Avatar 2 OTT Release Date: ఓటీటీలో అవతార్‌ 2.. ప్రీబుకింగ్‌ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే!

Avatar 2 OTT Rent price: జేమ్స్‌కామెరూన్‌ తెరకెక్కించిన ‘అవతార్2’  మార్చి 28వ తేదీ నుంచి డిజిటల్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ మూవీ రెంట్‌ ప్రైస్‌ను చిత్ర బృందం ప్రకటించింది.

Updated : 26 Mar 2023 16:36 IST

హైదరాబాద్‌: జేమ్స్‌ కామెరూన్‌(James Cameron) సృష్టించిన మరో లోకం ‘అవతార్‌2’(Avatar2: The Way Of Water). భారీ అంచనాల మధ్య గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది.  ప్రపంచవ్యాప్తంగా 2.305 బిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. ఇక అకాడమీ అవార్డుల్లోనూ ‘ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌’ చిత్రంగా ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సినీ ప్రేక్షకులందరూ ‘అవతార్2’ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. మార్చి 28వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని డిజిటల్‌గా (avatar 2 digital release date) అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. కేవలం ఒకే ఓటీటీ వేదికపై కాకుండా పలు వేదికల్లో ‘అవతార్2’ స్ట్రీమింగ్‌ కానుంది.  ఇందుకు సంబంధించిన వివరాలను ‘అవతార్‌’ టీమ్‌ తాజాగా వెల్లడించింది.

మార్చి 28వ తేదీ నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదికలైన మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో ‘అవతార్2’ స్ట్రీమింగ్‌ కానుంది. అయితే, తొలుత ఈ మూవీని అద్దె ప్రాతిపదికన అందుబాటులో తెస్తున్నారు. ఈ సినిమా చూడాలని ఆసక్తి ఉన్న వారు ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చు. డిస్నీ మూవీస్‌ ఇన్‌సైడర్స్‌ వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాలను ఉంచారు.  మరి ఇంతకీ ఈ మూవీ అద్దె ఎంతో తెలుసా? 19.99 అమెరికన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,600. మార్చి 28వ తేదీ ఉదయం 9.30గంటల నుంచి ‘అవతార్2’ చూడొచ్చు. ఒకసారి మూవీని ప్రీఆర్డర్‌ చేసిన తర్వాత 48 గంటల్లోగా క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. (యూకే, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఉండేవారికి 14 రోజుల వెసులుబాటు) అయితే, సినిమా చూడటం, డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత క్యాన్సిల్‌ చేయడం కుదరదు. ‘అవతార్‌2’ 4కె అల్ట్రా హెచ్‌డీ, డాల్బీ అట్‌మాస్‌ ఆడియోతో రానుంది.

ఇక ‘అవతార్2’ సినిమా విషయానికొస్తే, 2009లో విడుదలైన ‘అవతార్‌’కు కొనసాగింపుగా ఈ సినిమా సిద్ధమైంది. తొలి భాగం పండోరా గ్రహంలోని సుంద‌ర‌మైన అట‌వీ, జీవ‌రాశుల ప్రపంచం చుట్టూ సాగింది. రెండో భాగంలో నీటి అడుగున అద్భుత దృశ్యాలను ఆవిష్కరించారు. పాండోరా గ్రహం నుంచి తమను వెళ్లగొట్టిన జేక్‌, అతని కుటుంబ సభ్యులపై మానవులు పగ పెంచుకుంటారు. అతడిని నాశనం చేసేందుకు మళ్లీ పాండోరాకు తిరిగి వస్తారు. దీంతో జేక్‌ తన కుటుంబంతో కలిసి అదే గ్రహంలో ఉన్న మరో ప్రాంతానికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? మానవుల నుంచి జలచరాలను ఎలా కాపాడాడు? అన్నది చిత్ర కథ. ఈ చిత్రానికి కొనసాగింపు ‘అవతార్3’ కూడా రానుంది. ‘అవతార్‌: ది సీడ్‌ బారియర్‌’ పేరుతో రానున్న ఈ మూవీ డిసెంబరు 20, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని