పాత్రలు ద్వందార్థాలు పలుకుతాయి. హెగ్డే రాకతో నాలుగో ఎపిసోడ్‌ నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి మొదలవుతుంది.

దొంగ- పోలీసు ఆటను తెరపై ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు కదా. అయితే, ఎత్తుకుపైఎత్తు వేసే తీరుపైనే ఈ కథ విజయం ఆధారపడి ఉంటుంది. ‘ఏటీఎం’ విషయంలో దర్శకరచయితలు సక్సెస్‌ అయినట్టే. వ్యక్తిగతంగా తనపై కంప్లైట్స్‌ ఉన్నా వృత్తిపరంగా శభాష్‌ అనిపించుకునే హెగ్డే.. జగన్‌ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు చిక్కుముడులు విప్పే తీరు ఆకట్టుకుంటుంది. పోలీసు అధికారి ఆలోచనను ముందుగానే పసిగట్టి ఏ క్లూ దొరక్కుండా జగన్‌ టీమ్‌ చేసే ప్రయత్నమూ మెప్పిస్తుంది. మధ్యలో, గజేంద్ర పంచ్‌లు, కానిస్టేబుల్‌ దాస్‌- హెగ్డేల కాంబినేషన్‌లో వచ్చే సంభాషణలు నవ్విస్తాయి. అలా సరదాగా సాగుతూనే క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్‌ రిలీవ్‌ అవుతుంది. హెగ్డే ఊహించినట్టు జగన్‌ గ్యాంగ్‌కు సాయం చేసిన వ్యక్తి ఎవరు? గజేంద్రకు, జగన్‌కు మధ్య వైరం ఏంటి? అన్న ప్రశ్నలను సంధిస్తూ సీజన్‌ 2పై ఆసక్తి రేకెత్తించేలా చేశారు మేకర్స్‌. 

ఎవరెలా చేశారంటే? ‘బిగ్‌బాస్’ విజేతగా ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న వీజే సన్నీ.. జగన్‌ అనే బస్తీ యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. అతని మాస్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. అతను లారీపై నిల్చొనే షాట్స్‌ ‘పుష్ప’ సినిమాను తలపిస్తాయి. హెగ్డే పాత్ర సుబ్బరాజు కెరీర్‌లో బెస్ట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఎప్పటిలానే పృథ్వీ సీరియస్‌, సరదా మాటలతో అలరించారు. దివ్యవాణి పోషించిన పాత్ర ఏమాత్రం ప్రభావం చూపదు. దివిని ముద్దు సన్నివేశాలకే పరిమితం చేశారనిపిస్తుంది. హీరో స్నేహితులుగా కనిపించిన కృష్ణ బూరుగుల, రవిరాజ్‌, రోయిల్‌ శ్రీ ఓకే అనిపిస్తారు. ప్రశాంత్‌ ఆర్‌. విహారి అందించిన నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు ప్రధాన బలంగా నిలిచింది. ఏటీఎం వ్యాన్‌ను చోరీ చేసే సీన్‌లో వచ్చే స్మోక్‌ ఎఫెక్ట్‌కు సంబంధించి ఛాయాగ్రహణం అదుర్స్‌ అనిపిస్తుంది. ఎడిటర్‌ అశ్విన్‌ కొన్ని పాత్రల నిడివిని కట్‌ చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌, టేకింగ్‌ బాగున్నా, కథనాన్ని కాస్త గ్రిప్పింగ్‌ మార్చి ఉంటే సిరీస్‌ మరో స్థాయిలో ఉండేది. 

బలాలు: + సుబ్బరాజు పాత్ర; + క్లైమాక్స్‌ ట్విస్ట్‌; + నేపథ్య సంగీతం

బలహీనతలు:  - తొలి ఎపిసోడ్లలో సాగదీత ; -  మితిమీరిన ద్వందార్థ సంభాషణలు

చివరిగా: ఈ ‘ఏటీఎం’.. చూడొచ్చు వన్‌టైమ్‌!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని